ఉపాధ్యాయుల మధ్య గొడవ బడికి తాళాలు వేసిన గ్రామస్తులు

ఉపాధ్యాయుల మధ్య గొడవ బడికి తాళాలు వేసిన గ్రామస్తులునవతెలంగాణ-ఆసిఫాబాద్‌
ఉపాధ్యాయుల విచక్షణ లేకుండా పాఠశాలలో గొడవ పడడంతో విద్యార్థులు భయంతో గ్రామంలోకి పరుగులు తీశారు. గ్రామస్తులు వచ్చి పాఠశాలకు తాళం వేయడం మండలంలో కలకలం రేపింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని సాలెగూడ గ్రామ ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులు విద్య నభ్యసిస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడు అనంతరావు, గతంలో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి ప్రస్తుతం ఉపాధ్యాయునిగా ఉన్న తిరుపతి మధ్య గత శుక్రవారం గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు పాఠశాలలోనే దాడి చేసుకోవడంతో భయకంపితులైన విద్యార్థులు గ్రామంలోకి పరుగులు తీశారు. తల్లిదండ్రులకు తెలియజేయడంతో పలువురు వెంటనే పాఠశాలకు చేరుకున్నారు. అప్పటికే ఇరువురు పాఠశాల నుండి వెళ్లిపోయారు. శని ఆదివారాలు సెలవు దినాలు కావడంతో సోమవారం గ్రామస్తులు పాఠశాలకు చేరుకొని విషయం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకొని ఉన్నతాధికారులు స్పందించాలనే ఉద్దేశంతో పాఠశాలకు తాళం వేశారు. పాఠశాల అభివృద్ధి నిధుల్లో భాగంగా ఇరువురి మధ్య గొడవ వచ్చినట్లు గ్రామస్తులు తెలియజేశారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు పాఠశాల వేదికగా కొట్టుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు పాఠశాలకు తాళం వేసినట్లు వివరించారు. సదరు ఉపాధ్యాయులను పాఠశాల నుండి తొలగించాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. ప్రధానోపాధ్యాయుడు సోమవారం పాఠశాలకు రాకపోవడంతో గ్రామస్తులు పాఠశాల వద్ద బైటాయించారు. మండల విద్యాధికారి మనుకుమార్‌ అక్కడికి చేరుకొని గ్రామస్తులను ఒప్పించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ గ్రామస్తులు ఒప్పుకోకపోవడంతో మంగళవారం గ్రామస్తుల సమక్షంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులతో మాట్లాడతానని, గొడవకు గల కారణాలు తెలుసుకొని కారణమైన వారిపై చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో అక్కడి నుండి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం 10గంటలకు పాఠశాలకు రావాలని గ్రామస్తులకు సూచించారు.