పల్లెలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

The villages should be kept clean– కలెక్టర్‌ వెంకటేశ్‌ ధోత్రే
నవతెలంగాణ-ఆసిఫాబాద్‌
పల్లెలను పరిశుభ్ర పరచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ వెంకటేశ్‌ ధోత్రే అన్నారు. గురువారం మండలంలోని బూరుగుడ గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో అధికారులతో కలసి మొక్కలను నాటారు. పాఠశాల విద్యార్థులు పుష్ప గుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములై మొక్కలను నాటాలన్నారు. ఇంటి పరిసరాలలో చెడిపోయిన సామగ్రి బయట పడేయడంతో అందులో వర్షం నీరు చేరి దోమలు తయారవుతాయని, దీంతో జ్వరాల బారిన పడతారన్నారు. ఇంటి పరిసరాల ఆవరణలో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని తెలిపారు. గ్రామంలో ప్రతి ఇంటికి సర్వే చేసి జ్వరపీడితులను గుర్తించి, వారికి వైద్య చికిత్సలు అందించాలని, సీజనల్‌ వ్యాధుల వ్యాప్తిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. గ్రామాలలో వీధి కుక్కల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పశు వైద్యాధికారులను ఆదేశించారు. రహదారులకు ఇరువైపులా చెత్త, చెదారం లేకుండా గ్రామపంచాయితీ కార్మికుల చేత ప్రతి రోజు శుభ్రం చేయించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలలో మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలన్నారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలమహిళలతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరచడానికి మహిళ శక్తి పథకాన్ని ప్రారంభించిందని, ఈ పథకాన్ని అర్హులైన మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉపాధి హామీ కూలీ పనులు చేసి మూడు నెలలు అవుతున్న కూలీ డబ్బులు రావడం లేదని కలెక్టర్‌ దృష్టికి తీసుకరావడంతో వెంటనే పీడీతో మాట్లాడి మూడు రోజులలో వారికి కూలీ డబ్బులు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణ ప్రాజెక్టు అధికారి దత్తారం, డివిజనల్‌ పంచాయతీ అధికారి ఉమర్‌ హుస్సేన్‌, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్‌, గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీలత పాల్గొన్నారు.