పీడిత ప్రజల గొంతుక ధర్మభిక్షం

పీడిత ప్రజల గొంతుక ధర్మభిక్షం– బహుముఖ ప్రజ్ఞాశాలి
– భారత ప్రభుత్వం నుంచి తామ్రపత్రం ప్రదానం
– ప్రజా జీవితమే పరమావధిగా గడిపిన ఆదర్శ నేత
విద్యార్థి నాయకుడు.. హాకీ టీం కెప్టెన్‌.. ఆర్య సమాజ్‌ సారథి..ఆంధ్ర మహాసభ ఆర్గనైజర్‌.. కార్మిక సంఘాల నాయకుడు.. తెలంగాణ సాయుధ పోరాట యోధులు.. కమ్యూనిస్టు, జర్నలిస్టు, ఎమ్మెల్యే, ఎంపీగా.. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి బొమ్మగాని ధర్మభిక్షం. చట్టసభల్లో పీడిత ప్రజల గొంతుకగా నిలిచారు. అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందిన మహానాయకుడు.
నవతెలంగాణ- సంస్థాన్‌ నారాయణపురం
ధర్మభిక్షం అసలు పేరు బొమ్మగాని భిక్షం. 1922 ఫిబ్రవరి 15న మునుగోడు మండలం ఊకోండి గ్రామంలో గీతకార్మికు కుటుంబంలో బొమ్మగాని ముత్తిలింగం-గోపమ్మ దంపతులకు జన్మించారు. తల్లిదండ్రులు సూర్యాపేటలో స్థిరపడటంతో అక్కడే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్‌, అలీగ్రా యూనివర్సిటీ కోర్స్‌ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. పాఠశాల దశలోనే తోటి విద్యార్థులను చైతన్యపరచి నిజాం నవాబు జన్మదిన వేడుకలను బహిష్కరించిన తీరు అప్పట్లో పెద్ద సంచలనమైంది. భిక్షం నల్లగొండ జిల్లాలో తొలి విద్యార్థి నాయకుడిగా గుర్తింపు పొందారు. సూర్యాపేటలో ఆర్యసమాజంతో పాటు 1940లోనే తొలి విద్యార్థి హాస్టల్‌ను నిర్వహించడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. హాస్టల్లో పేద విద్యార్థులకు కడుపునిండా భోజనం పెట్టడంతోపాటు విద్యాబుద్ధులు నేర్పించేవారు. ఈ హాస్టల్‌ ప్రథమ వార్షికోత్సవ సభకు హాజరైన హైదరాబాద్‌ కోత్వాల్‌ రాజ్‌ బహుదూర్‌ వెంకట్రామిరెడ్డి ఆయనను ధర్మభిక్షంగా సంబోధించారు. ఒక చేతితో దానమడుగుతూ రెండో చేత్తో ధర్మం చేస్తున్న వ్యక్తి కేవలం భిక్షం కాదు ధర్మభిక్షం అని పేర్కొనడంతో ఆనాటి నుంచి ఆయన పేరు ధర్మభిక్షంగా స్థిరపడిపోయింది.
రాజకీయ జీవితం
1942లో సీపీఐలో చేరారు. 1951 నుంచి 1973 వరకు నల్లగొండ జిల్లా కార్యదర్శిగా, 1972లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బాధ్యతలు నెరవేర్చారు. పార్టీలో పని చేస్తూనే మీజాన్‌, రయ్యత్‌, గోల్కొండ పత్రికల్లో విలేఖరిగా పనిచేశారు. ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసి బ్రహ్మచారిగా ఉన్నారు. నిజాం నవాబు ఆగడాలను ఎదుర్కొనేందుకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో రాచకొండ గుట్టలను స్థావరాలుగా చేసుకొని సాయిధ దళాలు నడిపారు. ఐదేండ్లపాటు జైలు జీవితం గడిపారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా పనిచేసిన ధర్మభిక్షం చట్టసభల్లో పీడిత ప్రజల గొంతుక వినిపించారు. 1952లో సూర్యాపేట నుంచి, 1957లో నకిరేకల్‌ నుంచి పీడీఎఫ్‌ తరపున, 1962లో నల్లగొండ నుంచి కమ్యూనిస్టు పార్టీ తరపున శాసనసభలో ప్రాతినిథ్యం వహించారు. 1991లో సీపీఐ అభ్యర్థిగా నల్లగొండ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1996లో లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి 480 మంది ఫ్లోరైడ్‌ బాధితులు బరిలో ఉన్నప్పటికీ 76 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అప్పటి భారత ప్రభుత్వం నుంచి తామ్రపత్రం అందుకున్నారు.
గీత కార్మికుల హక్కుల కోసం పోరాటం
సూర్యాపేటతోపాటు నల్లగొండ జిల్లాను కేంద్ర బిందువుగా మార్చడంలో ధర్మభిక్షం సాగించిన కృషి స్ఫూర్తి దాయకం. దున్నేవాడిదే భూమి అన్నట్టుగా గీసేవాడిదే చెట్టు అన్న నినాదం ఇచ్చి గీతకార్మికుల హక్కుల కోసం పోరాడారు. ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడిపోయిన కార్మికులకు ఆయన కృషి ఫలితంగానే ఎక్స్‌గ్రేషియా అమలులోకి వచ్చింది. ప్రజాఉద్యమ క్షేత్రంలో, చట్టసభల్లోనూ పేదల పక్షాన నిలబడి, వారి తరఫున కలబడిన ధర్మభిక్షం 2011 మార్చి 26న తుదిశ్వాస విడిచారు.