గ‌ళ‌మే అత‌నికి చూపైంది

The voice was shown to himమనిషి జీవితానికి శారీరక, మానసిక అంగవైకల్యం తీరనిలోటు. అలాంటి వారి జీవన విధానం ఎంత దుర్భరంగా ఉంటుందో అనుభవిస్తే గాని అర్థం కాదు. వాటన్నిటినీ తట్టుకొని కొంతమంది అత్యున్నత ప్రతిభ ప్రదర్శిస్తున్నారు. అలాంటి వారిలో రాజు ఒకరు. రంగారెడ్డి జిల్లా, శంషాబాద్‌ మండలం ధమ్సీగూడ గ్రామం చెందిన హనుమయ్య, సత్తవ్వల నాల్గో సంతానం రాజు. ముగ్గురు అక్కలు, ఒక చెల్లి. పెద్ద కుటుంబమే. అయితే రాజుకు పుట్టుకతోనే కళ్లు లేవు. అసలే పేదరికం… ఆపై పుట్టుకతో వచ్చిన దష్టి లోపం తనలో ఎన్నో ఆవేదనలు, ఆందోళనలకు గురిచేసింది. అయితే చిన్నప్పటి నుంచీ పాటలంటే రాజుకి ఎంతో ఇష్టం.

సంగీత పాఠాలు నేర్వకుండానే స్వరాలను ఒంటబట్టించుకున్నాడు. పక్కింటి టేప్‌ రికార్డ్‌లో వచ్చే పాటలు వింటూ ఏకలవ్య సాధన చేశాడు. తన పాటకి తానే తాళం కొట్టుకోవాలని ఓ కిరోసిన్‌ డబ్బా, సత్తు రూపాయి బిళ్ల సాధనాలుగా చేసుకున్నాడు. అక్కడ నుంచి మొదలైన రాజు ప్రయాణం ఇప్పుడు సంగీత దర్శకుడు తమన్‌ తన సినిమాలో పాట పాడించుకునే వరకు వెళ్లింది.
ఇలా మొదలైంది.. పాట
పాటలు ఎలా సాధన చేశావు అని రాజుని ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘నాకు పాడాలని చిన్నప్పటి నుంచి ఉండేది. కళ్లు లేవని, అందరిలా ఆడుకోవడం లేదని చాలా బాధపడేవాడ్ని. కళ్లు ఉంటే బాగుండు అని ఎన్నో సార్లు అనుకునేవాణ్ణి. ఇంట్లోనే ఉండేవాణ్ణి. ఎక్కడికీ వెళ్లలేకపోయేవాణ్ని. అప్పుడే నా చెవులకి దూరంగా ఓ పాట వినిపించింది. అది టేప్‌రికార్డర్‌ నుంచి వస్తోంది. అప్పట్లో టేప్‌ రికార్డులు వచ్చిన కొత్త. మా ఊళ్లో ఎక్కువ సౌండ్‌ పెట్టి వినేవాళ్లు. అలా ఆ పాటలు నా చెవినపడ్డాయి. ఆ పాటలు నన్ను గుమ్మం దాటేలా చేశాయి. పాట ఇంకా బాగా వినిపించాలని ఆ శబ్ధం వస్తున్నవైపు వెళ్లి పిట్టగోడపై కూర్చొని వినేవాడ్ని. ఇంట్లో ఉన్న కిరోసిన్‌ డబ్బా, రూపాయి బిళ్లతో సహా గోడ ఎక్కేసేవాడ్ని. అక్కడే పాటకి తగ్గట్టుగా తాళం వేసుకుంటూ హమ్మింగ్‌ చేసేవాడ్ని. మొదట్లో నాకు పాట పాడడం వచ్చేది కాదు. హమ్మింగ్‌ చేస్తూ చేస్తూ పైకి పాడడం అలవాటైంది. వానొచ్చినా, ఎండొచ్చినా, చలిగా ఉన్నా పాటే నా తోడైంది’ అంటూ తన తొలి ప్రయాణం రోజులను రాజు గుర్తుకుచేసుకున్నారు.
కండ్లు ఉంటే బాగుణ్ణు అనుకున్నా..
‘నాన్న చనిపోయాక అమ్మే నా ఆలనాపాలనా చూసుకుంటోంది. నేను ఎక్కడికి వెళ్లాలన్నా అమ్మే తీసుకెళ్తుంది. సంగీతం క్లాసులకు వెళ్లాలంటే రోజుకు నాలుగైదు బస్సులు మారాలి. ఇంత ప్రయాణంలో ఆమె నాకు తోడుంటుంది. ఇప్పుడు తను కూడా పెద్దదైపోయింది. అందుకే చెల్లి వాళ్లు చూసుకుంటున్నారు. ఈ పరిస్థితే నాకు బాధేస్తుంది. నేనెప్పుడూ ఒకరి మీద ఆధారపడకూడదని అనుకుంటాను. సొంతంగా నడవాలని, పరుగెత్తాలని, ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లాలని అనుకునేవాడ్ని. అది మాత్రం తీరడం లేదు.. తీరదని కూడా చెప్పేశారు’ అంటున్న రాజు, కండ్లు బాగు చేయించుకోవాలని చాలా ప్రయత్నం చేశారు. అయితే చికిత్స వల్ల ఇప్పుడు చూపు రాదని వైద్యులు తేల్చి చెప్పేశారు. ‘ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు దఫదఫాలుగా నాకు పరీక్షలు చేశారు. చివరికి చూపు రాదని చెప్పారు. అప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది. ఎలాగైనా చూపు వస్తుందని ఎంతో ఆశపడ్డాను’ అని చెబుతున్న రాజు మాటలు ఆ క్షణం బాధతో వణికాయి.
గొంతుతో పాట.. చేత్తో వాయిద్యం
రాజులో అన్నీ ప్రత్యేకతలే.. మొదటిసారి పాట మొదలు పెట్టినప్పుడు కిరోసిన్‌ డబ్బా, రూపాయి బిళ్లతో ఎలా దరువు వేశాడో.. ఇప్పుడు కూడా అలాగే.. కుడిచేత్తో ఒక రకమైన శబ్ధం వచ్చేలా చేస్తాడు. అది ఎలా ఉంటుందంటే చిడతలతో వచ్చినంత గంభీరమైన స్వరం అక్కడ వినిపిస్తుంది. రెండో చేత్తో కాలిపై తాళం వేస్తున్నట్లుగా దరువు వేస్తాడు. మాస్‌ పాటైనా, క్లాస్‌ పాటైనా రెండు చేతులూ అలా ఆడిస్తూనే పాట పాడడం రాజు అలవాటు. అతను పాట పాడడం చూసిన వారెవరైనా తనలా అనుకరించాలని చూసినా అది అసలు సాధ్యం కాదు.
‘పలాస’ టైటిల్‌ సాంగ్‌ రాజుదే..
సినిమా రంగంలోకి రాజు ప్రవేశం యాదచ్ఛికం కాదు. ఎన్నో రోజులు.. కాదు కాదు.. ఎన్నో సంవత్సరాలు ఎంతోమందిని రాజు కలిశాడు. తన అభిమాన గాయకుడు ఎస్‌.బి.బాలసుబ్రమణ్యాన్ని కలవాలని ఎంతో తపించాడు. అప్పుడు అందరూ అతణ్ణి పిచ్చివాడని అన్నారు. ‘నువ్వేంటి బాలు సార్‌ని కలవడమేంటి’ అని నవ్వారు. ఎగతాళి చేశారు. అయినా రాజు తన ప్రయత్నాలు ఆపలేదు. స్థానికంగా ఎక్కడ సినిమా షూటింగులు ఉంటే అక్కడ ప్రత్యక్షమైపోయేవాడు. అలా 2014లో కొరియోగ్రాఫర్‌ జాకీ మాస్టర్‌కి రాజు గురించి తన సహచరుడి ద్వారా తెలిసింది. ఆయన రాజుతో ‘సదా శివ..’ అంటూ సాగే పాట పాడించుకుని ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు. అప్పట్లో అది బాగా వైరల్‌ అయ్యింది. ఆ మాస్టారు ప్రోత్సాహంతోనే తనని వెతుక్కుంటూ ఓ అవకాశం వచ్చిందని రాజు చెబుతారు.
‘సంగీత దర్శకులు రఘు కుంచె 2019లో ‘పలాస’లో రాజుతో టైటిల్‌ సాంగ్‌ పాడించారు. ‘నాకు మొట్టమొదట అవకాశం ఇచ్చింది ఆయనే. జులై 19న ఆ పాట పాడాను’ అని చెబుతున్న రాజు.. ఎప్పుడెప్పుడు ఎవరెవరిని కలిసిందీ, ఆ తేదీలు, వారాలు, సంవత్సరాలు ఎక్కడా తడబడకుండా చెబుతారు. ఎప్పుడో చాన్నాళ్ల క్రితం జరిగిన సంఘటనలను గురించి అంత గుర్తుగా చెబుతున్నప్పుడు అతని జ్ఞాపకశక్తిని మెచ్చుకోకుండా ఉండలేం.
రామాచారి మాస్టారు శిష్యరికం
ఎందరో గాయనీ గాయకులను సినీ పరిశ్రమకి పరిచయం చేసిన రామాచారి మాస్టారు దగ్గర రాజు ఇప్పుడు సంగీతంలో నైపుణ్యం సాధిస్తున్నాడు. ఇక్కడికి తన స్నేహితుడి ద్వారా రాజు వచ్చారు. కాలేజీకి వెళ్లే ఆ స్నేహితుడే ఐదు సెషన్ల వరకు రాజుని సంగీతం క్లాసులకు తీసుకొచ్చేవాడు. ఇప్పుడు అతను వేరే ఊరు వెళ్లిపోవడంతో రాజు వాళ్ల అమ్మ ఆ బాధ్యత తీసుకొంది. రామాచారి మాస్టారంటే రాజుకు వల్లమాలిన అభిమానం. వేలల్లో విద్యార్థులున్న ఆ మాస్టారుకీ రాజంటే అమితమైన ప్రాణం. ‘మా గురుశిష్యులిద్దరి అనుబంధం ఒక్కమాటతో చెప్పడం కష్టం. రామాచారి మాస్టారు.. మామంచి మాస్టారు’ అంటూ ఉప్పొంగిపోతూ చెబుతారు రాజు. రాజుకి మదంగం అంటే ఇష్టమని ఓ మదంగం కొనిచ్చి, జయకుమార్‌ మాస్టారు దగ్గర మదంగం నేర్చుకునేందుకు పంపిస్తున్నారు రామాచారి. అంతేకాదు.. రాజు చిరకాల కోరిక, తన అభిమాన గాయకుడు ఎస్‌పి బాలసుబ్రమణ్యాన్ని కలిసే అవకాశం కూడా ఇచ్చారు. కర్ణాటక సంగీతంలో తనకి ఓనమాలు నేర్పించిన వసంతలక్ష్మీ టీచరు, బుచ్చయ్యచారీ మాస్టారు గురించి కూడా రాజు ఎప్పుడూ గుర్తుచేసుకుంటారు.
అమ్మ గురించి చెప్పమంటే..
‘అమ్మానాన్న నన్ను ఎప్పుడూ తిట్టలేదు. కొట్టలేదు. సినిమా పాటలు పాడతాను. గాయకుడ్ని అవుతానని చిన్నప్పటి నుంచి అంటుండేవాడ్ని. అందరూ ఆడుకుంటున్నారు. అందరికీ ఫ్రెండ్స్‌ ఉన్నారు. నాకు లేరు. నేను ఇలా ఉన్నానేంటి? అని బాధపడని క్షణం లేదు. చూపు లేకపోవడం నా తప్పు కాదు. కానీ ఆ లోపంతో ఎంతో వివక్ష ఎదుర్కొన్నాను. చాలా బాధేసేది’ అని రాజు తన జీవితంలో ఎదురైన చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
అవకాశాలు రాలేదు..
‘పలాస’లో పాట పాడిన తరువాత రాజుని పట్టించుకున్నవారే లేరు. కరోనా వచ్చి అతని కళని మరుగునపడేసింది. ‘అప్పుడు ఎంతో బాధపడ్డాను’ అని రాజు ఎప్పుడూ చెబుతాడు. అలాంటి రాజు ‘నా పాట ఎవరూ వినడం లేదు.. అందరూ వినాలంటే నేను గొప్ప గాయకుడ్ని కావాలి’ అని ఓరోజు గట్టిగా అనుకున్నాడు. ఇప్పుడు రవీంద్ర భారతి, సుందరయ్య విజ్ఞానకేంద్రం వంటి ఎన్నో చోట్ల జరిగే కచేరీల్లో రామాచారి మాస్టారి బందంతో కలసి పాటలు పాడుతున్నాడు.
మదంగం నేర్చుకోవడానికి బస్సులో వెళ్తున్న రాజు మొన్న శనివారం బస్సులో ఓ పాట పాడాడు. దాన్ని ఓ యువతి తన ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. అది బాగా వైరల్‌ అయ్యింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ రాజుని పిలిపించి ప్రత్యేకంగా అభినందించారు. అతనికి అవకాశం ఇవ్వమని ఎంఎం కీరవాణిని ట్యాగ్‌ చేశారు. ఈలోపే రాజుకి తన సినిమాలో పాట పాడే అవకాశం ఇస్తానని తమన్‌ ముందుకువచ్చారు. ఇప్పుడు ఈ విషయమే రాజుని సోషల్‌ మీడియా స్టార్‌ చేసింది. ఎక్కడ చూసినా అతని ఇంటర్య్వూలే వస్తున్నాయి. ఈ సందర్భంగా, తనని పాట పాడమన్న ఆ బస్సు కండక్టరుకి, సోషల్‌ మీడియాలో షేర్‌చేసిన యువతికి, తన గ్రామ ప్రజలకి రాజు ఎంతో సంతోషంగా కతజ్ఞతలు చెబుతున్నారు.
సాధారణ ప్రజల్లో ఉన్న టాలెంట్‌ని గుర్తించి కొంతమంది ఔత్సాహిక సంగీత దర్శకులు అవకాశాలు ఇవ్వడం గతంలో బాలీవుడ్‌లో, ఇప్పుడు తెలుగు ఇండస్టీలో చూస్తున్నాం. అలాంటి వారిలో రఘు కుంచె ముందుంటారు. ఆయన అవకాశమిచ్చిన గాయని బేబీ అప్పట్లో ఓ సంచలనం. కానీ ఇప్పుడు ఆమె ఎక్కడా కనిపించడం లేదు. టాలెంట్‌ని గుర్తించడమంటే ఇది కాదు.. వారి జీవితాలు కాస్తో కూస్తో బాగుపడేలా అప్పుడప్పుడైనా ప్రోత్సాహం ఇవ్వాలి. అలాంటప్పుడే రాజు లాంటి ఎందరో సమాజానికి పరిచయమవుతారు.