– అగ్రకుల ఆధిపత్యానికి చరమగీతం పాడాలి
– బీసీ డిక్లరేషన్ పేరిట రాజకీయ పార్టీల కొత్త పల్లవి
– బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఈడిగి శ్రీనివాస్‌గౌడ్
– 15న బీసీల రాజకీయ ప్లీనరీ
నవతెలంగాణ-కొడంగల్
‘ఓటు మనదే సీటు మనదే మేం ఎంతో మాకంత దక్కాల్సిందేనని’ బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఈడిగ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కొడంగల్‌లోని అతిధి గృహంలో బీసీ రాజకీయ ప్లీనరీ సమావేశం కనోజు వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కన్నోజు వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన మాట్లాడుతూ జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు రాజకీయ అధికారం దక్కాలని, సమాజంలో ఆరుశాతం ఉన్న సామాజిక వర్గాల చేతుల్లో పాలనా పగ్గాలు ఉంటే, 60 శాతం ఉన్న బీసీలు పాలితులుగా మిగిలాల్సిన పరిస్థితుల్లో మార్పు రావాలన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ పార్టీలకు బీసీలు గుర్తుకు వస్తారని ఆరో పించారు. వచ్చే శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ పార్టీలన్నీ బీసీ డిక్లరేషన్ పేరిట కొత్త పల్లవి అందుకున్నాయని అన్నారు. అగ్రకుల ఆధిపత్య పాలనకు చరమగీతం పాడి, రాష్ట్రంలో మన పాలన నినాదంతో ఈనెల 15న హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని కేబీఆర్ కన్వెన్షన్‌లో నిర్వహించే బీసీల రాజకీయ ప్లీనరీకి బీసీ వర్గాలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం సీనియర్ నాయకులు అశోక్ గౌడ్, వికారాబాద్ జిల్లా యువజన అధ్యక్షులు గోటిగ అనిల్ కుమార్, కొడంగల్ యువజన అధ్యక్షుడు మధు, రజక సంఘం నాయకులు అశోక్ రజక, యాదవ సంఘం నాయకులు వెంకటప్ప, కేశవులు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.