అసెంబ్లీ సమావేశాల్లోనే వేతనాల పెంపు ప్రకటించాలి

In assembly meetings itself Salary hike should be announced– 24 రోజుల సమ్మె కాలం బకాయిలు చెల్లించాలి
– తెలంగాణ అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌
– రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సునీత, జయలకిë
– ధర్నాచౌక్‌లో అంగన్వాడీల భారీ ధర్నా
నవతెలంగాణ-ముషీరాబాద్‌
అంగన్వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ వేతనాలను రూ.18 వేలకు పెంచుతున్నట్టు శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం ప్రకటించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.సునీత, జయలకిë అన్నారు. యూనియన్‌ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద అంగన్వాడీలు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ.. ఆరోగ్యలక్ష్మి మెనూ చార్జీలను పిల్లలకు రూ.1.15 పైసల నుంచి రూ.5కు, గర్భిణీలు, బాలింతలకు రూ.2.40 పైసల నుంచి రూ.10కి పెంచి ఇవ్వాలన్నారు. డబుల్‌ సిలిండర్‌ అన్ని కేంద్రాలకు ఇవ్వాలని, 2017 నుంచి టీఏ, డీఏ, ఇంక్రిమెంట్‌, ఇన్‌చార్జి అలవెన్స్‌ బకాయిలు మొత్తం చెల్లించాలని కోరారు. అంగన్వాడీలకు నష్టం కలిగించే విధానాలను ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన తీరు మార్చుకోకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.
కె.సునీత మాట్లాడుతూ.. అంగన్వాడీ ఉద్యోగులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. ఎండాకాలంలో ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు నిర్ణయించి.. ప్రతి నెలా 5వ తేదీ లోపు వేతనాలు చెల్లించాలని కోరారు. రెండో పీఆర్‌సీ ప్రకారం 5 శాతం ఐఆర్‌ వర్తింపజేస్తూ పేస్కేల్‌, కనీస వేతనాలు నిర్ణయించాలన్నారు.
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.ఈశ్వర్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం తన ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిన హామీల ప్రకారం అంగన్వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌కు రూ.18వేలకు వేతనాలు వెంటనే పెంచాలని, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ సమస్యల పరిష్కారానికి 2023 సెప్టెంబర్‌ 11 నుంచి అక్టోబర్‌ 4 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె నిర్వహించినట్టు గుర్తు చేశారు. ఆ 24 రోజుల సమ్మె కాలం వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అలాగే, మంత్రి సీతక్క ఇచ్చిన హామీ ప్రకారం రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ను టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.లక్ష పెంచి.. పెన్షన్‌, వీఆర్‌ఎస్‌ సౌకర్యం కల్పిస్తూ కొత్త జీవోను వెంటనే జారీ చేయాలన్నారు. మినీ నుంచి మెయిన్‌ అయిన 4000 మంది అంగన్వాడీ టీచర్లకు ఏడు నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ చెల్లించాలని కోరారు. ఈ ధర్నాలో యూనియన్‌ ఆఫీస్‌ బేరర్స్‌ జి.పద్మ, శారద, కోటీశ్వరి, ఎం.పద్మ, డి.సునీత, లలిత, రజిత, సరోజ తదితరులు పాల్గొన్నారు.