యూనివర్సిటీ విద్యార్థుల గోడు పట్టదా..?

– ఇన్‌చార్జి వీసీ.. టీయూను సందర్శించాలి : ఎస్‌ఎఫ్‌ఐ టీయూ బంద్‌ విజయవంతం
నవతెలంగాణ-డిచ్‌పల్లి
‘తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల గోస ప్రభుత్వానికి పట్టదా..? ఇన్‌చార్జి వీసీగా నియమితులైన వాకాటి కరుణ యూనివర్సిటీని వెంటనే సందర్శించి సమస్యలను పరిష్కరించాలి..’ అని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ టీయూ కమిటీ ఆధ్వర్యంలో శనివారం తలపెట్టిన తెలంగాణ యూనివర్సిటీ బంద్‌ విజయవంతమైంది. ఆర్ట్స్‌ కాలేజ్‌, కామర్స్‌ బిల్డింగ్‌లను బంద్‌ చేయించి ర్యాలీగా సెంట్రల్‌ లైట్‌ వరకు వెళ్లారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ యూనివర్సిటీ కార్యదర్శి శ్రీశైలం మాట్లాడుతూ.. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయకపోతే విద్యారంగం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. స్ట్రీట్‌ లైట్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఖాళీగా ఉన్న ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయాలని, యూనివర్సిటీలో ఎన్‌సీసీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. యూనివర్సిటీలో అదనంగా బాలికల హాస్టల్‌ నిర్మించి సౌకర్యాలను మెరుగుపరచాలని కోరారు. అంబులెన్స్‌, డాక్టర్స్‌, స్టాఫ్‌ నర్సెస్‌లను అందుబాటులో ఉంచాలన్నారు. అదే విధంగా లైబ్రరీని ఆధునీకరించి 24 గంటలు విద్యార్థులకు అందుబాటులో ఉండేలా పుస్తకాలు అందించాలన్నారు. ఐఎంబి విద్యార్థులకు స్పెషల్‌ ఫీజును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని, తెలంగాణ యూనివర్సిటీ మాస్‌ కమ్యూనికేషన్‌లో ఎలక్ట్రానిక్‌ స్టూడియోను, లాబ్‌ ఎక్విప్‌మెంట్స్‌ను అందించే వరకు దశల వారీగా ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. హాస్టల్స్‌లో మౌలిక సదుపాయాలు కల్పించకపోతే నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ క్యాంప్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విగేష్‌, యూనివర్సిటీ అధ్యక్షులు ప్రసాద్‌, యూనివర్సిటీ ఉపాధ్యక్షులు వెంకటేష్‌, సహాయ కార్యదర్శి దినేష్‌, చరణ్‌, నాయకులు పవన్‌, సంధ్య నీలిమ, మహేష్‌, విద్యార్థులు పాల్గొన్నారు.