వక్ఫ్‌ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలి

– ఆల్‌ ఇండియా తంజీమే ఇన్సాఫ్‌ అధ్యక్షులు అజీజ్‌పాషా డిమాండ్‌
– ఇందిరాపార్క్‌ వద్ద నిరసన
వతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వక్ఫ్‌ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని ఆల్‌ ఇండియా తంజీమే ఇన్సాఫ్‌ అధ్యక్షులు, మాజీ ఎంపీ సయ్యద్‌ అజీజ్‌పాషా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఆ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద ఆ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిముల సాధికారత, వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణ కోసం ఈ బిల్లును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తేవడం లేదని విమర్శించారు. వక్ఫ్‌ ఆస్తులు ఇప్పటికే 80 శాతానికిపైగా ఆక్రమణలకు గురయ్యాయని వివరించారు. వాటిని స్వాధీనం చేసుకునే అంశాలు ఈ బిల్లులో ఎక్కడా పొందుపర్చలేదన్నారు. మహిళలు, ముస్లిమేతరులు ఇద్దరు సభ్యులు ఆ కమిటీలో ఉండాలంటూ సవరణలు చేశారని అన్నారు. దీనికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. అయితో అయోధ్య ట్రస్టు కమిటీలో హిందుయేతర మతాల నుంచి ఒకరు ముస్లిం, ఇంకొకరు క్రిస్టియన్‌ను సభ్యులుగా చేర్చుతారా?అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎనిమిది లక్షల ఎకరాల భూమి ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నదని అన్నారు. వక్ఫ్‌ భూమి నాలుగు లక్షల ఎకరాలే ఉందనీ, అందులోనూ 80 శాతం ఆక్రమణలకు గురైందని వివరించారు. ఆక్రమణలకు గురైన భూమిని వక్ఫ్‌ పరిధిలోకి తేవాలన్నారు. ఒక్క ఇంచు భూమి ఆక్రమించిన ఆర్నెళ్ల జైలు శిక్ష విధించేలా చట్టాన్ని రూపొందించాలని కోరారు. దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీలపై మోడీ ప్రభుత్వ కాలంలో దాడులు పెరుగుతున్నాయని విమర్శించారు. భద్రత లేదని అన్నారు. వక్ఫ్‌ సవరణ బిల్లుపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఉందనీ, ముస్లింలకు న్యాయం చేస్తుందన్న నమ్మకముందని చెప్పారు. వక్ఫ్‌ సవరణ బిల్లును అమల్లోకి రావొద్దని డిమాండ్‌ చేశారు.