– దమ్ముంటే 50 లక్షల ఇండ్లు కట్టాలి
– తొమ్మిదేండ్లలో ఒక్క రేషన్ కార్డూ ఇవ్వలేదు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీఆర్‌ఎస్‌పై యుద్ధం మొదలైందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ మొదలుపెట్టిన యుద్ధానికి తాము సిద్ధమేనన్నారు. రెండు పడక గదుల ఇండ్ల పరిశీలనకు గురువారం శంషాబాద్ నుంచి బాటసింగారం బయలుదేరిన కిషన్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఆపై అదుపులోకి తీసుకుని నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విడిచిపెట్టారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు వెళ్తున్న కేంద్ర మంత్రిని పోలీసులు అడ్డుకోవడం, అరెస్టు చేయడం 75 ఏండ్ల భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారన్నారు. నేరస్తులు, ఉగ్రవాదులతో మాదిరిగా పోలీసులు తన పట్ల ప్రవర్తించారని విమర్శించారు. కేంద్ర మంత్రి హోదాలో రాష్ట్రంలోని రెండు పడక గదుల ఇండ్ల గురించి తెలుసుకునే హక్కు లేదా? అని ప్రశ్నించారు. దీనిపై పార్లమెంటు స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. కేసీఆర్ తొత్తుల్లాగా కాకుండా ప్రజాసేవకుల్లా పోలీసులు వ్యవహరించాలని సూచించారు. కేంద్రమంత్రి కాన్వారుకు డీసీఎంను అడ్డంపెట్టి ఆపేంత అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం జైలులో గదులు రెడీ చేసుకోవాలని హెచ్చరించారు. కేసీఆర్‌కు దమ్ముంటే తెలంగాణలో 50 లక్షల ఇండ్లు కట్టాలని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వాటా తెచ్చే బాధ్యత తనదేనన్నారు. బీఆర్‌ఎస్‌ను గద్దెదించే వరకు పోరాటం చేస్తామన్నారు. ఖరీదైన ఇండ్లు కట్టుకోవడానికి, విమానాలు కొనడానికి కేసీఆర్‌కు డబ్బులుంటాయిగానీ పేదలకు ఇండ్లు కట్టిచ్చేందుకు ఉండవా? అని ప్రశ్నించారు. పేదల పట్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అరకొరగా కట్టిన ఇండ్లు కూడా తొమ్మిదేండ్లుగా ఎవ్వరికీ ఇవ్వ లేదన్నా రు. ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేని, చేతకాని ప్రభుత్వం ఇదంటూ విమర్శించారు. కేసీఆర్ అభద్రతాభావంతో ఉన్నారు కాబట్టే బీజేపీ నేతలను అరెస్ట్ చేశారన్నారు. తమ రాజకీయ జీవితమే పోరాటాలతో ప్రారంభమైందనీ, ఎన్నో సార్లు జైలుకు వెళ్లామని చెప్పారు.
శంషాబాద్‌లో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అరెస్ట్
రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపిన ఎమ్మెల్యే రఘునందన్‌రావు
నవతెలంగాణ-శంషాబాద్
బాటసింగారంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల సందర్శనకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డిని గురువారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన కిషన్‌రెడ్డి.. అక్కడి నుంచే నేరుగా బాటసింగారం వెళ్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు.. కిషన్‌గూడ టోల్‌గేట్ వద్ద ఆయనతోపాటు ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఇతర ముఖ్య నేతలను రాచకొండ సీపీ చౌహన్, శంషాబాద్ డీసీపీ కె.నారాయణరెడ్డి, పి.రామచంద్రారెడ్డి ఆడ్డుకున్నారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేయడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా, కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ చింతల రామచంద్రారెడ్డి, తదితర రాష్ట్ర ముఖ్యనేతలను బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. స్థానిక నేతలను నందిగామ, కొత్తూరు పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి, రఘునందన్‌రావు మాట్లాడుతూ.. తమను అక్రమంగా నిర్భంచడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండ్ల సందర్శనకు వెళ్తే అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు.