”రాజీ మాటకి మామూలే కానీ చేతలకొచ్చేసరికి ఒక జీవితకాల యుద్ధమే దాగుంటుంది” అన్నది ఓ తత్త్వవేత్త సూక్తి. సూక్తి అర్ధవంతంగానే వుంది కానీ దానిని మన పాలకులు గాని ఒంటబట్టించుకున్నట్లుగా లేదు. రాజీపడి జీవించడం అంటే ఏదో పెద్ద యుద్ధం చేసినట్లుగా భావించటమే ప్రపంచంలో ఇప్పుడున్న అసలైన సమస్య. ఓ కళింగ యుద్ధం (కీ.పు.261) అశోకుడి జీవితాన్ని మార్చివేసింది. ఆ యుద్ధం అనంతరం తన జీవితకాలంలో అశోకుడు మళ్ళీ యుద్ధం జోలికి వెళ్ళలేదు. స్వయంగా తన కుమారుడు ‘మహేంద్రుడు’, కుమార్తె ‘సంఘమిత్రను’ బౌద్ధమత ప్రచారం కోసం శ్రీలంకకు, ఇతర దేశాలకు పంపినట్లుగా చరిత్రలో చదువుకున్నాం. ఆ సంఘటన గొప్ప చరిత్రకు వేదికగా నిల్చింది ఆనాటి కళింగ యుద్ధం. ఇలా చరిత్రలో జరిగిన యుద్ధాల గూర్చి చెప్పుకుంటూపోతే గొప్పగొప్ప చారిత్రక సందర్భాలను ఉటంకించాల్సి వుంటుంది. అంటే యుద్ధం ద్వారా పాలకుడిలో కలిగిన పరివర్తనకు నిదర్శనం ఆ సంఘటన.
ప్రపంచవ్యాప్తంగా చెలరేగిన విప్లవాలు రాజరిక పాలనకు తెరదించి ప్రజాస్వామ్య పాలకునకు, జాతీయ రాజ్యాలకు బీజం వేసింది. దీని ఫలితంగానే రాజులు, రాజ్యాలు, భూస్వామ్యులు కాలగర్భంలో కలిశారు.
అనంతరం ఓ వ్యక్తో, ఓ పాలకుడో ‘నియంతగా’ మరి ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలకు కారకులు ఐన వారినీ మనం చూశాం. హిట్లర్, ముస్సోలిని లాంటి నియంత వల్ల ప్రంపంచ యుద్ధాలను కూడా చూశాం. ఆ తర్వాత జరిగిన శాంతి ఒప్పందాలతో ప్రంపంచం మరోసారి యుద్ధం జోలికి వెళ్ళకుండా ప్రపంచ శాంతి సంస్థను (ఐక్యరాజ్య సమితి) ఏర్పాటు చేసుకొని దాని గొడుగు కింద చాలా దేశాలు స్వతంత్ర రాజ్యాలుగా ఆవిర్భవించి వికాసం పొందటం కూడా చూశాం.
రెండో ప్రపంచ యుద్ధం (1939-1945) అనంతరం ఏర్పడిన మేధోచర్చల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా మానవుడి ‘స్వేచ్ఛకు’ తగిన ప్రాధాన్యత లభించినప్పటికి, దేశాల మధ్య సిద్ధాంతపరమైన విభేదాలు, భౌగోళికమైన వివాదాలు, పాలనాపరమైన వివాదాలు, మతపరమైన వివాదాలు నేటికీ సర్దుమణగకపోగా, తరుచుగా ఏదో మూలన దేశాల మధ్యనో, దేశంలో ప్రజలకు పాలకులకు మధ్యనో యుద్ధం జరుగుతూనే వుంది. నాగరికతా పరిణామ క్రమంలో మనిషి తన ఆధిపత్య భావజాలాన్ని, మత భావజాలాన్ని, సిద్ధాంతపరమైన భావజాలాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దటం మూలంగా దేశాల మధ్య తలెత్తిన ఘర్షణ వాతావరణం క్రమంగా యుద్ధంగా మారిన దాఖలాలు కూడా వున్నారు. ఉదాహరణకి సెప్టెంబర్, 11, 2001 నాటి సంఘటన ద్వారా అమెరికా ‘అల్ ఖైదా’ ఉగ్రవాద సంస్థను సమూలంగా అంతం చేయడానికి యుద్ధం చేసింది. ఫలితంగా ఆ యుద్ధంలో అమెరికా గెలిచిందా? అల్ ఖైదా ఓడిందా? అన్న ప్రశ్నలు పక్కన పెడ్తే అమెరికా దుశ్చర్య వల్ల అప్ఘనిస్తాన్ నేటికీ రావణకాష్టంలా మండుతూనే వుంది. నేటికీ అక్కడి ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్య్రాలు లభించటం లేదంటే ఆనాటి అమెరికా దురాలోచనే అని చెప్పాలి.
ఇక మరో సంఘటన గూర్చి ప్రస్తావిస్తాను. ఇరాక్‌లో జీవ రసాయన ఆయుధాలను తయారు చేస్తున్నారన్న నెపంతో అగ్రరాజ్యమైన అమెరికా, ప్రపంచ శాంతికి తను మాత్రమే కట్టుబడి వున్నట్లు ఇరాక్‌పై యుద్ధం ప్రకటించి యుద్ధ నేరాలకు బాధ్యుడిగా సద్దామ్ హుస్సేన్‌ను ఆ దేశంలోని చట్టాల ప్రకారం ఉరి తీయించింది (డిసెంబర్ 30, 2006 లో). ఓ పాలకుడిని హతమార్చినంత మాత్రాన ప్రపంచం మొత్తం శాంతి పవనాలు విరబూస్తాయని ఆశించటం అవివేకపు ఆలోచన. అలా అయితే జర్మనీలో హిట్లర్, ఇటలీలో ముస్సోలిని పాలన అంతమైన తర్వాత ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఎందుకు మారలేదు అన్నది ప్రశ్న?
అదేవిధంగా ఐక్య రాజ్యసమితి స్థాపన (1945 అక్టోబర్ 24) అనంతరం ప్రపంచం మొత్తం శాంతియుత సమాజంగా ఎందుకు మారలేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల కాలంలో వివిధ దేశాల మధ్య జరిగిన యుద్ధాల్ని ఐక్యరాజ్య సమితి ఎందుకు నివారించలేక పోయిందన్నది కూడా ప్రశ్న. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం గత రెండు సంవత్సరములుగా జరుగుతూనే వుంది. రెండు దేశాల మధ్య ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతూనే వుంది. అదేవిధంగా గత సంవత్సరం అక్టోబర్ 07 న ప్రారంభమైన హమాస్ – ఇజ్రాయిల్ యుద్ధం క్రమంగా తన పరిధిని పెంచుకొని తాజాగా లెబనాన్ దేశానికి విస్తరించింది ఇజ్రాయెల్. ఇది పొరుగున వున్న ఇరాన్ మీదికి విస్తరించదన్న గ్యారంటీ కూడా లేదు. గత సంవత్సర కాలంగా జరుగుతున్న యుద్ధంలో వేలాది మంది చిన పిల్లలు, మహిళలు, వృద్ధులు మరణించారు. వారు ఎవరు కూడా ఇజ్రాయిల్‌పై బాంబులో, క్షిపణులో ప్రయోగించిన వారు కాదు. అంటే యుద్ధంలో నష్టపోయేది ఎక్కువగా యుద్ధంతో సంబంధం లేని వారే. అందుకే శ్రీశ్రీ ”గతమంతా తడిసే రక్తమున, కాకుంటే కన్నీళ్ళతో చల్లారిన సంసారాలు, మరణించిన జన సందోహం, అసహాయుల హాహాకారం చరిత్రలో మూలుగుతున్నవి” అన్నాడు. ఈ మాటల్లో ఎంతో చారిత్రక సత్యం దాగివుంది. ఏ యుద్ధం ఎందుకు జరుగుతుందో దాని ద్వార కలిగే లాభం ఎవరికో, నష్టం ఎవరికో ఈ పాటికే ప్రపంచ దేశాలు గమనించి ఉండవచ్చు. కానీ ఒకపక్క ఆయుధాలు విక్రయిస్తూ, మరోపక్క ప్రపంచ శాంతి అంటూ నీతి వాక్యాలు వల్లె వేస్తున్న దేశాలు, ప్రపంచంపై ఆధిపత్యం కోసం స్వార్ధపు ఆలోచనలు చేస్తున్నన్ని రోజుటూ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. దేశాల మధ్య యుద్ధం రాజేసి ఆయుధాల ద్వారా తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయా దేశాలకు అమ్మి బయటి ప్రపంచానికి మాత్రం ‘శాంతి’ అంటూ అసత్యవచనాలు పలికే దేశాలతో ప్రపంచానికి ప్రమాదం పొంచి వుంది. ‘యుద్ధం ఇంకా మిగిలే వుంది’ రాబందుల రెక్కల చప్పుడు మరు భూమిలో వినిపిస్తూనే వుంది. ఈరోజు పశ్చిమాసియా దేశాలు కావచ్చు, ఇంకో రోజు మరో దేశం కావచ్చు… యుద్ధం కౌగిట్లో నలిగిపోవడానికి. బాధితులు మాత్రం ఎన్ని తరాలైనా కోలుకోని దీనస్థితిలోకి నెట్టివేయబడుతారు. కాలం మారుతున్న కొద్ది యుద్ధం, దాని రూపాన్ని మార్చుకుంటుంది. గతంలో ఆధిపత్యం కోసం ప్రపంచ దేశాల మధ్య యుద్ధం జరిగితే, ప్రస్తుతం ‘తీవ్రవాదం’ ముసుగువేసుకొని విస్తరిస్తోంది. ‘యుద్ధం అనేది నీలో, నీ కోసం, నిన్ను మార్చుకోవడానికి జరగాలి. అప్పుడే దీని ఫలితం అద్భుతంగా ఉంటుంది’.
ఈ వాక్యాలు వ్యక్తికి, వ్యవస్థకు అన్వయించుకోవచ్చు. అందుకే యుద్ధం చేయాలనే ఆలోచన కన్నా ముందు శాంతికి (రాజీకి) ప్రయత్నిస్తే ఇంత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగదు. భవిష్యత్తులో జరగబోయే నష్టాలను కూడా నివారించిన వారమవుతాం. ఆ దిశగా పాలకులు, పాలితులు ఆలోచిస్తారని ఆశిద్దాం.
(హమాస్ – ఇజ్రాయిల్ మధ్య యుద్ధం అక్టోబర్ 07 నాటికి సంవత్సరం పూర్తైన సందర్భంగా)
డా|| మహ్మద్ హసన్, 9908059234