
– ఉధృతమైన నేతకార్మికులు ఆందోళన
నవతెలంగాణ – గంగాధర
పవర్ లూమ్స్ వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం వస్త్రోత్పత్తి ఆర్డర్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ గంగాధర మండలం కురిక్యాల ప్రధాన రహదారిపై గర్శకుర్తి గ్రామ పవర్ లూమ్స్ కార్మికులు రాస్తారోకో చేపట్టారు. కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారిలోని కురిక్యాల రహదారిపై చేపట్టిన రాస్తారోకోలో పెద్ద సంఖ్యలో పవర్ లూమ్స్ కార్మికులు పాల్గొని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో పెద్ద సంఖ్యలో ఉన్న పవర్ లూమ్స్ పై వస్త్ర ఉత్పత్తులు తయారు చేయడానికి ప్రభుత్వపరంగా ఎటువంటి గుడ్డ ఉత్పత్తి ఆర్డర్లు కల్పించక పవర్ లూమ్స్ పరిశ్రమ స్తంభించింది. దీంతో గత ఎనిమిది మాసాలుగా వస్త్రోత్పత్తులు లేక యజమానులు, ఆసాములు, కార్మికులు అవస్థ పడుతున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిన బతుకమ్మ చీరల తయారి తరహా ఏదేని గుడ్డ ఉత్పత్తులకు ఆర్డర్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ పలు నినాదాలు చేశారు. గర్శకుర్తి గ్రామంలో గత ఐదు రోజులుగా రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తున్న కార్మికులు రాస్తారోకో ద్వారా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేశారు. గత పదేళ్ల కింద గ్రామంలో చోటు చేసుకున్న నేతన్నల ఆత్మహత్యలు, ఆకలిచావులు మళ్లీ పునరావృతం కాకముందే గర్శకుర్తి వస్త్ర పరిశ్రమలకు ప్రభుత్వం గుడ్డ ఉత్పత్తి ఆర్డర్లు కల్పించి ఆదుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ రాస్తారోకోలో పవర్ లూమ్స్ కార్మిక సంఘం అధ్యక్షుడు గడ్డం నారాయణ, గర్శకుర్తి గ్రామ వస్తోత్పత్తి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు అలువాల విఠోభ, ప్రధాన కార్యదర్శి అన్నల్ దాస్ శ్రీనివాస్ నాయకులు దూస లచ్చయ్య, గాలి లక్ష్మిరాజంతోపాటు గర్షకుర్తి, ఉప్పరమల్యాల, రంగారావుపల్లి గ్రామాలకు చెందిన పవర్ లూమ్స్ యజమానులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.