మంత్రి చామకూర మల్లారెడ్డి
జవహర్‌నగర్‌లో అభివృద్ధి
పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-జవహర్‌నగర్
దేశం అబ్బురపడేలా తెలంగాణలోనే సంక్షేమ సంబు రం జయకేతనం ఎగురవేస్తోందని, పోరాడి సాధించుకున్న తెలంగాణలో 9 ఏండ్లలోనే 100ఏండ్ల నాటి అభివద్ధి కనిపిస్తోందంటే ఈ ఘనత సీఎం కేసీఆర్ దక్కుతుందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. చిన్న రాష్ట్రం తెలంగాణ అభివృద్ధి చెందదు అనే మాటలను అనతి కాలంలో తుడిచివేసి… అభివృద్ధి అంటే తెలంగాణే అనే పదం దేశమంతటా వినిపిస్తుందంటే సీఎం కేసీఆర్ విజన్… కృషి, పట్టుదలే అభివృద్ధికి కారణమన్నారు. జవహర్ నగర్ కార్పొరేషన్ లోని 15, 28, 27, 25, 23, 24, 22, 28, 3, 19, 18, 16 డివిజన్లలో రూ. 9కోట్లతో సీసీరోడ్లు, ఆండర్ గ్రౌండ్ డ్రయినేజీ పనులకు మేయర్ మేకల కావ్యతో కలిసి ఆదివారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశమంతా బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, సీఎం కేసీఆర్ తోనే దేశం బాగుపడుతుందని అన్నారు. తెలంగాణలో సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నాయని, అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తుం దని చెప్పారు. జవహర్ నగర్‌కు ఇప్పటికే సుమారు రూ.120 కోట్ల వరకు అభివృద్ధి పనులు చేశామని, మంత్రి కేటీఆర్ మరో రూ. 30కోట్లు మంజూరు చేస్తామని చెప్పా డని తెలిపారు. కార్పొరేషన్‌లోని ప్రతీ డివిజన్ సుందరంగా ముస్తాబు కావాలని, సమస్యలు లేని జవహర్‌నగర్ తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. పేద ప్రజలు నివసించే జవహర్ నగర్ నా గుండెకాయ లాంటిదన్నారు. జవహర్‌నగర్‌లో గతంలో పాదయాత్ర చేసినప్పుడు సమ స్యలను స్వయంగా చూసి చలించిపోయానని, ప్రతీ కాలనీకి డ్రయినేజీ, సీసీ రోడ్లు వేస్తానని మాట ఇచ్చాను.. ఇచ్చిన మాట ప్రకారమే అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నానని తెలిపారు. జవహర్ నగర్ పై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, కార్పొరే టర్లు, కోఆప్షన్ సభ్యులు, బీఆర్‌ఎస్ స్థానిక అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, ఉద్యమకారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
బస్తీ దవాఖానాకు శంకుస్థాపన…
గత ప్రభుత్వాలలో సర్కారు దవాఖానాలకు వెళ్ళాలం టే… ప్రజలు నేను పోను బిడ్డానంటూ భయపడేవారని… రాష్ట్రం ఏర్పాటు తర్వాతనే వైద్యరంగం కొత్త పుంతలు తొక్కుతున్నదని మంత్రి అన్నారు. ప్రతీ పల్లెకు, పట్టణానికి వైద్యానికి దగ్గర చేసిన సీఎం కేసీఆర్ గొప్ప మనసున్న మహారాజు అన్నారు. జవహర్ నగర్ 5వ డివిజన్ కార్పొరేటర్ ఏకే మురుగేష్ ఆధ్వర్యంలో బస్తీ దవాఖానాకు శంకుస్థాపన చేశారు. కార్పొరేటర్ మురుగేష్ మంత్రి మల్లారెడ్డికి కేరళ డోలు వాయిద్యాలు, డీజేలతో ఘన స్వాగ తం పలికి గజమాలతో సత్కరించారు. బస్తీ దవాఖానాను ఏర్పాటు చేస్తున్నందుకు మంత్రికి కార్పొరేటర్, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు