– కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి
– నియోజకవర్గంలోయజ్ఞంలా గడప గడపకు కాంగ్రెస్
– కసిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్న ప్రముఖులు
నవతెలంగాణ-ఆమనగల్
సకల జనుల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమని కల్వకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఇటీవల సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం నియోజకవర్గంలో యజ్ఞంలా కొనసాగుతుంది. ఈ సందర్భంగా బుధవారం నియోజకవర్గంలోని రఘుపతి పేట, లింగసానిపల్లి తదితర గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో కసిరెడ్డి పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సకల జనుల సమ్మెకు స్పందించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన కాంగ్రెస్ సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని, అందుకోసం అన్ని వర్గాల ప్రజలు లబ్ది పొందే వీలుగా ఆరు గ్యారంటీలతో కూడిన అనేక సంక్షేమ పథకాలను ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. ప్రజలకు నిత్యం ఉపయోగపడే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్, రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.15 వేలు, వృద్ధాప్య పింఛన్లు రూ.4 వేలతో పాటు రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా అందజేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్సీ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.