– నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్..
నవతెలంగాణ- వేములవాడ: పేదల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమని వేములవాడ నియోజకవర్గ అభ్యర్థి ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పెద్ద ఎత్తున ర్యాలీతో స్వచ్ఛందంగా అభిమానులు, కార్యకర్తలు వేలాదిమంది తరలి రావడంతో జన సముద్రం గా మారింది.. ఎమ్మార్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను ఆది శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ 9 సంవత్సరాలు కాలంలో వేములవాడ ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదని అన్నారు.ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. దీనికి నాంది వేములవాడలో జరగాలని వేములవాడ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ‘‘మీరు వేసే ఓటు కేసీఆర్ కుటుంబం బాగుపడడానికి వేస్తారా? మీ కుటుంబం బాగుపడడానికి వేస్తారా ? ఒకసారి ఆలోచించాలని అన్నారు. ఒక అవకాశం ఇచ్చి చేతి గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని ఆది శ్రీనివాస్ కోరారు. 30 ఏళ్లగా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా కష్టసుఖాలలో పాల్గొన్న వ్యక్తిగా ముందుకు వస్తున్న. డబ్బు, మద్యం పంచే అవతల పార్టీ నాయకులు వస్తున్నారని తెలిపారు. పలుకుబడి, డబ్బు ఉన్న వ్యక్తులకు ఓ సాధారణ మధ్యతరగతి బిడ్డకు జరుగుతున్న ఈ పోటీలో మీ బిడ్డగా గెలిపించుకోవాలని అభ్యర్థించారు. వేములవాడ ప్రజలు అంగట్లో పశువులు అనుకుంటున్నారని.. డబ్బులిస్తే ఓట్లు వేస్తారని భావిస్తున్నారని .. కానీ వేములవాడ ప్రజలు పులులు అని అన్నారు. కోట్ల రూపాయలు వెదజల్లి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని అలాంటి పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్, బీజేపీ నుండి చేరికలతో జోష్ లో కాంగ్రెస్..
అధికార బీఆర్ఎస్ పార్టీకి రెండు రోజులుగా షాక్ ఇస్తూ ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరికలు మొదలయ్యాయి. మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో స్థానిక సెట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబుకు సన్నిహితుడు, నమ్మిన బంటుగా మిదిలిన వ్యక్తి వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ పీర్ మహమ్మద్, బీజేపీ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ కూరగాయల శ్రీశైలం, మాజీ ఎంపీటీసీ కోయినేని శ్రీనివాస్, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం మాజీ ధర్మకర్త తాటికొండ వాణి- పవన్, ఆర్యవైశ్య నాయకులు హస్తం పార్టీలో చేరారు, వారిని రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు వేములవాడ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి సాదర స్వాగతం పలికారు. వీరు చేరికతో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ లో ఉన్నారు సోమవారం రోజున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ యువ సమ్మేళన కార్యక్రమం ముగిసిన కొద్ది గంటల్లోనే పట్టణ అధ్యక్షులు పుల్కం రాజు, కౌన్సిలర్ బింగి మహేష్, కో ఆప్షన్ మెంబర్ పుల్కం శ్రీలక్ష్మి, పార్టీని వీడి హస్తం గూటికి చేరారు. కొద్దిరోజులుగా వీరు పార్టీలో అంటి ముట్టినట్టుగా వివరిస్తున్నట్లు అధికార పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరికొంతమంది బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని జోరుగా చర్చ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సహకారం వెంకటస్వామి పులి రాంబాబు కనికరపు రాకేష్, వస్తాది కృష్ణ ప్రసాద్, తంగెళ్ల గణేష్, చిలక రమేష్, తోట లహరి, పాత సత్యలక్ష్మి భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.