– ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
నవతెలంగాణ-ఉట్నూర్
పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో 44 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సబ్బండ వర్గాల ప్రజల అభివృద్ధికి పాటు పడుతుందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ.1 లక్షలోపు రుణాన్ని మాఫీ చేస్తుందని తెలిపారు. రైతుల పక్షపాతి కాంగ్రెస్ అని అన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం పేదింటి ఆడపడుచులకు వరమన్నారు. త్వరలో లక్ష రూపాయాలతో పాటు తులం బంగారం అందజేస్తామని తెలిపారు. అధికారులు ప్రజలతో కలిసి మెలసి ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. వర్ష కాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. వైద్య సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలను అందించాలని సూచించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.