భారీ బడ్జెట్‌లో కార్మికుల సంక్షేమం మాటేది?

– ఇది కార్మిక వ్యతిరేక బడ్జెట్‌ : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన భారీ బడ్జెట్‌లో కార్మికుల, ఉద్యోగుల సంక్షేమం గురించి ప్రస్తావన లేకపోవడాన్ని సీఐటీయూ రాష్ట్ర కమిటీ తప్పుబట్టింది. గురువారం ఈ మేరకు ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపాధి కల్పన, రిక్రూట్‌మెంట్‌ పాలసీ విధానాన్ని ప్రస్తావించలేదని విమర్శించారు. కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ ప్రస్తావన కానీ, ప్రభుత్వద్యోగులకు రెండో పీఆర్సీ ప్రకటనగానీ చేయకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెసు పార్టీ మ్యానిఫెస్టోలో కార్మికుల సంక్షేమం కోసం పెట్టిన అంశాలు ఈ బడ్జెట్‌లో లేవని పేర్కొన్నారు. బీడీ కార్మికులకు ”చేయుత” జీవిత బీమా ఈఎస్‌ఐ, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు, దీనికి బడ్జెట్‌లో కేటాయింపులు, ఆటో డ్రైవర్లు, క్యాబ్‌ డైవర్లు, స్వీగ్గి జోమాటో కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తూ రాజస్థాన్‌ తరహా చట్టాన్ని తెస్తామని కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో పెట్టిన విషయం మర్చిపోయారని తెలిపారు. అదే విధంగా చిరువ్యాపారులు, పుట్‌ పాత్‌ వ్యాపారులకు వడ్డేలేని రుణ సదుపాయం కల్పిస్తానన్న వాగ్దానాన్ని గాలికొదిలేశారని విమర్శించారు. తెలంగాణలో 19.7శాతం పారిశ్రామిక రంగం పై 33 శాతం మంది సర్వీస్‌ రంగంపై ఆధారపడి బతుకుతున్నారని బడ్జెట్‌లో కంటితుడుపుగా చెప్పారన్నారని పేర్కొన్నారు. పెరిగిన ధరలకనుగుణంగా కనీస వేతనాలు జి.వోల సవరణ బడ్జెట్‌లో ప్రస్తావనే లేదని తెలిపారు. అభయ హస్తం పేరుతో వీధి వ్యాపారులకు ప్రత్యేక జోన్స్‌ ఏర్పాటు, హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు, హెల్త్‌ కార్డులతో సహా ప్రతి మండలంలో ”హమాలీనగర్‌” ఏర్పాటు చేస్తామని చెప్పినా వాటి గురించి ప్రస్తావనే లేదని వివరించారు. మిషన్‌ భగీరధ కార్మికులకు కనీస వేతనాలు గ్రామ పంచాయతీ కార్మికుల, మధ్యాహ్నభోజన కార్మికుల, బకాయి వేతనాలు చెల్లింపునకు సంబంధించి ఎలాంటి చర్యలు ఈ బడ్జెట్‌లో తీసుకోలేదని విమర్శించారు. పథకాల్లో పనిచేస్తున్న స్కీం వర్కర్లకు కనీస వేతనాలు, చట్టబద్ధ హక్కులు కల్పించే చర్యలే లేవని పేర్కొన్నారు. కార్మికులు తమ పరిష్కరించుకునేందుకు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.