రష్యాను ”వ్యూహాత్మక పరాజయం” పాలుచేసే ప్రయత్నానికి వ్యతిరేకంగా పశ్చిమ దేశాలను రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హెచ్చరించాడు. ఇది ఆ దేశాలను ”ఆత్మహత్య అంచుకు”తీసికెళుతుందని ఆయన అన్నాడు. శనివారం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి లావ్‌రోవ్ చేసిన ప్రసంగంలో ఉక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాలు ఇస్తున్న మద్దతును నిలిపివేయాలని, రష్యా తన అణ్వాయుధాలను రక్షణగా ఉపయోగించవలసి వస్తే సంభావ్య ఫలితం గురించి ఆలోచించాలని కోరాడు.
ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ ప్రకారం, మాస్కో దాదాపు 5,500 వార్‌హెడ్‌లతో ప్రపంచంలోనే అతిపెద్ద అణు ఆయుధాగారాన్ని నియంత్రిస్తుంది. ఉక్రెయిన్ అణుశక్తి కానప్పటికీ దాని ప్రధాన పాశ్చాత్య స్పాన్సర్ అయిన అమెరికా దాదాపు 5,000 ధవీకరించబడిన వార్‌హెడ్‌లతో రెండవ స్థానంలో ఉంది. ”ఆంగ్లో-సాక్సన్ వ్యూహకర్తలు తమ ప్రణాళికలను దాచుకోరు. రష్యాను వ్యూహాత్మక పరాజయం పాలుచేయడమే వారి ప్రకటిత లక్ష్యం.. ప్రస్తుతానికి వారు చట్టవిరుద్ధమైన నయా-నాజీ కీవ్ పాలనతో రష్యాను ఓడించాలని భావిస్తున్నారు. అయితే వారు ఈ ఆత్మహత్యాయత్నానికి పాల్పడేందుకు యూరప్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు” అని లావ్‌రోవ్ పేర్కొన్నాడు. మాస్కో అణు సిద్ధాంతానికి మార్పుల మధ్య గత కొన్ని రోజులుగా మాస్కో నుంచి వచ్చిన ఇలాంటి ప్రకటనలను అనుసరించి అతను ఈ హెచ్చరిక చేశాడు.
ఈ వారం ప్రారంభంలో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ దేశ భద్రతా మండలిలో రష్యా తన అణు నిరోధకాన్ని మోహరించడానికి అనుమతించబడే నిర్దిష్ట నిబంధనను చేర్చడానికి ప్రణాళికను సవరించాల్సిన అవసరం ఉందని చెప్పాడు. ఉదాహరణకు, రష్యా గడ్డపై తీవ్రస్థాయిలో దాడులు చేసేందుకు కీవ్‌కు పాశ్చాత్య గ్రీన్‌లైట్ లేదా దాని కీలక మిత్రదేశమైన బెలారస్‌పై దాడి చేయడంపై చర్చనీయాంశమైన పాశ్చాత్య గ్రీన్‌లైట్ ఇప్పుడు అణు ప్రతిస్పందనను ప్రేరేపిస్తుందని పుతిన్ చెప్పాడు. ఎందుకంటే దాడులకు నాటోలోని అణు శక్తుల మద్దతు ఉంటుంది. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తరువాత అణు సిద్ధాంతాన్ని నవీకరించడానికి ఉద్దేశింపబడిన పుతిన్ ప్రతిపాదన పెరిగిన ఉక్రేనియన్ దూకుడుకు పాశ్చాత్య దేశాల మద్దతు ఇవ్వడంపైన హెచ్చరికగా ఉపయోగపడుతుందని వివరించాడు.
అదే సమయంలో పాశ్చాత్య ఎత్తుగడలు కూడా మరింత యుద్ధ సన్నద్ధత వైపు మారుతున్నాయని లావ్రోవ్ చెప్పాడు. ”రష్యా పట్ల పాశ్చాత్య విధానం అసాధారణ దురహంకారం, దూకుడుతనం ఐక్యరాజ్య సమితి ద్వారా ప్రోత్సహించబడిన ‘ప్రపంచ సహకారం’ ఆలోచనను తిరస్కరించడమే కాకుండా, మొత్తం ప్రపంచ పాలనా వ్యవస్థ పనితీరును మరింత ప్రమాదంలో పడేస్తుంది… పశ్చిమ దేశాలు ఈ ధోరణిని ఆపకపోతే, ప్రతిఒక్కరూ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది” అని మంత్రి హెచ్చరించాడు. కీవ్ ‘శాంతి సూత్రాన్ని’ గుడ్డిగా సమర్ధిస్తున్నందుకు, వివాదానికి దౌత్యపరమైన పరిష్కారాన్ని కనుగొనే లక్ష్యంతో ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను విస్మరించినందుకు ఉక్రెయిన్ పాశ్చాత్య మద్దతుదారులను లావ్రోవ్ నిందించాడు. ఉక్రెయిన్ భూభాగాలన్నింటి నుంచి మాస్కో తన దళాలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్ వాస్తవికతకు అనుగుణంగా లేదని రష్యా పదేపదే నిందించింది. ఉక్రెయిన్ ఫార్ములాకు మద్దతు ఇవ్వడం ద్వారా, పశ్చిమ దేశాలు ”ఈ విచారకరమైన అల్టిమేటమ్‌ను సమర్థిస్తున్నాయి” లావ్రోవ్ తన ఉపన్యాసంలో పేర్కొన్నాడు.