సముద్ర జీవుల్లో తిమింగలం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో అనేక జాతులున్నాయి. వీటిలో బలీన్ జాతికి చెందిన హంప్‌బ్యాక్ తిమింగలం మరీ ప్రత్యేకం. ఎందుకంటే… ఈ మధ్య ఈ జాతికి చెందిన మగ తిమింగలం మూడు మహాసముద్రాలు చుట్టొచ్చి రికార్డు క్రియేట్ చేసింది. ఇది దక్షిణ అమెరికా నుంచి ఆఫ్రికా వరకు సుమారు 8వేల మైళ్లకు పైగా ఈది ఆశ్చర్యపరిచింది. అది అంతదూరం ప్రయాణం చేసిందని ఎలా తెలుసంటే.. సముద్ర జీవ జాతుల మీద పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు అంతరించిపోతున్న తిమింగలాల్లో ఈ హంప్‌బ్యాక్‌కు చెందినవి కూడా ఉన్నాయని గుర్తించారు. 2013 నుంచి దీని కదలికల మీద నిఘా పెట్టారు. అప్పటి నుంచి 2022 వరకు దాదాపు ఎనిమిదేండ్ల కాలంలో దక్షిణ అమెరికాలోని కొలంబియా నుంచి ఆఫ్రికాలోని జాంజిబార్లోని తిమింగలాల సంతానోత్పత్తి ప్రదేశం వరకు 8 వేల మైళ్ళ కిలోమీటర్లు ప్రయాణం చేసినట్టు గుర్తించారు. ఎందుకెళ్ళిందంటే.. తన సహచర తిమింగలాన్ని వెతుక్కుంటూ ఇన్నేండ్లు ప్రయాణం సాగించిందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దీని వెనుక ఉన్న విలక్షణమైన మూపురం కారణంగానే వీటిని హంప్ బ్యాక్ తిమింగలం అని పిలుస్తారు. ఇవి మహాసముద్రాల్లోనే ఉంటాయి. వాణిజ్యపరంగా కూడా అత్యంత ఖరీదైన తిమింగలం ఇది. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తల బందం హంప్‌బ్యాక్ తిమింగలాల తీరు, వలస విధానంపై అధ్యయనం చేస్తోంది. ఆ క్రమంలోనే ఈ మగ హంప్‌బ్యాక్ తిమింగలం కదలికలను ట్రాక్ చేస్తూ వచ్చారు పరిశోధకులు. 2013 తర్వాత మళ్లీ 2022లో జాంజిబార్ తీరంలో నైరుతి హిందూ మహాసముద్రంలో దీన్ని గుర్తించారు.
వేటాడటం వల్ల తిమింగలాల జాతి అంతరించిపోతూ వస్తోంది. 16వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దపు మధ్యకాలం వరకు కొనసాగిన వీటి వేటలో చాలా వరకు అంతరించి పోయాయి. ముఖ్యంగా 19, 20 శతాబ్దాల్లోనే ఈ సంఖ్య మరీ తగ్గిపోయిందట. మానవుల్లాగే ఇవి కూడా క్షీరదాలు కావడంతో శ్వాసించడానికి కావల్సిన ఆక్సిజన్ కోసం నీటి ఉపరితలంపైకి వస్తాయి. వీటి నుంచి లభించే నూనెను కొన్ని సుగంధ ద్రవ్యాల తయారీలో ఉపయోగిస్తారు. వీటి మాంసానికి కూడా డిమాండ్ ఉంది. అందుకే వీటి వేట ఇంకా కొనసాగుతోందని పరిశోధకుల అభిప్రాయం.