‘కులం పునాదుల మీద మనం దేనినీ నిర్మించలేము. ఒక నీతిని కానీ, ఒక జాతిని కానీ’ అని అంబేద్కర్ మహాశయుడు స్పష్టంగానే సెలవిచ్చారు. అతను మన రాజ్యాంగ నిర్మాత, రూపశిల్పి. ఈ దేశం ఏ విలువలతో నడవాలో, నవభారతాన్ని ఎలా నిర్మించుకోవాలో రాజ్యాంగం మనకు చెబుతుంది. నిర్దేశిస్తుంది. ‘కులం కులం అని కుత్సితాలు పెంచుకోకు, ఓ కూటికి లేనివాడా… మతం మతం అని మాత్సర్యం పెంచుకోకూ’… అని చిన్నపుడు పాడుకునేవాళ్లం. ‘కులమతాలు గీచుకున్న గీతలజొచ్చి, పంజరానగట్టు వడనునేను, నిఖిలలోకమెట్లు నిర్ణయించినగాని తరుగులేదు విశ్వనరుడ నేను’ అని జాషువా మహాకవి కులాల, మతాల పంజరాన్ని తన దరికి రానీయనని తేల్చిచెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని ఈ నిచ్చెనమెట్ల కులవ్యవస్థే, మన దేశం అభివృద్ధిలో వెనకపడటానికి ప్రధాన కారణమని ఎన్నో విశ్లేషణలు వచ్చాయి. ఇప్పటికీ కుల,మత భేదాలతో, వివక్షతలతో మనుషులనే హతమారుస్తున్న సంఘటనలు కోకొల్లలు. చదువుకున్న వాళ్లలోనూ, చదువురాని వాళ్లలోనూ, పట్టణాల్లో, గ్రామాల్లో ఎక్కడ చూసినా ఈ కుల దుర్వాసన వీడటంలేదు మనల్ని.
మన సమాజంలో ఎన్నో మార్పులొచ్చాయి. అనేక సంప్రదాయాలు చెదిరిపోయాయి. కానీ కులం మాత్రం చెదరలేదు. చెదిరినా, కులంగానే చెదిరింది. పొద్దంతా కూటికోసం పనిచేసే మనుషులు సాయంత్రానికి గూటిలోకి చేరుకున్నట్లు, కులంలోకి చేరుకుంటారు. వివక్షతలు, ఘర్షణలు, తగాదాలు, చంపుకోడాలు, రక్తప్రవాహాలు, సమీకరణలు, పదవులు, ఉద్యోగాలు, చదువులు, సంబంధాలు…అన్నిట్లో అన్ని సందర్భాల్లో నూ కులం వెన్నెంటే ఉంటుంది. ఆ మధ్య ఒక యాడ్‌లో ‘వేర్ యు గో, ఐ ఫాలో’ అన్నట్లుగా మన కళ్లలో కులం చూపుకొనసాగుతునే ఉంది. కులం గురించి కులపరంగానే మాట్లాడుతాం, కులం పోవాలనీ చర్చలు చేస్తాం. అన్ని మాటలకే పరిమితం. ఆఖరికి చర్చల్లోనే కుల నిర్మూలన మిగిలింది. ఇది అసలైన విషాదం! ఆఖరికి కులం వల్ల అనేక బాధలకు, ఇబ్బందులకు గురవుతున్న వాళ్లు కూడా నిర్మూలన మాటెత్తడంలేదు. ఎందుకంటే వివక్షతనే నిర్మూలించలేకపోయామనే నిస్పృహ కావచ్చు.
ఆ చర్చనలా ఉంచితే, ఈ మధ్య ఆరెస్సెస్. వారి పాంచజన్య పత్రిక సంపాదకీయంలో కులం గురించి వారి నిజమైన నైజాన్ని బయటపెట్టింది. ఇదే సందర్భంలో పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి, కులగణన ప్రస్తావనలో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాగూర్ అసలు ‘నీ కులమేమిటి’ అని అనుచితమైన వ్యాఖ్య చేశారు. ఇప్పుడీ పాంచజన్య – భారతీయ సమాజంలో కులం అనేది ఏకీకృత కారకమని తెలిపింది. మనుషుల మధ్య ఐక్యతను కులం పెంపొందిస్తుందని, కులవ్యవస్థ గొలుసు లాంటిదని, వివిధ తరగతులను అది కలుపుతుందని వివరించారు. అంటే కులవ్యవస్థ మన దేశానికి అవసరమైనదిగా బీజేపీ పరివారం భావిసున్నదన్న విషయం స్పష్టంగా మనమంతా అర్థం చేసుకోవాలి. హిందూమతంలోని వైవిధ్య, సంప్రదాయాలను ధ్వంసం చేయాలని, భారతీయ పరిశ్రమలను నాశనం చేయాలని, దేశ గుర్తింపును మార్చడంపై ఆక్రమణదారులు బ్రిటీషర్స్ దృష్టిపెట్టారని విమర్శ చేశారు. బానే ఉంది మరి వాళ్లకు వత్తాసుగా నాటి స్వాతంత్య్రోద్యమంలో నిలిచింది వీళ్లేగా! ఎప్పటికెయ్యది… అనేది వీరి విధానం.
కులం పోవాలని, వివక్షతలతో కూడుకున్న, వర్ణవ్యవస్థ విస్తరణతో వేయి పడగల హైంధవ నాగరాజులా బుసలు కొడుతున్న కుల డైనోసార్‌ను అంతమొందించి, మనుషులంతా ఒకటే అనే సమతా సమాజం ఎప్పుడు నెలకొంటుందోనని ఎదురుచూసేవారు, పాంచజన్య సంపాదకీయం మనల్ని ఎటునడు పుతుందో అర్థమవుతుంది. ఆరెస్సెస్ అనేది బీజేపీకి సైద్ధాంతిక పునాదిని ఏర్పరచే సంస్థ. అదిప్పుడు కులం మనుషుల్ని కలిపి ఉంచుతుందని సుద్దులు చెబుతోంది. మూతికి ముంత, ముడ్డికి చీపురుకట్టి, ఊరవతల కొందరిని ఉంచిన వ్యవస్థను, కొందరు అంటరానివారు కనుక వాళ్లు అందరికీ దూరంగా ఉండాలని కోరుకున్నవాళ్లు. పనిచేయడానికి, ఇతరులకు సేవ చేయటానికే కొందరున్నారని, విభజించిన కులవ్యవస్థ కొనసాగాలని కోరుకోవ డంలో వీరి ఆధిపత్య, మత దురహంకార లక్షణం అర్థమవుతోంది.
ఇలాంటి భావాలు, నీతి కలిగినవారు మూడోసారి అధికారంలోకి వచ్చి కొనసాగుతున్నారు. మత ప్రాతిపదికపైన కులవ్యవస్థ కొనసాగాలనీ, ఆధిపత్యం యధావిధిగా పాలించాలనీ చెప్పకనే పాంచజన్య చెప్పింది. దేశంలో ఉన్న ఆదివాసీలు, దళితులు, వెనుకబడిన వర్గాలు అప్రమత్తమవ్వాల్సిన తరుణమిది. మనతెలంగాణలో ఏ శక్తులు బలపడుతున్నాయో, అవి ఏ తిరోగమన వ్యవస్థకు వారసులో అర్థం చేసుకోవాలి! రాజ్యాంగస్ఫూర్తిని, విలువలను కాపాడుకోవాలి!