ప్రయాణమంతా ఉత్సవమే!

ప్రయాణమంతా ఉత్సవమే!ఎండలు విరుచుకుపడుతున్నాయి
మీరు చెమటల బరువుతో నడుస్తూ అలసటతో
ఈ దారిలోనే వస్తారని మాకు తెలుసు
మేం ఇట్లా ఆకుపచ్చ దేహాలతో
మీకు నీడల బహుమానాలను ఇవ్వాలని
నిలబడి నిరీక్షిస్తూ వున్నాం వేల పత్ర నేత్రాలతో-
గాలుల్ని బతిమిలాడి మా శాఖల విడిదిలో
వేంచేపు చేసాం సపర్యలతో శీతలీకరించాం
మీరు రాగానే వాటి చేతుల మీదుగా సుగంధాలను
మీపైనా మీ మనసుల్లోకీ చిలకరించాలని –
మీరొచ్చి నీడల్లో కాస్త నిమ్మళ పడుతూంటే
మా జీవన సారాలతో సృజించిన రసఫలాలను
మీ ఒళ్ళోకి చేరేలా జారవిడువాలని
మా కొమ్మలు తహతహలాడుతున్నాయి
వాటిని మీరు ఇష్టంగా ఆస్వాదిస్తూంటే
మేము హృద్యంగా హొయలుతో లయాత్మకంగా
నృత్యం చేయాలని రిహార్సల్స్‌ కూడా చేసుకున్నాం
మీ కడుపుకే కాదు కనులకూ విందు చేయాలని –
అటుగా పాటల సరంజామాతో రాగవీధిలో వెళుతున్న
కోయిలల గుంపును మా చిగుళ్ళ లేచేతులతో పిలిచి
మా గుబురుల్లో కొన్నాళ్లు మజిలీ చేయమని వేడుకున్నాం
పాటలు పాడీ పాడీ ఆ కోయిలలు దయాపూరితాలైనాయి కాబోలు
ఏ మాత్రమూ బెట్టు చేయక మెత్తని గొంతుకలతో సరే అని
మా పరిమిత గృహాల్లో సర్దుకుని కొలువైనాయి
ఒక రాగకచేరీతో అలరించమని వాటికి విన్నవించుకున్నాం
అవి శ్రుతి చేసుకుంటున్నాయి, మీరు విచ్చేసాక
మీ శ్రవణ పాత్రల్లో గీతామృతాలను ఒంపడానికి !
మా నీడలు మావైనా తావు మాది కాదు కదా
అది తల్లి నేలది, మమ్మల్ని సాదుతున్న ఆమెకు అర్జీ పెట్టుకున్నాం
మిమ్మల్నీ అనుమతించమని –
ఆమె మాకే కాదు మీక్కూడా తల్లే కదా ఎలా కాదనగలదు
అవుననడమే కాదు, తన అపార అంతర్జలాన్ని
ఎంతైనా తోడుకొమ్మని ఆతిథ్యానికి ఏ లోటూ రానివ్వద్దని
మరీ మరీ చెప్పింది చెమ్మగిలిన కళ్ళతో అభినందిస్తూ –
అంతా సిద్ధమే ఇపుడు!
అదుగో అల్లంత దూరంలో మీరు కానవస్తున్నారని
మా శిఖర శాఖలు మాకు ముందస్తు కబురందిస్తున్నాయి
అవును ఇపుడు మీరు మా కనులకు దగ్గరయ్యారు, కానీ
అదేమిటి? నడుస్తూ కాదు పరుగుతో వస్తున్నారు ఈ ఎండలో!
అయ్యో, పడుతూ లేస్తూ ప్రయాస పడుతున్నా పరుగునాపట్లేదు
విచిత్రం! మిమ్మల్ని మీరే తరుముకుంటున్నారు!
అయ్యో, ఈ ఎండల దాడిలో మీ గొంతులెడారులై ఉంటాయి
మీ పక్కనే ఓ సెలయేరు వెళుతున్నది కదా జలగాత్రంతో –
అక్కడా మీరు ఆగడం లేదు గుక్కెడు నీళ్ళ కోసం, ఏం?
ఎక్కడో ఏ దూర తీరంలో దేన్నో పొంది తీరాలనే ఆరాటంతో
ముందుకు ముందుకే దూసుకెళ్తున్న మీ చూపులకు
అటువీ ఇటువీ ఏం కనపడతాయి
పాపం, చల్లని సెలయేరు చిన్నబుచ్చుకున్నది
సరే, రండి రండి మా లోగిలికి!
ఇటు వైపు ఇటు వైపు, రండి సేద తీరండి
మేమూ మా నీడల తివాచీలూ ప్రేమమయి ఈ నేల తల్లీ
రాగ ఝరీ అంతా సిద్ధంగా వున్నాం, వసంతోత్సవానికి!
రండి రండి
అదేమిటి అదేమిటి
అరక్షణమైనా ఇక్కడా నిలవక మాకేససలు చూడక
అట్లాగే అదే పరుగుతో రొప్పుతూ రోదుతూ
మిమ్మల్ని మీరే ఈడ్చుకుంటూ ఎక్కడికి ఎక్కడికి?
నీడల్లేక గాలుల్లేక పాటల్లేక పరవశాల్లేక జలకాంతి లేక
మిమ్మల్ని మీరు జారవిడుచుకుంటూ
విరామం లేని పరుగెందుకు ఎందుకు
విచారం విచారం అయ్యో అయ్యో
అయినా మా ఉత్సవ ఉత్సాహం సన్నగిల్లదు
మా తివాచీలు మాయమవవు గాలులు అచలం కావు
కోయిలలు మూగబోవు నేల తల్లి అలిగి పోదు
పాదలయలతో కళకళలాడే ఆ దారి మూతపడదు
అతిథులు అవశ్యంగా వస్తారనే మా ఆశ అడుగంటదు
ఏదో ఒకనాడు మీ తర్వాతివారు ఒకరో ఇద్దరో కొందరో ఎందరో
ఇటుగా వెళ్తూ మా పిలుపు విని మాకేసి మళ్లుతారు
నీడల కడకు నడిచొచ్చి మా ఆతిథ్యఛాయల్లో సేదదీరుతారు
పరుగు కాదు, అటూ ఇటూ దర్శిస్తూ నడవడం,
శ్రమించడమే కాదు నడుస్తూ నడుమ నడుమ విశ్రమించడం,
తీరాన్ని చేరే ద్యాసొక్కటే కాదు, దారి పొడుగూతా జీవించడం
ప్రయాణం ప్రయాణమంతా ఉత్సవమేనని తేటగా తెలుసుకుంటారు
తెలుసుకుని కొత్త చూపుతో నడక సాగిస్తూ
దారికి ఇటూ అటూ దట్టంగా ఆకు పచ్చని తోరణాలు కడతారు
మజిలీలను గుర్తు చేసే పెద్ద పెద్ద సైన్‌ బోర్డులను పెడతారు
– దర్భశయనం శ్రీనివాసాచార్య, 94404 19039