ఇందూరు పండగ ఊరంతా సందడి..

 75 సంవత్సరాల క్రితం ప్లేగు వ్యాధి ప్రబలిన సమయంలో నిజామాబాద్‌ నగరంలో ప్రారంభమైన ఊర పండుగ (పెద్ద పండుగ)
75 సంవత్సరాల క్రితం ప్లేగు వ్యాధి ప్రబలిన సమయంలో నిజామాబాద్‌ నగరంలో ప్రారంభమైన ఊర పండుగ (పెద్ద పండుగ)
– నేడు ఊర పండుగ
– ఏర్పాట్లు పూర్తి చేసిన సర్వ సమాజ్ కమిటీ
– భారీగా పోలీసుల మోహరింపు
నవతెలంగాణ – కంటేశ్వర్
ఇందూరు విభిన్న సంస్కృతులకు నిలయం. పల్లె నుంచి కార్పొరేట్ స్థాయికి ఎదిగినా.. ఇది ఇలా తరతరాలుగా వస్తున్న ఆచారాలు సంప్రదాయాలను మారడం లేదు ఈ నగర జనం. ఏటా నిర్వహించే ఊర పండగే దీనికి నిదర్శనం. శతాబ్దాల చరిత్ర కలిగిన ఇందూరు. ఊర  పండుగ నాడు పల్లెను తలపిస్తోంది. వర్షాకాలంలో ప్రబలే వ్యాధులు.. గొడ్డు గోజ పాడిపంటలను రక్షించాలని శరణువేడుతూ గ్రామ దేవతలకు కల్లు సాక పోసి కోళ్లను బలి ఇవ్వడమే ఈ పండుగ పరమార్థం. నగరవాసులు ఊర పండుగను ఆదివారం సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సర్వ సమాజ్ ఊర పండుగ నిర్వహణ కమిటీలు పూర్తి చేశాయి. అధికారులు పోలీసు యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ తరహాలో ఊర పండగ ఘనంగా నిర్వహిస్తారు.ఇందూరు ఊర పండుగకు సిద్ధమైంది. పాడిపంటలు ప్రజలు సుఖశాంతులతో ఉండేలా దీవించాలని వేడుకుంటూ ఏటా ఆషాడమాసము లో జరిపే ఊర పండుగను ఆదివారం నగరంలో ఘనంగా నిర్వహించనున్నారు. పండుగ విశేష పదార్థంగా సరిని నగరంలో చల్లుతూ పంటలపై పశు సంపద పై చెరువుల్లో కలపనున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ మాదిరిగా సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ పండుగను నిర్వహిస్తారు.
80 ఏళ్ల నుంచి ఆనవాయితీగా..
1882_87 మధ్యకాలం నుంచి ఇందూరులో ఊర పండుగ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 80 ఏళ్ల క్రితం సిర్నాపల్లి సంస్థానాధీశురాలు శీలం జానకీబాయి నిధులు సమకూర్చి ఊర  పండుగను ఘనంగా నిర్వహించడం ప్రారంభించారు. అప్పట్లో గత్తర్ ( ప్లేగు) వ్యాధి సోకడంతో ఎంతో మంది చనిపోయారు. గ్రామ దేవతలను పూజిస్తే వ్యాధి నయం అవుతుందని భావించి పండుగను నిర్వహించడం ప్రారంభించారు. పటేల్ పట్వారీ వ్యవస్థ హాయంలో వారే ఈ  పండుగ ను నిర్వహించేవారు అనంతరం కుల సంఘాల వారు నిర్వహిస్తున్నారు.60  కుల సంఘాల ఆధ్వర్యంలో ఏటా ఊర పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు. దొరసాని శీలం జానకీబాయి ప్రతిమను పూజించడం వీరు మొదలుపెట్టారు.

పెద్ద పండుగ ఉత్సవం, ఊరేగింపు
అమ్మవార్ల తయారీలో వతాన్ దార్లు..
మొదట బండారు వేసి మామిడి తుంగలతో అశోక్ వీధి ఎడ్ల హనుమాన్ దగ్గర వడ్ల దాతి వద్ద వతాన్ దార్లు అమ్మ వార్లను తయారు చేయడం ప్రారంభిస్తారు.1983_1984 లో పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు కావడంతో కుల సంఘాల ఆధ్వర్యంలో సర్వ సమాజ్ ఏర్పాటు చేసి మొదటి సారిగా ఆదన్న ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగేవి. అనంతరం మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా కార్యదర్శిగా బంటు రాజేశ్వర్ పండుగను నిర్వహించారు. ఊర  పండుగకు బండారు వేసిన రోజు  నుంచి గ్రామ దేవతలను అశోక్ వీధిలోని వడ్లదాతి వద్ద వతాన్ దార్లు మోపాల్ లక్ష్మణ్ ధర్మరాజు పర్యవేక్షణలో అమ్మవార్లు రూపుదిద్దుకుంటాయి. ఆరాధ్య దేవతలైన గ్రామదేవతను కొలుస్తూ ఈ ఊరు పండగను జరపడంలో నిజామాబాద్ నగర ప్రజలు ప్రత్యేకతను చాటుకుంటున్నారు. వర్షాకాలంలో  ప్రబలే వ్యాధుల నుంచి రక్షించు తల్లి అంటూ ఈ పెద్ద పండుగను నిర్వహిస్తారు. గ్రామ దేవతలైన సార్గమ్మ(.2) భోగం సాని కొండల రాయుడు బండి రాట్నం ఆసు పెద్దపులి ఐదు చేతుల పోచమ్మ మత్తడి పోచమ్మ మహాలక్ష్మమ్మ పౌడలమ్మ పెద్దమ్మ ఆడెల్లి పోచమ్మ అంపుడు పోచమ్మ ప్రతిమలను సరి లతో ఘనంగా ఊరేగిస్తారు.
ఖిల్లా  నుంచి విగ్రహాల ఊరేగింపు ప్రారంభం..
ఊర పండగ నిర్వహణ కమిటీ అయిన సర్వ సమాజ్ ఆధ్వర్యంలో  ఖిల్లా రఘునాథ ఆలయం వద్దనున్న శారదాంబ గద్దె( తేలు మైసమ్మ గద్దె) వద్ద గ్రామదేవతలను పసుపు కుంకుమ చెవి పోగులు ఆభరణాలతో విశేషంగా అలంకరించి పూజలు చేస్తారు. సర్వ సమాజ్ అధ్యక్ష హోదాలో  యెండల లక్ష్మీనారాయణ కార్యదర్శి బంటు రాజేశ్వర్ కన్వీనర్ రామర్తి గంగాధర్ కుల సంఘాల పెద్దలు పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత దేవతామూర్తుల ఊరేగింపు గాజులపేట చౌరస్తా మీదుగా పెద్ద బజార్ చౌరస్తా వరకు చేరుకుంటాయి. ఇక్కడ నుంచి రెండు బృందాలుగా విడిపోయి డప్పుల చప్పుడు పోతరాజుల విన్యాసాలు మహిళల పూనకాలతో ఒక బృందం పౌడ లమ్మ  నల్ల పోచమ్మ అడెల్లి పోచమ్మ పెద్దమ్మ పులి రాట్నం ఆసు తొట్టెల ఊరేగింపు దుబ్బ వైపు వెళ్తుంది. రెండో బృందం సిర్నాపల్లి గడి గోల్ హనుమాన్ చౌరస్తా మీదుగా వినాయక్ నగర్ 5 చేతుల పోచమ్మ మత్తడి పోచమ్మ మహాలక్ష్మిమ్మలతో వెళ్తుంది. సరి ని నాలుగు గుల్లలు గా విభజిస్తారు. ఒక గుల్ల దుబ్బ వైపు రెండవది వినాయక్ నగర్ మూడవది ఎల్లమ్మ గుట్ట నాలుగవది  కంఠేశ్వర్ ప్రాంతాలకు చల్లుకుంటూ వెళ్తారు.
ఊరేగింపు పూర్తయ్యే వరకు స్నానాలు చేయరు..
ఊరేగింపు వెళ్లే వరకు నగరవాసులు ఎవరు స్నానాలు ఆచరించకుండా ఇండ్లు సైతం శుభ్రం చేసుకోరు. అమ్మవార్లు వెళ్ళగానే ఇంటిని ఇంట్లోని పాత సామాన్లు పారేసి ఇండ్లను శుభ్ర పరచుకుంటారు. అనంతరం స్నానాలు ఆచరిస్తారు .దీనివల్ల శాస్త్రీయం కూడా ఉందని నగరవాసుల విశ్వాసం. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు.
నగరంలో గ్రామీణ వాతావరణం..
మహిళలు పూనకాలతో అమ్మవార్ల ప్రతి రూపమైన తొట్టెల కింద నుంచి వెళ్లేందుకు బారులు తీరుతారు. పలు వీధి చౌరస్తాలో ప్రజలు మేకలు గొర్రెలను కోళ్లను బలి ఇస్తూ కల్లు సాక లు  పోస్తూ మొక్కులు తీర్చుకుంటారు. ఈ పండుగ రోజు పొలిమేర దాటి వెళ్లవద్దని అలా వెళితే అరిష్టమని భావించి వేరే ఊర్లకు వెళ్లారు. దీనిని ప్రజలు ఇప్పటికీ విశ్వసిస్తారు. నగరంగా మారిన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గ్రామీణ సంస్కృతి ఇంకా ప్రతిబింబిస్తూ ఉంది. ఊర పండుగ సందర్భంగా 40 కుల సంఘాల ప్రతినిధులు పాల్గొంటారు. సిర్నాపల్లి గడి లో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. పండుగ నిర్వహణకు చందాను అందజేస్తారు. దీనిని పట్టి కడుతున్న అంటారు. గ్రామదేవతల తయారీ ఎత్తుకునే వారు తోట్ల తయారీదారులు వతాన్ దార్లు 50 మంది వరకు ఉండడం విశేషం.
తొట్టెల తయారీ..
తొట్లే లను హమాలీ సంఘం చాట కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాత్రి తయారు చేసి ఉదయం నాలుగు గంటలకు తేలు మైసమ్మ గద్దె వరకు తెస్తారు. వీటిని కొత్త గంజిలో తయారు చేస్తారు. వ తాన్ దార్లు వీటిని తయారు చేస్తున్నారు.
సరి ప్రత్యేకత..
ఊర పండగ లో ప్రత్యేకమైనది  సరి. ఈ పదార్థాన్ని సిర్నాపల్లి గడి లో రెండవది వివేకానంద చౌరస్తాలో తయారుచేస్తారు. జొన్న బియ్యంతో గట్క ను తయారు చేసి అందులో పసుపు కుంకుమ మేక రక్తము పేగులు వేసి ఉడికించి తయారు చేస్తారు. అమ్మవారికి పూజలు చేసిన తర్వాత సరి గుల్ల ను ఊరేగిస్తారు. ఈ సరిని పశువులు పాకాలు ఇళ్లలో చల్లుతారు. దీనిద్వారా దుష్ట శక్తులు పారి పోతాయని రోగాలు రావని నమ్ముతారు. సరి ని దక్కించుకునేందుకు పోటీపడతారు. తోపులాట జరగకుండా పోలీసులు బందోబస్తు కల్పిస్తారు. అమ్మవారికి ప్రతి రూపంగా తొట్లను ఊరేగిస్తారు. ఈ తొట్టెల కింద నుంచి వెళ్లేందుకు పోటీపడతారు. వివేకానంద చౌరస్తాలో తయారుచేసిన సరి గాజులపేట దుబ్బ ప్రాంతాలకు వెళుతుంది. సిర్నాపల్లి గడి లో తయారుచేసిన సరి సార్గలమ్మ దగ్గర ఉంచి ఈ సరి ఎల్లమ్మ గుట్ట వినాయక నగర్ పెద్ద బజార్ అనంతరం న్యాల్ కల్ లోని చెరువు లో కలుపుతారు.
భారీగా పోలీసుల మోహరింపు..
నేడు ఊర పండగ పండగ సందర్భంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసు బందోబస్తు నిజామాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ తెల్లవారుజామున ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులను భారీగా మోహరించరున్నారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ బందోబస్తును కట్టు దీరుష్టంగా ఏర్పాటు చేశారు. ఊరేగింపు సమయంలో ఎక్కడ కూడా ఏమి జరగకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని విధాల చర్యలను చేపట్టి ముందస్తుగా శాంతి కమిటీ సభ్యులతో సైతం సమావేశం నిర్వహించారు.