– ఈత కోసం చెరువులో మునిగి..
– ముగ్గురు యువకుల మృతి
నవతెలంగాణ-మాక్లూర్
ఈత కోసం వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ఒడ్యాట్‌పల్లి శివారులో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కళ్లెం వెంకటేష్ (16), మహేష్ (20), నవీన్ (19) సాయితేజ నలుగురు యువకులు గ్రామ శివారులోని చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు. అందులో నుంచి సాయితేజ అనే యువకుడు చెరువు కట్టపైనే ఉన్నాడు. చెరువులో వెళ్లిన వారు ఎక్కువ సేపు బయటకు రాలేదు. దీంతో అటుగా గేదెలు తీసుకొని వస్తున్న మృతుడు మహేష్ చిన్ననాన్నకు సాయితేజ విషయం వివరించారు. దీంతో గ్రామానికి చెందిన గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. గల్లంతైన యువకులకోసం వారు చెరువులోనే గాలిస్తున్న క్రమంలో తోలుత వెంకటేష్, మహేశ్ మృతదేహాలు లభ్యం కాగా.. ఆ తర్వాత నవీన్ మృతదేహం చివరికి లభ్యమైంది. ముగ్గురు యువకులు మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతదేహాలను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.