‘అరణ్య’ రోదన కారాదు..!

'Aranya' cannot cry..!– కాంగ్రెస్‌ హయాంలోనైనా భద్రాద్రికి పూర్వవైభవం వచ్చేనా..?
– భద్రాచలం అభివృద్ధిని పట్టించుకోని కేంద్రం.. గత రాష్ట్ర ప్రభుత్వం
– కరకట్టకు నిధులు ఇవ్వాలి.. ముంపు ముప్పు తప్పించాలి..
– అటవీప్రాంతంలో తాగునీటి ఇక్కట్లు.. సాగని తునికాకు సేకరణ
– నేడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనపై కోటి ఆశలతో ఏజెన్సీ
అయోధ్య రాముడే తప్ప భద్రాద్రి బాగోగులు పట్టని కేంద్రం.. యాదాద్రికి ఇచ్చిన ప్రాధాన్యత భద్రాద్రికి ఇవ్వని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. పవిత్ర భద్రాచలం నిర్లక్ష్యం నీడలో కొట్టుమిట్టాడుతున్నా, అడవి బిడ్డల బాధలు అరణ్యరోదనలుగా మిగులుతున్నా, పాలకులు పట్టించుకోలేదు. పాలన ‘చేయి’ మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనపై భద్రాద్రి జిల్లా ఏజెన్సీ కోటి ఆశలతో ఉంది.
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో పాటు గత బీఆర్‌ఎస్‌ పాలనలో భద్రాద్రి జిల్లా నిర్లక్ష్యానికి గురైంది. దాదాపు పదేండ్లలో ఈ ప్రాంతాభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రామనామ స్మరణతో రాజకీయాలు చేస్తున్న పాలకులు రాముడు మురికి కూపంలో ఉన్నా.. పోలవరం ముంపు భయం ఏజెన్సీని వెంటాడుతున్నా.. ఐదు పంచాయతీలు ఆంధ్రాలోకి పోయినా.. కనీసం చెత్త పోసుకునే స్థలం లేక పవిత్ర స్థలం దుర్గంధం బారిన పడినా ఏనాటూ పట్టించుకోలేదు. గత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వరదల సమయంలో భద్రాచలానికి వచ్చి రూ.వెయ్యి కోట్ల హామీ ఇచ్చి వెళ్లినా ఆచరణలో పెట్టలేదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పాలకుల నిర్లక్ష్యం కారణంగా భద్రాద్రి ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. వర్షాకాలంలో పోలవరం బ్యాక్‌వాటర్‌ ముంపుతో నెలల తరబడి భద్రాద్రి, పినపాక నియోజకవర్గ పరిసరాలు నీళ్లలో నానుతున్నాయి. ఈ నేపథ్యంలో గోదావరికి ఇరువైపులా కరకట్ట నిర్మాణం, ఎత్తు పెంచడంతో పాటు పొడగించాలనే డిమాండ్‌లు ఎప్పటి నుంచో ఉన్నాయి. ప్రస్తుతం ఎండలు మండుతుండటంతో తాగునీటి సమస్య ఏజెన్సీని వెంటాడుతోంది. అడవిబిడ్డల ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటైన తునికాకు సేకరణపైనా ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టడంలేదు. ఈ ఏడాది కూడా అదను తప్పుతున్న నేపథ్యంలో ఫ్రూనింగ్‌ పనులు చేపట్టాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. సోమవారం భద్రాద్రి, పినపాక నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్న సందర్భంగా ఏజెన్సీ సమస్యలపై ‘నవతెలంగాణ’ ప్రత్యేక కథనం..
భద్రాద్రి అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు కావాలి..
భద్రాద్రి రామాలయంతో పాటు పట్టణాభివృద్ధికి రూ.వెయ్యి కోట్ల నిధులు కేటాయించాలని అఖిలపక్ష రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు, సామాజిక, స్వచ్ఛంద సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయి. గోదావరికి ఇరువైపులా కరకట్ట నిర్మాణం చేపట్టాలని, భద్రాచలం నుంచి నెల్లిపాక, భద్రాచలం నుంచి దుమ్ముగూడెం వరకు పొడగించాలని, స్లూయిస్‌లు లీక్‌ కాకుండా నిరంతరం నిర్వహణ ఉండాలని కోరుతున్నాయి. పోలవరం బ్యాక్‌వాటర్‌ ముంపుపై సమగ్ర సర్వే చేపట్టి, నిర్దిష్ట నివేదిక ఇవ్వాలని, ఆంధ్రాలో కలిపిన ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలోకి తేవాలని, భద్రాచలం గ్రామపంచాయతీనా…? మున్సిపాలిటీనా?? అనే విషయంలోనూ స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాయి. భద్రాచలంలోని సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురవుతోంది. ఇప్పటికైనా ఆస్పత్రిలో ఖాళీ పోస్టులు భర్తీ చేసి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. భద్రాచలం రామాలయ ట్రస్టు బోర్డు, పాలకమండలి ఏర్పాటు కూడా జరగడం లేదు. పాండురంగాపురం నుంచి సారపాక వరకు రైల్వేలైన్‌ మంజూరుకు కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. భద్రాచలంలో సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు డిమాండ్‌ కూడా ఉంది. వీటి పరిష్కారంపై ముఖ్యమంత్రి స్పందన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.
వేసవి పంటపైనా నిర్లక్ష్యం..
అటవీప్రాంతంలో వేసవి పంటగా పిలిచే తునికాకు సేకరణపై నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఫ్రూనింగ్‌ పనులు కూడా ప్రారంభం కాలేదు. జిల్లాలోని ఆరు డివిజన్‌లలో 54 తునికాకు యూనిట్లు ఉన్నాయి. వీటిలో 60,400 స్టాండర్డ్‌ బ్యాగ్‌ల ఆకు సేకరించే అవకాశం ఉన్నా సకాలంలో ఫ్రూనింగ్‌ చేపట్టకపోవడంతో గతేడాది 22వేల స్టాండర్డ్‌ బ్యాగ్‌లే సేకరించారు. ఈ ఏడాది ఇప్పటికే రెండు దశల్లో టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. అటవీ ఉత్పత్తులపై పాలకుల వైపు నుంచి నిర్లక్ష్యం సాగుతోంది. కాంగ్రెస్‌ హయాంలోనైనా దీన్ని అధిగమించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.
పొంచివున్న నీటిఎద్దడి..
వేసవి వచ్చేసిన దృష్ట్యా ఏజెన్సీ ప్రాంతంలో తాగునీటి సమస్య నెలకొంది. అటవీ ప్రాంతాల్లోని అనేక గూడేల్లో నీటి కోసం జనం అల్లాడుతున్నారు. సుమారు 200కు పైగా ఉన్న సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. బోర్ల మరమ్మతులు, అద్దె బోర్లు, పైపులైన్‌ల ఏర్పాటు పనులు ముమ్మరం చేసి తాగునీటి ఎద్దడి నుంచి ప్రజలను రక్షించాల్సిన అవసరం ఉంది.
ఇందిరమ్మ ఇండ్లపై ఆశలు..
గత ప్రభుత్వం ఇచ్చిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ప్రజల ఆకాంక్షను నెరవేర్చలేదు. భద్రాచలం సహా అనేక చోట్ల నిర్మించినా పంపిణీ చేపట్టకపోవడంతో వృథాగా ఉంటున్నాయి. సొంత జాగలో ఇల్లు కట్టుకోవాలనే ఆకాంక్షను నెరవేర్చే ఇందిరమ్మ ఇంటిపథకానికి భద్రాచలం నుంచి శ్రీకారం చుడుతుండటం శుభపరిణామమే. అర్హులందరికీ ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇచ్చినప్పుడే ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తులు 8,21,541 కాగా వాటిలో ఇందిరమ్మ ఇండ్ల్ల కోసం 6,49,271 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో భద్రాద్రిలో 2,79,638, ఖమ్మంలో 3,69,633 దరఖాస్తులున్నాయి. నేడు ప్రజాదీవెన సభలో భాగంగా మణుగూరు, భద్రాచలంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ప్రజల ఆకాంక్షను నెరవేర్చేదిశగా హామీలు ఇవ్వాలని.. వాటిని ఆచరణలో నూటికి నూరుశాతం పెట్టాలని ఏజెన్సీ వాసులు కోరుతున్నారు.