విన్నర్‌ జానిక్‌ సిన్నర్‌

విన్నర్‌ జానిక్‌ సిన్నర్‌– కొలిన్స్‌కు మహిళల టైటిల్‌
– మియామి ఓపెన్‌ టెన్నిస్‌
మియామి (కాలిఫోర్నియా) : 2024 క్యాలెండర్‌ ఏడాదిలో ఇటలీ కుర్రాడు జానిక్‌ సిన్నర్‌ జోరు కొనసాగుతుంది. ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను సొంతం చేసుకున్న జానిక్‌ సిన్నర్‌.. తాజాగా మియామి ఓపెన్‌ టైటిల్‌ను సైతం దక్కించుకున్నాడు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో బల్గేరియా ఆటగాడు గ్రిగర్‌ దిమిత్రోవ్‌పై వరుస సెట్లలో విజయం సాధించిన సిన్నర్‌ తొలిసారి మిమామి ఓపెన్‌ను ముద్దాడాడు. 6-3, 6-1తో దిమిత్రోవ్‌పై సిన్నర్‌ ఏకపక్ష విజయం సాధించాడు. గతంలో రెండు సార్లు ఇక్కడ ఫైనల్స్‌కు చేరినా సిన్నర్‌ టైటిల్‌ సాధించలేదు. గత ఏడాది ఫైనల్లో రష్యా స్టార్‌ డానిల్‌ మెద్వదేవ్‌కు టైటిల్‌ను కోల్పోయాడు. కానీ మూడో ప్రయత్నంలో సిన్నర్‌ ఎటువంటి పొరపాటు చేయలేదు. 73 నిమిషాల్లోనే లాంఛనం ముగించి టైటిల్‌ కైవసం చేసుకున్నాడు. సెమీఫైనల్స్‌, ఫైనల్స్‌లో ప్రత్యర్థికి ఒక్క గేమే కోల్పోయిన జానిక్‌ సిన్నర్‌ తనదైన జోరు చూపించాడు. టైటిల్‌ పోరులో 6 ఏస్‌లు కొట్టిన దిమిత్రోవ్‌.. సిన్నర్‌కు తగిన పోటీ ఇవ్వటంలో విఫలమయ్యాడు. నాలుగు ఏస్‌లు కొట్టిన సిన్నర్‌.. నాలుగు బ్రేక్‌ పాయింట్లు సాధించాడు. గ్రిగర్‌ దిమిత్రోవ్‌ మాత్రం ఒక్క బ్రేక్‌ పాయింట్‌ సాధించలేదు. పాయింట్ల పరంగా 55-38తో జానిక్‌ సిన్నర్‌ ఆధిపత్యం చూపించాడు. కొలిన్స్‌ కొట్టేసింది. మహిళల సింగిల్స్‌ విభాగంలో అమెరికా స్టార్‌ డానిలె కొలిన్స్‌ చాంపియన్‌గా అవతరించింది. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో కజకిస్థాన్‌ క్రీడాకారిణి ఎలెనా రిబకినాపై వరుస సెట్లలో విజయం సాధించింది. 7-5, 6-3తో ఎలెనా రిబకినాపై గెలుపొందిన డానిలె కొలిన్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో కొలిన్స్‌ నాలుగు ఏస్‌లు కొట్టగా, ఎలెనా రిబకినా ఐదు ఏస్‌లు కొట్టింది. కొలిన్స్‌ మూడు కీలక బ్రేక్‌ పాయింట్లు సాధించగా, ఎలెనా ఒక్క బ్రేక్‌ పాయింట్‌తో ఆగిపోయింది. తొలి సెట్లో 5-5 నుంచి వరుసగా రెండు గేములు నెగ్గిన కొలిన్స్‌ టైబ్రేకర్‌లో పైచేయి సాధించింది. కానీ రెండో గేమ్‌ను 6-3తో మెరుగ్గా సాధించింది. పాయింట్ల పరంగా కొలిన్స్‌ 82-75తో పైచేయి సాధించింది. కానీ ఎలెనా రిబకినా సైతం గట్టి పోటీ ఇచ్చింది. ఇక పురుషుల డబుల్స్‌ విభాగంలో భారత వెటరన్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న, మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) జోడీ విజేతగా నిలువగా…మహిళల డబుల్స్‌ విభాగంలో అమెరికా జంట కెనిన్‌, మాటెక్‌ శాండ్స్‌లు గెలుపొందారు.