మహిళలే గూండాలకు అప్పగించారు

– 18 ఏండ్ల బాలికపై సామూహిక లైంగికదాడి కేసు
 – ఫిర్యాదులో పేర్కొన్న బాధిత బాలిక
ఇంఫాల్‌, న్యూఢిల్లీ : మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. ఈ దారుణాలు వెలుగు చూస్తున్న కొద్ది ఇందులో వెల్లడవుతున్న వాస్తవాలు నివ్వెరపరుస్తున్నాయి. మే 15న ఇంఫాల్‌ ఈస్ట్‌లో 18 ఏండ్ల బాలికను అపహరించి, దాడి, గ్యాంగ్‌రేప్‌ చేసిన ఘటనపై ఈ నెల 21న జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదయింది. ఈ ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం కొంతమంది మహిళల గుంపే ఈ బాలికను సాయుధ గూండాలకు అప్పగించింది. మే 15న ఆ ప్రాంతంలో కవాతు చేసుకుంటూ వెళుతున్న మెతేలకు చెందిన ‘మైరా పైబీస్‌’ అనే మహిళల బృందం (దీనిని మదర్స్‌ ఆఫ్‌ మణిపూర్‌గా పిలుస్తారు) ముందుగా ఈ బాలికను గుర్తించింది. నలుగురు సభ్యులు ఉన్న సాయుధ గూండాల గ్రూపునకు బాలికను అప్పగించింది. తరువాత గ్యాంప్‌రేప్‌కు గురైన బాలిక తీవ్రగాయాలతో సమీప రాష్ట్రం నాగాలాండ్‌లో ఒక ఆసుపత్రిలో చేర్చబడింది. ఈ నెల 21న శుక్రవారం కాంగ్పోక్పి పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో వివిధ సెక్షన్ల కింద జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. తరువాత ఈ కేసును ఇంఫాల్‌ ఈస్ట్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. మే 4న మహిళలను నగంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో ఈ బాలిక తనపై జరిగిన ఘోరాన్ని ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చింది.
పోలీసులపై నమ్మకం లేక..
మే 15న సాయంత్రం 5 గంటల సమయంలో తనను నలుగురు సాయుధ వ్యక్తులు కారులో అపహరించారని 18 ఏళ్ల బాలిక ఫిర్యాదులో పేర్కొంది. కారులోనే తీవ్రంగా కొట్టుకుంటూ ఒక కొండ ప్రాంతం వద్దకు తీసుకుని వెళ్లి వారిలో ముగ్గురు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. తరువాత కూడా తీవ్రంగా కొట్టారని, తనను చంపడానికే నిర్ణయించుకున్నారని ఫిర్యాదులో వెల్లడించింది. సురక్షితమైన ప్రదేశంలో చంపడానికి, తనను మళ్లీ కారులో ఎక్కుంచుకుని తీసుకుని వెళ్లడానికి ప్రయత్నిస్తుంటే కారు తగిలి కొండ కిందకు తాను పడిపోవడంతో వారు వెళ్లపోయారని తెలిపింది. తరువాత తాను రోడ్డు వద్దకు చేరకుని ఒక ఆటో డ్రైవర్‌ను సహాయం కోరానని, తనను కూరగాయల కుప్ప కింద దాచి బిష్ణుపూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకుని వెళ్లాడని అయితే పోలీసులపై నమ్మకం లేక న్యూ లంబులనే ప్రాంతంలో దింపమని డ్రైవర్‌ను వేడుకున్నట్లు తెలిపింది. తరువాత రోజు ఉదయం మే 16 ఉదయం 4:30 గంటలకు ఇంఫాల్‌ చేరుకున్నానని, అక్కడి నుంచి కాంగ్పోక్పి జిల్లా ఆసుపత్రికి వెళ్లానని, కానీ నా పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ సిబ్బంది నన్ను నాగాలాండ్‌లోని కోహిమా ఆసుపత్రికి తరలించారని తెలిపింది.