మహిళల ఫుట్‌బాల్‌ జట్టు సంచలనం

The women's football team is sensational– యూరోపియన్‌ జట్టుపై తొలి విజయం
అంకారా(టర్కీ): భారత మహిళల ఫుట్‌బాల్‌ జట్టు సంచలనం నమోదు చేసింది. చరిత్రలో తొలిసారి ఓ యూరోపియన్‌ జట్టుపై విజయం సాధించింది. టర్కిస్‌ మహిళల టోర్నమెంట్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 4-3గోల్స్‌ తేడాతో ఎస్టోనియాపై విజయం సాధించింది. భారత్‌ తరఫున మనీషా కళ్యాణ్‌ రెండు గోల్స్‌ చేయగా.. ఇందుమనతి, కతిరేసన్‌ ఒక్కో గోల్‌ కొట్టారు. మనీషా 17వ ని.లో బెలారస్‌ గోల్‌పోస్ట్‌లోకి దూసుకెళ్లి గోల్‌ చేయడంతో భారత్‌కు 1-0 ఆధిక్యత సాధించింది. ఆ తర్వాత 32వ ని.లో మరో గోల్‌ చేయడంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి భారత్‌ 2-0గోల్స్‌ ఆధిక్యతలో నిలిచింది. ఆ తర్వాత ఇందుమతి(62వ), మనీషా (79వ ని)లో ఒక్కో గోల్‌ కొట్టగా.. ప్యారీ క్సాక్సా(79వ ని.)లో ఒక గోల్‌ చేయడంతో భారత్‌ 4-1గోల్స్‌ ఆధిక్యతలో నిలిచింది. 88వ ని.లో వ్లాడా కుబస్సోవా, 90వ ని.లో లియిస్‌ లిల్లేమే ఒక్కో గోల్‌ చేయడంలో భారత్‌ ఆధిక్యత 4-3గోల్స్‌కు తగ్గింది. చివర్లో భారత డిఫెండర్లు అడ్డుగోడలా నిలవడంతో భారత్‌కు యూరోపియన్‌ జట్టుపై తొలి విజయం ఖాయమైంది. ఇంతకుముందు భారత మహిళలజట్టు యూరోపియన్‌ జట్లయిన బెలారస్‌, ఉక్రెయిన్‌, రొమేనియాలతో తలపడినా ఆ మ్యాచుల్లో పరాజయాన్ని చవిచూసింది.