ఓటమి భయంతోనే మహిళా రిజర్వేషన్‌ బిల్లు

– మహిళలకు సాధికారత సాధించాలనే తపన బీజేపీకి లేదు
– సీపీఐ(ఎం) రాజ్యసభ పక్షనేత ఎలమారం కరీం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే మోడీ ప్రభుత్వం మహిళా బిల్లును తీసుకొచ్చిందని, మహిళలకు సాధికారత సాధించాలనే తపనతో కాదని సీపీఐ(ఎం) రాజ్యసభ నేత ఎలమారం కరీం విమర్శించారు. గురువారం రాజ్యసభలో మహిళా బిల్లుపై జరిగిన చర్చలో సీపీఐ(ఎం) తరఫున ఎలమారం కరీం మాట్లాడారు. ”కర్నాటక, ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఓడిపోయాక.. బీజేపీకి భయం పట్టుకుంది. జనం తమ వెంట లేరన్న విషయాన్ని గమనించింది.ఆ భయమే మహిళా రిజర్వేషన్‌ బిల్లు తీసుకురావాలని బీజేపీని ఒత్తిడి చేసింది. అంతేకానీ నారీ శక్తి బంధన్‌ బీజేపీ లక్ష్యం కాదు. సీపీఐ(ఎం) ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తుంది. బిల్లు ఆమోదం పొందిన వెంటనే మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలి. కానీ జనాభా లెక్కల కోసం వేచి ఉండకండి” అని అన్నారు.
”యూపీఏ హయాంలోనే రాజ్యసభ ఆమోదం పొందింది. సోనియాగాంధీ, .బృందా కరత్‌లు బిల్లు కోసం గట్టిగా నిలబడ్డారు. రాజ్యసభ చైర్మెన్‌ హమీద్‌ అన్సారీ ధృఢ వైఖరి కూడా నిర్ణయాత్మకమైంది. కానీ లోక్‌సభలో బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. ప్రజాస్వామిక మహిళా సంఘం వంటి మహిళా సంఘాల సుదీర్ఘ పోరాట ఫలితమే మహిళా రిజర్వేషన్‌ బిల్లు. 2014లో మహిళా బిల్లును ప్రవేశపెడతామని బీజేపీ హామీ ఇచ్చింది. కానీ ఇన్నేళ్లుగా ఏమీ చేయలేదు. 2019లో కూడా బీజేపీ అదే హామీ ఇచ్చింది. కానీ నాలుగున్నరేండ్లుగా ఏమీ చేయలేదు” అని విమర్శించారు.
”.మణిపూర్‌లో మహిళలను వివస్త్రను చేసి, సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసినప్పుడు, బీజేపీ మహిళలపై ప్రేమ చూపలేదు. దేశం గర్వించదగ్గ మల్లయోధులను బీజేపీ నాయకుడే అయిన ఫెడరేషన్‌ అధ్యక్షుడు వేధించినప్పుడు కూడా మహిళలపై ప్రేమ కనిపించలేదు. ఉన్నావ్‌, కత్వా, హత్రాస్‌లలో మహిళా సాధికారతపై బీజేపీకి ఉన్న ఆసక్తి స్పష్టంగా కనిపించలేదు” అని విమర్శించారు.
”తదుపరి జనాభా లెక్కల అనంతరం నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. వచ్చే 15 ఏండ్లలో రిజర్వేషన్లు అమలు చేస్తారా? లేదా అనేది ఖచ్చితంగా తెలియదు. బెంగాల్‌లో 1983లోనే పంచాయతీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. కేరళలో స్థానిక సంస్థల్లో యాభై శాతం మహిళా రిజర్వేషన్లు. అమలవుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటీ?” అని ఎలమారం కరీం ప్రశ్నించారు.
2011 జనాభా లెక్కలతో మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే సరి..
రాజ్యసభ చర్చలో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ ఎంపీలు కేకే, వద్దిరాజు ఇప్పుడు దేశంలో జనగణన లేదని, అలాంటప్పుడు 2011 జన గణనను పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్లు అమలు చేస్తే సరిపోయేదని బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవ రావు సూచించారు. అయితే చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు అనే అంశం చాలా సుదీర్ఘ కాలంగా చర్చలో ఉందని, కేంద్ర తెచ్చిన ఈ బిల్లుకు బీఆర్‌ఎస్‌ మద్దతు తెలుపుతుందని స్పష్టం చేశారు.
గురువారం రాజ్య సభలో మహిళ రిజర్వేషన్ల బిల్లు పై చర్చలో ఆ పార్టీ తరపున కేకే, వద్దిరాజు రవిచంద్రలు మాట్లాడారు. కేంద్రం తెచ్చిన మహిళ రిజర్వేషన్ల బిల్లులో జనగణన, డీలిమిటేషన్‌ అనే కండీషన్లు ఉన్నాయన్నారు. దీని ప్రకారం జనగణన, డీలిమిటేషన్‌, ప్రజాభిప్రాయం తర్వాత ఈ బిల్లు రావాలంటే 2023 తర్వాతే మహిళ రిజర్వేషన్లు అమలవుతాయని చెప్పారు.