పార్క్ నిర్మాణం విషయంలో బి.ఆర్.ఎస్ నేతల మాటలు హాస్యాస్పదం..

– ఆది శ్రీనివాస్  ప్రత్యేక చొరవతోనే పార్క్ నిర్మాణము త్వరగా పూర్తయింది..
– అబద్ధాలు చెప్పడం మానుకొని అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వండి..
– బి.ఆర్.ఎస్ నాయకులకు సూచించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు..
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో రెండు కోట్ల రూపాయలతో నూతనంగా  పార్కును నిర్మించారు. అయితే పార్కు నిర్మాణం విషయంలో  కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులతో పాటు నాయకుల పాత్ర ఏమీ లేదని,  పార్కు నిర్మించిన ఘనత పూర్తిగా బి.ఆర్.ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు,జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకే దక్కుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి సంచలన వ్యాఖ్యలు చేశారు.  దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు బుధవారం మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ ఆధ్వర్యంలో పార్క్ ను సందర్శించి, అభివృద్ధి జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ చైర్పర్సన్ మాధవి వ్యాఖ్యలను ఖండించారు. పార్కు నిర్మాణం కేవలం ప్రభుత్వ విప్,  స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్  ప్రత్యేక చొరవతోనే పూర్తయిందని, భూమి కేటాయింపు విషయంలో వివాదం తలెత్తితే అధికారులతో మాట్లాడి దాన్ని  పరిష్కరించడమే కాకుండా త్వరగా పార్కు నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకున్న గొప్ప నాయకుడు ఆది శ్రీనివాస్ అని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి బి.ఆర్.ఎస్ పార్టీ ప్రభుత్వం చేయలేని అభివృద్ధి పనులను కొలువుదీరిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని, ఈ క్రమంలోనే ప్రభుత్వ విప్, స్టానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో ఇప్పటికే రూ.20కోట్లు వి.టి.ఏ.డి.ఏ ద్వారా రాజన్న ఆలయ అభివృద్ధికి మంజూరయ్యాయని, కానీ పదేళ్లు సీఎం గా ఉన్నా కేసీఆర్ ఏటా వందకోట్ల రూపాయలు ఇస్తానని  హామీ ఇచ్చి, 600 కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది పోయి ఆరు రూపాయలు కూడా ఇవ్వలేదని ఎద్దేవాచేశారు. ఇప్పటికైనా బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు తమపై, తమ నాయకులపై విమర్శలు చేయడం మానుకొని, నిజాలను నిర్భయంగా ఒప్పుకుంటూ,  అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అన్నారం ఉమారాణి- శ్రీనివాస్, ఇప్పపూల అజయ్, పట్టణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, సాగరం వెంకటస్వామి, నాయకులు పాత సత్యలక్ష్మి, కనికరపు రాకేష్, నామాల లక్ష్మీరాజం, వంగల శ్రీనివాస్, పుల్కం రాజు,గూడూరి మధు, పీర్ మహమ్మద్, వస్తాదు కృష్ణ, ముంజ ఉమేందర్ గౌడ్, గంటల ప్రకాష్, తోట రాజు, ఇన్నారం సాగర్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.