పని బారెడు.. జీతం మూరెడు

– ఆరు నెలలుగా జీతాలు లేవు
– ప్రభుత్వ కార్యాలయంలో అదనపు భారం
నవతెలంగాణ-కౌడిపల్లి
జిల్లా స్థాయి అధికారుల నుంచి మండల స్థాయి అధికారుల వరకు గ్రామపంచాయతీ కార్మికులతో పనులు చేయించుకోవడం తప్ప వారికి జీతాలు ఇవ్వడంలో అధికారులు పూర్తిగా విఫలమైపోతున్నారు. గత పది సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గ్రామపంచాయతీ ఒక ట్రాక్టర్‌ వాటర్‌ ట్యాంకర్‌తో పాటు పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో చెత్త చెదారం లేకుండా వాళ్ళ ఇంటికన్నా ఊరునే శుభ్రంగా ఉంచడంలో గ్రామపంచాయతీ కార్మికులు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మూడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోజువారిగా పనులు చేస్తున్నారు. ఎంత కష్టం చేసినా పని బారెడు జీతం మూరెడు అనే విధంగా కార్మికులు గత ఆరు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. కౌడిపల్లి మండలంలో దాదాపు 29 గ్రామపంచాయతీ ఉండగా 125 మంది గ్రామపంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారు. మండలంలో 50 వేలకు పైగా జనాభా ఉన్నారు. ఒక్కొక్క గ్రామ పంచాయతీలో నాలుగు నుంచి ఆరు మంది గ్రామపంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారు. కౌడిపల్లి గ్రామంలో 14 మంది గ్రామపంచాయతీ కార్మికులు పనిచేస్తుండగా ఉదయం నుంచే ఇంటింటా చెత్త సేకరించడం హైవే మీద ఉన్న షాపులు హౌటళ్లలో ట్రాక్టర్‌ ద్వారా చెత్త సేకరిస్తున్నారు. దానిని డంపింగ్‌ యార్డ్‌కి తీసుకెళ్లి తడి చెత్త పొడి చెత్తగా వేరు చేస్తున్నారు. మధ్యాహ్నం ట్రాక్టర్‌ ట్యాంకర్‌ ద్వారా 765 డి హైవే రోడ్డు ప్రక్కన నాటిన చెట్లకు నీరు పోస్తున్నారు. గ్రామంలో గత పది రోజులుగా 765 డి హైవేపై ఏర్పాటు చేసిన హైమెర్‌ లైట్లు రిపేరు కూడా గ్రామపంచాయతీ కార్మికులే చూస్తుంటారు. కౌడిపల్లి గ్రామంలో 4500 మంది జనాభా ఉండగా వాటిలో ఇటీవల ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయంలో కూడా గ్రామపంచాయతీ కార్మికులే శుభ్రంగా ఉంచాలని చెప్పడంతో అధికంగా పని భారం పెరిగింది. తహసిల్దార్‌ కార్యాలయం, ఎంపీడీవో, వ్యవసాయ కార్యాలయం, ఉపాధి హామీ కార్యాలయం, బాలిక, బాలుర పాఠశాలలో పాటు 18 ప్రభుత్వ గురుకులాలు కళాశాలలో పనిచేయడంతో అధికంగా పని భారం పడుతుంది. కేవలం కౌడిపల్లిలో చెత్త సేకరించడం నాలుగు నుంచి ఆరు కిలోమీటర్ల వరకు అవుతుంది. పని భారం పెరిగిన జీతం మాత్రం పెరగడం లేదని గ్రామపంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం జీతం రూ. 8500 నుంచి 9500 వరకు ఇస్తున్నారని ప్రభుత్వాధికారులు తెలిపారు.
అదనపు పని భారం తగ్గించాలి: కుక్కునూరు లింగం, గ్రామపంచాయతీ కార్మికుడు
గ్రామంలో కాకుండా వివిధ పాఠశాల ప్రభుత్వ కార్యాలయాల్లో పని భారం తగ్గించాలని గ్రామపంచాయతీ కార్మికులు కుకునూరు లింగం తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనులు చేస్తున్న సకాలంలో జీతాలు రాక ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు.
రూ.18 వేల వేతనం ఇవ్వాలి: బాగయ్య, గ్రామపంచాయతీ కార్మికుడు
గ్రామపంచాయతీ కార్మికులకు నెలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలని గ్రామపంచాయతీ కార్మికులు బాగయ్య తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను అణచివేసి తమ శ్రమదోపిడిని దోచుకుంటుందని ఆయన తెలిపారు.
20 సంవత్సరాలు చేస్తున్న జీతం పెరగడం లేదు: కారోబార్‌ ఎల్లం
ఎన్ని ప్రభుత్వాలు మారిన తమ రాతలు మారడం లేదని కారోబార్‌ బుజరంపేట ఎల్లం తెలిపారు. ఎన్నికలకు ముందు నాయకులు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మనెంట్‌ చేస్తామని ఎన్నికలలో హామీలు ఇచ్చిన నాయకులు ఎన్నికల తర్వాత వాటిని మరిచిపోతున్నారని ఆయన అన్నారు. గత 20 సంవత్సరాలుగా కారోబార్‌ పనిచేస్తున్నానని ఈ చాలీచాలని జీతంతో కుటుంబం గడపడం చాలా కష్టంగా మారిందని ఆయన అన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకనుగుణంగా తమకు చట్టప్రకారం వేతనాలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.