నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికై జూలై 30న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్ పిలుపునిచ్చారు. సోమవారం హుస్నాబాద్ లో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ హుస్నాబాద్ ఉమ్మడి మండలం సమావేశం సమ్మయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రవికుమార్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేస్తామని మల్టీపర్పస్ విధానం రద్దు చేస్తామని పొందు మరిచిపోయారన్నారు. పెరిగిన ధరలతో కార్మికులు చాలీచాలని జీవితాలు గడపాల్సి వస్తుందని అన్నారు. ప్రతి కార్మికుడికి నెలకు 26వేల రూపాయల వేతనాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య పనుల్లో ఉన్నప్పుడు ప్రమాదాలు జరిగితే ప్రమాద బీమా సౌకర్యం రూ.10 లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు పంచాయతీ బడ్జెట్ నుండి ఇన్సూరెన్స్ చేయించాలని డిమాండ్ చేశారు. పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం ,గుర్తింపు కార్డులు తదితర డిమాండ్ల సాధన కోసం తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు సంపత్, మహేందర్, సదానందం, శ్రీనివాస్, సమ్మయ్య, అజయ్, వెంకటయ్య, కుమార్, శ్రీకాంత్, శ్రీనివాస్, సారయ్య, తిరుమల తదితరులు పాల్గొన్నారు.