మూడేండ్లు అయినా ముగియని పనులు..

– కొనసాగుతున్న మన ఊరు మనబడి మరమ్మత్తులు..

– పైలెట్ బడి పనులే కాని వైనం…
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రభుత్వాలు మారినప్పుడల్లా పధకాల పేర్లు మారడం సాదారణం.కానీ పని విధానం మారక పోవడం సహజంగా కావడం విచారకరం. అలాగే ఏదైనా పధకం కొత్తగా అమలు చేసేటపుడు పైలెట్ ప్రాజెక్టుగా ముందుగా నమూనాగా కొన్ని చోట్ల ముందుగా పూర్తి చేసి దాని ఆధారంగా మొత్తం అమలు చేస్తారు.కానీ ఆదర్శం మే చతికిల పడితే నిదర్శనం ఏముంటుంది. 2022 – 2023 విద్యా సంవత్సరం నాటి ప్రభుత్వం పాఠశాలలు పునర్నిర్మాణం కోసం “మన ఊరు –  మన బడి” పేరుతో పధకం అమలు చేసి మండలంలోని 23 పాఠశాలలను ఎంపిక చేసింది.నిధులు మంజూరు చేసింది. ఇందులో ఆసుపాక,గుమ్మడి వల్లి ప్రాధమిక పాఠశాలలను పైలెట్ ప్రాజెక్టు గా ఎంపిక చేసి నాటి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు 20 మార్చి 22 నాడు శంకుస్థాపన చేసారు.కానీ ఇంకా కొన్ని పాఠశాలలు తో పాటు ఈ రెండు బడులు పనులు కొనసాగుతూనే ఉన్నాయి.ఇప్పటికీ ఆసుపాక లో పనులు పూర్తి కాలేదని ప్రధానోపాధ్యాయులు రాంబాబు తెలిపారు. ఇదే విషయం అయి ఈ పనులు పర్యవేక్షిస్తున్న ఐ.బి ఏఈ క్రిష్ణ ను వివరణ కోరగా 20 పాఠశాలల పనులు పూర్తి అయి వారికి అప్పగించామని,మూడు పాఠశాలలకు రంగులు మాత్రమే వేయాల్సి ఉంటుందని తెలిపారు.