సీఎం రేవంత్‌కు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ప్రశంసలు

– తెలంగాణ భాగస్వామ్యం ఎందరికో స్ఫూర్తి నిచ్చిందని వ్యాఖ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని సమర్థవంతమైన నాయకత్వంతో అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని వరల్డ్‌ ఎకనామిక్‌ఫోరం అభినందించింది. ఈ మేరకు ఫోరం అధ్యక్షులు బొర్గే బ్రెండే, మేనేజింగ డైరెక్టర్‌ మిరెక్‌ డెసెక్‌ సీఎంకు లేఖ రాశారు. ”వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంకు మీ మద్దతు, సహకారానికి ధన్యవాదాలు, గతేడాది ప్రారంభించిన హెల్త్‌ టెక్‌, లైఫ్‌ సైన్సెస్‌లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ”కొలాబ్రేషన్‌ ఫర్‌ దీ ఇంటిలిజెంట్‌ ఏజ్‌” అనే థీమ్‌తో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ వార్షిక సమావేశం 2025లో మీ చురుకైన భాగస్వామ్యానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. రాబోయే పదేండ్లలో తెలంగాణను ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే మీ విజన్‌తో సదస్సులో పాల్గొన్న వారు స్ఫూర్తి పొందారు. ఆధునిక సాంకేతికత, ప్రతిభ, స్వఛ్చమైన ఇంధనం, స్థిరమైన వృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడానికి రైజింగ్‌ తెలంగాణ 2050 యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడానికి కంట్రీ స్ట్రాటజీ డైలాగ్‌లో మీ ఉపన్యాసం పలువురిని ఆకర్శించింది. 2047 నాటికి హైదరాబాద్‌ను భారతదేశంలోని మొట్టమొదటి నెట్‌-జీరో కార్బన్‌ నగరంగా చేయాలనే మీ ఆలోచనలను పలువురు స్వాగతించారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాం. ఫోరమ్‌ కమ్యూనిటీ తరపున, దావోస్‌లో మీ భాగస్వామ్యం, విలువైన సహకారానికి ధన్యవాదాలు” అని సీఎంను లేఖలో వారు అభినందించారు.