ఎన్నికల ‘ప్రపంచం’

– 2024లో 50కి పైగా దేశాల్లో ఎలక్షన్స్‌
– మొత్తం జనాభాలో 45 శాతం ఓట్లు ఇక్కడే
– భారత్‌లోనూ ఈ ఏడాదే ఓట్ల పండగ
– ఇప్పటికే పాక్‌ వంటి కొన్ని దేశాల్లో ముగిసిన ప్రక్రియ
– ఎన్నికల నిర్వహణలో భారత్‌తో సహా పలు దేశాల ప్రదర్శన దారుణం
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 50కి పైగా దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రపంచం మొత్తం జనాభాలో 45 శాతం ఓట్లు ఈ దేశాల నుంచే ఉండటం గమనార్హం. భారత్‌లోనూ ఈ ఏడాదే ఎన్నికలు జరగనున్నాయి. పాక్‌ వంటి కొన్ని దేశాల్లో ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అధికారం ఎవరిదనే విషయంలో తుది ఫలితాల కోసం ఎదురు చూస్తున్నది. అయితే, ఆయా దేశాల్లో ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు సంబంధించి పలు అంతర్జాతీయ సంస్థలు తమ అధ్యయనాల్లో ఆందోళన వెలిబుచ్చాయి. ఇందులో భారత్‌తో సహా పలు దేశాల ప్రదర్శన అంత సానుకూలంగా లేవని వెల్లడైంది. ఈ సంస్థల వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. ఈ దేశాల్లో ఎన్నికలు ఎంత స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుగుతున్నాయో అంచనా వేస్తే, వాటిలో చాలా దేశాల్లో ప్రజాస్వామ్యం తిరోగమనంలో ఉందని తెలుస్తున్నది. కొన్ని దేశాల్లో మాత్రమే సానుకూలత ఉండటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరగటం, అనేక దేశాల్లో ఈ సంవత్సరం ఎన్నికలు జరగటంతో.. 2024 చరిత్రలో అత్యధికంగా పోల్‌ అయిన ఓట్లను చూడవచ్చని అంచనాలు సూచిస్తున్నాయి.
ఈ ఎన్నికలలో ఎక్కువ భాగం ఆసియా, యూరప్‌, ఉత్తర అమెరికాలో కేంద్రీకృతమై ఉన్నాయి. ఆఫ్రికా, దక్షిణ అమెరికా నుంచి కొన్ని దేశాలు కూడా ఈ సంవత్సరం ఇప్పటికే తమ దేశ నాయకులను ఎన్నుకున్నాయి. ఐరోపాలోని యూరోపియన్‌ పార్లమెంట్‌కు మాత్రమే ఓటు వేస్తున్న, తమ దేశ ప్రభుత్వాన్ని ఎన్నుకోని దేశాలు ఎన్నికల మూడ్‌లో ఉన్నాయి.
ఆఫ్రికాలోని ద్వీపసమూహ దేశమైన కొమొరోస్‌ 2022 సూచికలో అత్యంత దారుణంగా ఉన్నది. వార్తా నివేదికల ప్రకారం.. ప్రెసిడెంట్‌ అజాలి అసోమాని జనవరిలో నాలుగోసారి తిరిగి ఎన్నికయ్యారు. ఈ పోల్‌ను ప్రతిపక్షాలు ‘మోసపూరితం’గా అభివర్ణించాయి. ప్రతిపక్షాలు ఎన్నికలను బహిష్కరించటంతో ఓటింగ్‌ శాతం చాలా తక్కువగా 16 శాతంగా నమోదైంది.
భారత్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌తో సహా ఉపఖండంలోని దేశాలు ఇండెక్స్‌లో మధ్యస్థంగా లేదా దిగువ భాగంలో ఉన్నాయి. సాధారణ ఎన్నికల అనంతరం పాకిస్థాన్‌లోని రెండు ప్రధాన పార్టీలు ప్రధానమంత్రి ఎవరనే దానిపై పోరాడుతున్నాయి. పోలింగ్‌ రోజున మొబైల్‌ ఇంటర్నెట్‌ షట్‌ డౌన్‌ కావటంతో ఫలితాలు ఆలస్యమయ్యాయి.
ఇటీవల, భారత్‌లోని చండీగఢ్‌లో జరిగిన మేయర్‌ ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని విజేతగా ప్రకటించిన తీరుపై సుప్రీంకోర్టు తీవ్రంగా విమర్శించింది. ప్రిసైడింగ్‌ అధికారి బ్యాలెట్‌లను తారుమారు చేస్తున్నట్టు వీడియోలలో కనిపించింది. భారత ప్రధాన న్యాయమూర్తి దీనిని ”ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం” చేయటంగా అభివర్ణించారు.
రష్యా, ఉజ్బెకిస్తాన్‌, ఇండోనేషియా, కంబోడియా, మంగోలియా వంటి తోటి ఆసియా దేశాలు కూడా సూచికలో సాపేక్షంగా తక్కువ స్థానంలో ఉన్నాయి. భారత్‌ 0.53 స్కోరుతో ఇండెక్స్‌ మధ్యలో ఉంది. 2012 నుంచి 2022 మధ్య న్యాయమైన ఎన్నికల సూచికలో మార్పు ఇండెక్స్‌లో భారత్‌ ప్రదర్శన ఆశించినంతగా లేదు. భారత్‌తో పాటు కొమొరోస్‌, హంగేరి, బంగ్లాదేశ్‌, పోలాండ్‌, ఎల్‌ సాల్వడార్‌ గత దశాబ్దంలో ఇండెక్స్‌ అత్యంత క్షీణించిన దేశాలలో ఉన్నాయి. ఉజ్బెకిస్తాన్‌, రొమేనియా, టోగో దేశాలు గత దశాబ్దంలో ఇండెక్స్‌లో అభివృద్ధిని కనబర్చాయి.