నవతెలంగాణ-రాజేంద్రనగర్
హైదర్‌గూడ సెలబ్రిటీ జిమ్ సెల్లార్‌లో ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జియాగూడకు చెందిన రాహుల్ (28)రోజులానే హైదర్‌గూడలోని సెలబ్రిటీ జిమ్‌కు వచ్చి వ్యాయామం చేశారు. తర్వాత తిరిగి సెల్లార్‌లో తన బైక్ కోసం వెళ్లగా కొందరు దుండగులు రాహుల్‌పై ఒక్కసారిగా కత్తులతో విచక్షణా రహితంగా దాడిచేయగా.. అతను అక్కడికక్కడే మృతిచెందాడు. దుండగులు అక్కడ నుంచి పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్లూస్ టీం సాయంతో అన్ని ఆధారాలు సేకరించారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పోలీసు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.