అభిమానులు అత్యుత్సాహం.. ఎమ్మెల్యే కి అవమానం…

– మెచ్చా మెడలో వాడిపోయిన గజ మాల..
– ప్రారంభంలో వేయాల్సిన మాల ముగింపులో వేసిన అభిమానులు…
నవతెలంగాణ – అశ్వారావుపేట : ప్రచార ప్రాపకం లో పడిన అభిమానుల అత్యుత్సాహం సగౌరవంగా చేయాల్సిన సత్కారం  కాస్తా విస్తు పోయేలా చేసింది.గౌరవ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ను శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కొందరు అభిమానులు అశ్వారావుపేట లో గజ మాలతో ఘనస్వాగతం పలుకుతామని అనుకున్నారు.అందుకు తగ్గట్టు గజమాల ను తయారు చేసి ప్రొక్లైనర్ తో మండల పరిషత్ పూర్వ కార్యాలయం ముందు ఉదయం 10 గంటలకే సిద్దం చేసారు.కానీ ఆయన కార్యక్రమం లో జాప్యం జరగడంతో రోజంతా ఎండలో ఎండి,ప్రధాన కూడలిలో లేచి పడిన దుమ్ము ధూళి తో వాడిపోయిన గజమాల ను నీటితో తడిపి సాయంత్రం ఆయన కార్యక్రమం ముగింపులో తన మెడలో వేసారు. అయితే పొద్దస్తమానం ఎండలో ఉన్న దండను ఇలా గౌరవ వ్యక్తులకు వేయడం సబబు కాదని పలువురు పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి పూజకు వాడే పూలదండలు కానీ, పూజ్యులైన వ్యక్తులకు స్వాగతం పలుకుతూ వేసే పూలమాలలు నాణ్యమైన వాటిని, అప్పటికప్పుడు పూలతో తయారు చేసిన  మాలలను మాత్రమే వాడతారు. పైగా ఈ మాలలు కార్యక్రమం ఏదైనా, ఎంతటి గొప్ప వారికైనా ప్రారంభంలోనే వారికి అలంకరించడం సంప్రదాయం కూడా. ఇలా వాడి న దండలు వేయడం అనేది సంస్కారవంతమైన పని కాదు అని పలువురు సాంప్రదాయ వాదులు ఆవేదన చెందుతున్నారు. ప్రచారం చేసుకోవడానికి ఫొటో కోసం ఏర్పాటు చేసిన విదంగా ఉందని పలువురు వ్యాఖ్యానించడం ఇక్కడ వాస్తవికతను బహిర్గతం చేస్తుంది.