తెలంగాణ రాష్ట్రంలో ఇక స్పెషల్ సినిమా షోస్‌కు అనుమతి ఇవ్వమని, టికెట్ రేట్స్‌ను కూడా పెంచబోమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోషియేషన్ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ చైర్మన్ విజేందర్ రెడ్డి మాట్లాడుతూ, ‘సినిమా టికెట్ ధరలను పెంచటం వలన ప్రేక్షకులకు కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే సాధారణ సినిమాలకు కూడా పెరిగిన టికెట్ ధరలనే వసూలు చేస్తున్నారని వారు భావిస్తున్నట్లు మాకు తెలిసింది. ఒక్కో సినిమాకు ఒక్కో రేటు పెట్టటం వలన ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు. టికెట్ రేట్స్‌ను పెంచుతూ వచ్చే జీవోలను ప్రేక్షకులు సరిగ్గా గమనించరు. అదే రేట్స్ కంటిన్యూ అవుతున్నాయని భావిస్తుంటారు. ఆ ప్రభావం సినిమా కలెక్షన్స్‌పై పడుతున్నాయి. ఇకపై టికెట్ రేట్స్ పెంచబోమంటూ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో థియేటర్స్‌కు ప్రాణం పోసినట్ట య్యింది. టికెట్ రేట్స్ పెరగకుండా ఫిక్స్డ్‌గా ఉంటే ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమాను చూసి ఆదరిస్తారు. అందరికీ మేలుజరిగే నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి, సినిమాటోగ్రఫీ మంత్రికి ధన్య వాదాలు’ అని అన్నారు.