అప్పుడు చందమామ..

అప్పుడు చందమామ..ఇప్పుడు సత్యభామ రెండు దశాబ్దాల కెరీర్‌లో స్టార్‌ హీరోల సరసన ఎన్నో సక్సెస్‌ ఫుల్‌ సినిమాలు చేసింది హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌. సౌత్‌ ఇండిస్టీతో పాటు హిందీలోనూ నటించి పేరు తెచ్చుకుంది. 60 సినిమాల్లో వైవిధ్యమైన క్యారెక్టర్స్‌తో నటించి ‘క్వీన్‌ ఆఫ్‌ మాసెస్‌’గా ప్రేక్షకుల అభిమానం పొందిన కాజల్‌…ప్రస్తుతం సెకండ్‌ ఇన్నింగ్స్‌ లాంటి కెరీర్‌ను మొదలుపెట్టింది. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌లో ‘సత్యభామ’గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర అమరేందర్‌ అనే కీలక పాత్రను పోషించారు. అవురమ్‌ ఆర్ట్స్‌ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ”మేజర్‌” చిత్ర దర్శకుడు శశికిరణ్‌ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్‌ ప్లే అందించారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ కథతో దర్శకుడు సుమన్‌ చిక్కాల రూపొందించారు. ఈ నెల 7న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా కాజల్‌ మీడియాలో ముచ్చటించింది. నేను ఇప్పటివరకు ఎన్నో క్యారెక్టర్స్‌, మూవీస్‌ చేశాను. అయితే సత్యభామ సినిమా లాంటి ఎమోషనల్‌ మూవీ చేయడం ఇదే తొలిసారి. ఇందులో యాక్షన్‌ పార్ట్‌ కూడా చేశాను. ఈ చిత్రంలో నటిస్తుంటే ఇప్పటిదాకా ఫీల్‌ కాని కొన్ని ఎమోషన్స్‌ అనుభూతి చెందాను. అవన్నీ మీకూ రియలిస్టిక్‌గా అనిపిస్తాయి. నన్ను చాలాకాలం టాలీవుడ్‌ చందమామ అని పిలిచేవారు. ఇప్పుడు సత్యభామ అని పిలిచినా సంతోషిస్తాను. నాకు ఆ రెండూ కావాలి. చందమామ బ్యూటిఫుల్‌ నేమ్‌, సత్యభామ పవర్‌ ఫుల్‌ నేమ్‌. నాకు రెండూ ఇష్టమే. ఈ కథ చెప్పినప్పుడు ఇన్‌స్టంట్‌గా ఓకే చెప్పాను. అంతలా నచ్చిందీ కథ. శశికిరణ్‌ మంచి డైరెక్టర్‌. తను ఈ మూవీకి స్క్రీన్‌ ప్లే ఇస్తూ ప్రెజెంటర్‌గా ఉన్నారు. అన్ని విధాలుగా ఈ సినిమా బాగా వచ్చేలా చూసుకున్నారు. దర్శకుడు సుమన్‌ చిక్కాల ఫస్ట్‌ టైమ్‌ డైరెక్షన్‌ చేస్తున్నా..ఎంతో కన్విక్షన్‌తో వర్క్‌ చేశారు. మా ప్రొడ్యూసర్స్‌ కొత్త వాళ్లైనా సినిమాని చాలా బాగా చేశారు. భారతీయుడు 2 సినిమా రిలీజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నా. భారతీయుడు 3 లోనూ నా క్యారెక్టర్‌ ఉంటుంది.