అప్పుడు గంగూలీ..

Then Ganguly..– తప్పిన టైమ్డ్‌ ఔట్‌ ప్రమాదం
– సఫారీ కెప్టెన్‌ స్మిత్‌ క్రీడాస్ఫూర్తి
న్యూఢిల్లీ : శ్రీలంక, బంగ్లాదేశ్‌ ప్రపంచకప్‌ మ్యాచ్‌లో ఎంజెలో మాథ్యూస్‌ టైమ్డ్‌ ఔట్‌గా నిష్క్రమించటం చర్చనీయాంశంగా మారింది. క్రీడా స్ఫూర్తిని షకిబ్‌ అల్‌ హసన్‌ మంటగలిపాడని విమర్శలు వస్తున్నాయి. 146 ఏండ్ల క్రికెట్‌ చరిత్రలో టైమ్డ్‌ ఔట్‌గా పెవిలియన్‌కు చేరిన తొలి ఆటగాడు మాథ్యూస్‌. ఐసీసీ నిబంధనల ప్రకారం కొత్త బ్యాటర్‌ 120 సెకండ్ల లోపు క్రీజులోకి వచ్చి బంతిని ఎదుర్కొవాలి. లేదంటే, టైమ్డ్‌ ఔట్‌ నిబంధన ప్రకారం నిష్క్రమించాల్సి ఉంటుంది. అయితే, క్రికెట్‌లో ఫీల్డింగ్‌ జట్టు అప్పీల్‌ చేస్తేనే అంపైర్‌ నిర్ణయం తీసుకుంటారనే సంగతి తెలిసిందే. మాథ్యూస్‌ అంశంలో బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకిబ్‌ అప్పీల్‌కు వెళ్లాడు. మాథ్యూస్‌ అడిగినా అప్పీల్‌ వెనక్కి తీసుకోలేదు. మాథ్యూస్‌ తరహాలో నిర్దేశించిన సమయంలో తొలి బంతిని ఎదుర్కోలేని కొన్ని సంఘటనలు ఉన్నాయి. అందులో భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ ఉదంతం సైతం ఉంది. నిజానికి గంగూలీ టైమ్డ్‌ ఔట్‌ కావాల్సి ఉన్నప్పటికీ.. దక్షిణాఫ్రికా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ క్రీడా స్ఫూర్తితో బయటపడ్డాడు.
భారత్‌, దక్షిణాఫ్రికా 2007 కేప్‌టౌన్‌ టెస్టు. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 1.2 ఓవర్లలోనే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది. నం.3 బ్యాటర్‌ ద్రవిడ్‌ క్రీజులో ఉండగా నం.4 బ్యాటర్‌ సచిన్‌ బ్యాటింగ్‌కు రావాలి. కానీ అంతకముందు సఫారీ ఇన్నింగ్స్‌లో సచిన్‌ మైదానం వీడాడు. దీంతో మరో ఐదు నిమిషాల తర్వాతనే అతడు క్రీజులోకి రాగలడు. నం.5 బ్యాటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ బాత్‌రూమ్‌లో స్నానం చేస్తున్నాడు. ఈ సమయంలో సౌరవ్‌ గంగూలీ ప్యాడ్స్‌ కట్టుకుని బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ ప్రక్రియకు 6 నిమిషాలు పట్టింది. అంపైర్‌ డార్లీ హార్పర్‌ విషయాన్ని సఫారీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌కు వివరించాడు. పరిస్థితులను అర్థం చేసుకున్న స్మిత్‌.. గంగూలీపై టైమ్డ్‌ ఔట్‌ అప్పీల్‌కు వెళ్లలేదు. ఆ ఇన్నింగ్స్‌లో గంగూలీ 89 బంతుల్లో 46 పరుగులు చేశాడు. మాథ్యూస్‌ టైమ్డ్‌ ఔట్‌తో గంగూలీ అంశంలో గ్రేమ్‌ స్మిత్‌ క్రీడా స్ఫూర్తి తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.