– మూడు హైకోర్టుల్లో ఒక్క మహిళా న్యాయమూర్తి లేరు
– ఏడు హైకోర్టుల్లో కేవలం ఒక్కొక్కరే
– సుప్రీం కోర్టులో ముగ్గురు మాత్రమే
న్యూఢిల్లీ : దేశంలో సుప్రీం కోర్టు, 26 హైకోర్టుల్లో 790 మంది న్యాయమూర్తుల్లో కేవలం 111 మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. అయితే మూడు హైకోర్టుల్లో ఒక్క మహిళా న్యాయమూర్తి కూడా లేరు. అలాగే ఏడు హైకోర్టుల్లో ఒక్కో మహిళా న్యాయమూర్తి మాత్రమే ఉన్నారు. ఈ మేరకు రాజ్యసభలో సిపిఎం ఎంపి జాన్ బ్రిట్టాస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో 34 మంది న్యాయమూర్తులుండగా, అందులో కేవలం ముగ్గురే మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. ఉత్తరాఖండ్, త్రిపుర, మేఘాలయ హైకోర్టుల్లో ఒక్క మహిళా న్యాయమూర్తి కూడా లేరు. ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, జార?ండ్, మణిపూర్, ఒరిస్సా, పాట్నా, సిక్కిం హైకోర్టుల్లో ఒక్కరు చొప్పున మహిళ న్యాయమూర్తులు ఉన్నారు. జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్ హైకోర్టుల్లో మహిళా న్యాయమూర్తులు ఇద్దరు చొప్పున ఉన్నారు. రాజస్థాన్ (3), గౌహాతి (4), ఆంధ్రప్రదేశ్ (5), కేరళ (5), అలహాబాద్ (6), కర్ణాటక (7), తెలంగాణ (7), కలకత్తా (8), గుజరాత్ (8), ఢిల్లీ (9) మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. అత్యధికంగా పంజాబ్, హర్యానా హైకోర్టులో 15 మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. తరువాత మద్రాస్ హైకోర్టుల్లో 12 మంది, ముంబాయి హైకోర్టులో 11 మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు.