ఆ రెండూ ఉన్నాయి

కాజల్‌ అగర్వాల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్న సినిమా ‘సత్యభామ’. నవీన్‌ చంద్ర అమరేందర్‌ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్‌ ఆర్ట్స్‌ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాస రావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ”మేజర్‌” చిత్ర దర్శకుడు శశికిరణ్‌ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్‌ ప్లే అందించారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ కథతో దర్శకుడు సుమన్‌ చిక్కాల రూపొందించారు. ఈ నెల 7న ఈ సినిమా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు వస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు సుమన్‌ చిక్కాల మీడియాతో మాట్లాడుతూ, ‘నాకు సినిమాలంటే ప్యాషన్‌. రైటింగ్‌ వైపు ఆసక్తి ఉండేది. కొన్ని హిట్‌ సినిమాలకు స్టోరీ డిస్కషన్స్‌లో పాల్గొన్నాను. శశికిరణ్‌ నాకు మంచి మిత్రుడు. ఆయన సినిమాలకు స్క్రిప్ట్‌ సైడ్‌ వర్క్‌ చేశాను. ఈ సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యత నాకు అప్పగించాడు శశి. ఈ కథలో ఎమోషన్‌, యాక్షన్‌ రెండూ ఉన్నాయి. ఎమోషన్‌, యాక్షన్‌ రెండూ కాజల్‌ చేయగలరని నమ్మాం. కాజల్‌ ఈ కథ విన్నాక వెంటనే తాను చేస్తున్నట్లు చెప్పారు. యాక్షన్‌ పార్ట్స్‌ కోసం ఆమె ఎంతో కష్టపడ్డారు. డూప్‌ లేకుండా యాక్షన్‌ సీక్వెన్సులు చేశారు. కొందరు పోలీస్‌ ఆఫీసర్స్‌ తాము టేకప్‌ చేసిన కేసుల విషయంలో ఎమోషనల్‌గా పనిచేస్తారు. అలా ”సత్యభామ” ఒక కేసు విషయంలో పర్సనల్‌గా తీసుకుంటుంది, ఎమోషనల్‌ అవుతుంది. బాధితురాలికి న్యాయం చేసేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమవుతుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక అమ్మాయికి సాయం చేసే పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కాజల్‌ క్యారెక్టర్‌కు ప్రేక్షకులంతా కనెక్ట్‌ అవుతారు’ అని చెప్పారు.