నవతెలంగాణ-బోధన్
ధాన్యం చేతికిరావడంతో కొనుగోలు కేంద్రాల కోసం రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ధాన్యం కోతలు పూర్తి చేసుకొని రాశులుగా పోగుచేసి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కేంద్రాలు ప్రారంభించకపోవడంతో ఎక్కడ అకాల వర్షాలకు కురిస్తే.. తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి కొంటామని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది. కానీ నేటికీ ఎక్కడా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు. దాంతో రైతులు చేతికొచ్చిన వరి పంటను కోసి ఆరబెడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో రైతులు దళారులకు విక్రయించి నష్టపోతున్నారు. అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారే కానీ ఇప్పటికీ ఏర్పాటు చేయకపోవడంతో తాము దళారులను ఆశ్రయించి నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి సొసైటీల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.