సాగుకు సవాళ్లెన్నో..?

ప్రజల ఆహార అవసరాలు తీరడానికి వ్యవసాయం తప్పనిసరి. మనదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వ్యవసాయ యోగ్యమైన భూమిని కలిగి ఉంది. దేశ ఆర్థికవ్యవస్థలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జనాభాలో యాభై శాతానికి పైగా జీవనోపాధిని కలిగిస్తుంది. యాభై ఎనిమిది శాతానికి పైగా గ్రామీణ కుటుంబాలకు వ్యవసాయమే ఆధారం. దేశ జీడీపీలో వ్యవసాయ వాటా సుమారు పద్దెనిమిది శాతం. దేశం శ్రామిక శక్తిలో యాభై యెనిమిది శాతం ఈ రంగంలోనే ఉన్నారు. ఆహార పరిశ్రమలకు కావలసిన ముడి పదార్థాలు వ్యవసాయం నుండే లభిస్తున్నాయి. అధిక జనాభాతో అభివృద్ధి చెందుతున్న మన దేశంలో ప్రజల ఆహార భద్రతను నిర్ధారించడంలోను, పరిశ్రమలు సేవారంగాల వృద్ధికి వ్యవసాయానిది ముఖ్యపాత్ర. కానీ నేడు దేశంలో వ్యవసాయం పర్యావరణ, ఆర్థిక, సంస్థాగత, సాంకేతికతపరంగా సవాళ్లను ఎదుర్కొంటోంది.
ప్రపంచీకరణ వలన రైతు ఆదాయం తగ్గింది. దేశంలోని చాలా ప్రాంతాలలో సాగువిధానాలు ప్రాచీన పద్ధతిలోనే కొనసాగిస్తున్నారు. నాణ్యమైన విత్తనాల కొరత పెద్ద సమస్యగా మారింది. దేశంలోని దాదాపు అరవై ఐదు శాతం వ్యవసాయం రుతుపవన వర్షపాతంపై ఆధారపడి ఉంది. వాతావరణ మార్పులు అస్థిర రుతుపవనాలకు కారణమవుతున్నాయి. వర్షపాతంలో హెచ్చుతగ్గులు కరువులు లేదా వరదలకు దారితీస్తున్నాయి. ఫలితంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏటా అస్థిరత్వానికి గురవుతోంది. దేశంలో గణనీయమైన సంఖ్యలో చిన్న, సన్నకారు రైతులున్నారు. తరతరాలుగా కుటుంబ సభ్యుల మధ్య జరిగిన భూవిభజన వలన, జనాభా ఒత్తిడి కారణంగా, చిన్న రైతులు అప్పులు తీర్చుకోవడానికి తమ భూమిలో కొంత భాగాన్ని అమ్ముకోవడం వలన సాగుభూమి చిన్న కమతాలుగా మారిపోతున్నాయి. ఇంకా ఇవి ఛిన్నాభిన్నంగా ఉండటం వలననీటిపారుదల సరిగా జరగడం లేదు. యాంత్రీకరణకు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంభించడానికి ఆటంకం కలుగుతోంది. ఇది పంటల ఉత్పాదకతను తగ్గిస్తోంది. భూమి పరిమాణం చాలా తక్కువగా ఉన్నప్పుడు సాగు ఆర్థికంగా ఉండదు. భూ వనరులపై అధిక జనాభా ఒత్తిడి కారణంగా వర్షాధార ప్రాంతాలు, ముఖ్యంగా పొడి భూములు తక్కువ దిగు బడిని ఎదుర్కొంటున్నాయి. వరి, గోధుమలు, పత్తి, నూనె గింజలతో సహా భారతీయ పంటల దిగుబడులు అంత ర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి.
మానవ కార్యకలాపాల వల్ల వర్షాధార ప్రాంతాలు కూడా నేల కోతను క్షీణతను ఎదుర్కొంటోంది. ఒకే పంటను పదే పదే సాగుచేయడం వల్ల నేల పోషకాలును కోల్పోయి నిస్సారంగా మారింది. చాలా ప్రాంతాలలో సాగునీరు కోసం భూగర్భజలాలను అధికంగా వాడడం వల్ల తాజా భూగర్భజల స్థాయిలు క్షీణించాయి. ఎరువులు, పురుగుమందులు, విత్తనాల ధరతో పాటుగా లేబర్‌ ఛార్జీలు కూడా పెరుగుతున్నాయి. పంట పెట్టుబడికి రైతులు అధిక వడ్డీకి రుణాలు తెస్తున్నారు. పంట నష్టపోవడం, పంటలకు గిట్టుబాటుధర లేకపోవడం, అధిక ఖర్చులు వలన సగానికి పైగా వ్యవసాయ కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. వాణిజ్యపంటలు సాగుచేసే రైతులు ఎక్కువగా నష్ఠపోతున్నారు. కరువు, పంట నష్టాలు వలన అప్పుల ఊబిలో కూరుకుపోయి ఒక్కోసారి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నాణ్యమైన ఎరువులు ఉపయోగించ పోవడం వలన నిస్సారమైన నేల పంట ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోది. దీనివల్ల దిగుబడి తగ్గి వ్యవసాయ ఉత్పాదకత తగ్గుతోంది.అసమర్థమైన వ్యవసాయ మార్కెటింగ్‌ వ్యవస్థలు ధరల అస్థిరతకు దారితీస్తాయి. సరైన నిల్వ, రవాణా సౌకర్యాలు లేకపోవడం వలన రైతులు వెంటనే తక్కువ ధరకే ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. నేరుగా మార్కెటింగ్‌ విధానం లేకపోవడం వలన వచ్చే ఆదాయంలో కొంత భాగం మధ్యవర్తుల పాలవుతున్నది. ప్రస్తుతం ఉన్న పంటల విధానం కొన్ని ప్రధాన పంటల వైపు మాత్రమే మొగ్గుచూపే విధంగా ఉన్నాయి. పంటలలో వైవిధ్యం లేకపోవడం వల్ల వ్యవసాయ రంగం తెగుళ్లు, వ్యాధులు, మార్కెట్‌ ఒడిదుడుకుల బారినపడుతోంది. సాగులో ఆధునిక సాంకేతికలు అమలు పరచడం లేదు.
భారతీయ వ్యవసాయం సవాళ్లను పరిష్కరించ డానికి బహుముఖ విధానం అవసరం. వ్యవసాయ పనితీరును మెరుగు పరచడం, ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వం, గ్రామీణాభివృద్ధికి భరోసా ఇవ్వడానికి ఈ సవాళ్లను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత. సమర్థవంతమైన నీటిపారుదల పద్ధతులు, వర్షపునీటి సంరక్షణను అమలు చేయాలి. తీవ్రమైన వాతావరణ సంఘటనల కోసం ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను అందుబాటులోకి తేవాలి. ఆహారోత్పత్తిని పెంచేందుకు ఎప్పటికప్పుడు నిర్ణయించే ఆహార ధాన్యాల ధరలకు తగిన ప్రోత్సాహాన్ని అందించడం ద్వారా వారు సహేతుకమైన ఆదాయాన్ని పొందేలా చూడాలి. పారదర్శక సరసమైన ధరల విధానాలను ఏర్పాటు చేయాలి. మెరుగైన ధరల ఆవిష్కరణ కోసం సమర్థవంతమైన మార్కెట్‌ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. రైతులు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా నేరుగా విక్రయించే ఏర్పాటు చేయాలి. అధునాతన వ్యవసాయ సాంకేతికతలు అందిపుచ్చుకోడానికి డిజిటల్‌ వ్యవసాయ పద్ధతులపై శిక్షణ అందించాలి. భారతీయ వ్యవసాయం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి కేంద్రం ప్రధానంగా స్వామినాథన్‌ కమిషన్‌ను అమలు చేయాలి. అప్పుడే రైతుల జీవనోపాధి మెరుగుపడే అవకాశం ఉంటుంది.
– డిజె మోహన రావు, 9440485824