అమ్మాయిల చదువుకు ఆటంకాలెన్నో…

అమ్మాయిల చదువుకు ఆటంకాలెన్నో...‘మనలో సగం మందిని వెనక్కి నెట్టేసినపుడు మనమందరం విజయం సాధించలేము’ అంటారు నోబుల్‌ పురస్కార గ్రహీత, పిల్లల హక్కుల కార్యకర్త మలాల యూసుఫ్‌జారు. అవనిలో సగం.. ఆకాశంలో సగం.. సమాజంలో సగం.. అంటూ గొప్పగా చెప్పుకుంటున్న అమ్మాయిలు విద్యా అవకాశాల్లో మాత్రం నేటికీ ఆమడదూరంలో ఉన్నారనేది లెక్కలు చెబుతున్న వాస్తవాలు. ‘అమ్మాయి చదువు ఇంటికి వెలుగు’ అనేది పాత నానుడి. అయితే ‘అమ్మాయి చదువు సమాజానికి వెలుగు’ అనేది నేటి అవసరం. కానీ ఈ అవసరాన్ని గుర్తించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. అందుకే కొందరు బాలికలు విద్య ఇంకా అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది.
సగం మంది అమ్మాయిలు ప్రాథమిక స్థాయిలోనే చదువుకు దూరమ వుతున్నారని సర్వేలు చెబు తున్నాయి. ‘బాల్య వివా హాలు, రోజురోజుకు పెరిగి పోతు న్న లైంగిక వేధిం పులు, గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు సరిగా లేకపోవడంతో బాలికలు చదువులో వెనకబడు తున్నారు’ అనే విషయాన్ని ఇటీవల నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌ (ఎన్సీపీసీఆర్‌) మాజీ చైర్‌ పర్సన్‌, మెగసెసే అవార్డు గ్రహీత శాంతా సిన్హా నొక్కి చెప్పారు. వారి బృందం కింది స్థాయి వరకు అధ్యయనం చేసి వెలికి తీసిన నిజాలివి.
చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఈ మధ్య కాలంలో తల్లిదండ్రుల ఆలోచనల్లో కొంత మార్పు వస్తోంది. అబ్బాయిలతో సమానంగా తమ ఆడపిల్లలనూ బాగా చదివించాలని కోరుకుంటు న్నారు. అయితే సమాజంలో, ప్రభుత్వ విధానాల్లో ఏమాత్రం పెద్దగా మార్పు రావడం లేదు. ఇదే అమ్మాయిల చదువుకు ప్రధాన సవాలుగా మారిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. మన ప్రభుత్వాలు అమ్మాయిల చదువుకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. నేటికీ 70 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడమే ఇందుకు నిదర్శనం. మరీ ముఖ్యంగా గ్రామీణ భారతంలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కొన్ని చోట్ల ఉన్నా వాటిని వినియోగించుకునేందుకు నీటి సౌకర్యం ఉండదు. దాంతో అవి మురికి కూపాలకు ఆనవాళ్లుగా మారిపోయాయి. దీని వల్ల యుక్త వయసుకు వచ్చిన అమ్మాయిలు పాఠశా లలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని, మధ్యలోనే చదువు మానేస్తున్నారని పలు సర్వేల్లో బయటపడిన వాస్తవం.
‘కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ అంటూ అమ్మాయిలు పెండ్లి చేసుకునేందుకు నిధులు కేటాయించేందుకు ప్రభుత్వాలు తెగ పోటీ పడుతున్నాయి. అమ్మాయిల పెండ్లికి చూపిస్తున్నంత ఆసక్తి చదువుకు మాత్రం చూపించడం లేదు’ అంటూ శాంతాసిన్హా చేసిన విమర్శలో నిజం లేకపోలేదు. బాలికలను వంటింటికే పరిమితం చేయాలనే పురుషాధిక్య భావజాలాన్ని ప్రభుత్వాలే పనిగట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నాయి. అందుకే విద్యా అవకాశాలు మెరుగుపరిచేందుకు నిధులు కేటాయించడం లేదు. పాఠశాలల్లో, హాస్టళ్లలో అమ్మాయిలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టడం లేదు.
ఇక కేంద్రం జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టింది. కానీ దానికి అవసరమైన నిధులు మాత్రం కేటాయించలేదు. ఈ విధానంలో తీసుకొచ్చిన అత్యాధునిక మార్పులను అందుకోలేక పేదలకు విద్య మరింత ఆర్థిక భారం కాబోతోంది. ఈ భారానికి ముందుగా బలయ్యేది బాలికలే. ఏది ఏమైనా మహిళలకు సాధికారత కల్పించేందుకు అత్యంత ముఖ్యమైన సాధనాల్లో విద్య ఒకటి. మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడానికి బాలికా విద్య చాలా కీలకం. అమ్మాయిల చదువు వారి జీవితాలను, కుటుంబాలనే కాదు సమాజాన్ని కూడా సమర్థవంతంగా మార్చగలదు. ఆర్థిక అవకాశాలను మెరుగుపరుస్తుంది. వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. జీవితంలో సొంత నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహిస్తుంది. అందుకే ప్రతి ఆడపిల్లకు నాణ్యమైన విద్య అందించేలా చూడడం చాలా అవసరం. ఇవన్నీ అందరూ ఒప్పుకునే నిజాలే. కానీ వీటిని సాధించడంలోనే అసలు సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రభుత్వాలు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నాయి.
ప్రతి అమ్మాయి అభివృద్ధి చెందడానికి, ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడే సమాజాన్ని సృష్టించాల్సిన అవసరం మనందరిపై ఉంది. తమ బాధ్యతల నుండి తప్పుకుంటున్న ప్రభుత్వాలను నిలదీయాల్సిన అవశ్యకత నేటి పౌరసమాజంపై ఉంది. అమ్మాయిల అభివృద్దికి ఆటంకంగా మారిన పాలకులను ప్రశ్నించాలి. వారి భవితకు బంగారు బాటలు పడాలంటే ప్రభుత్వాలు సన్నద్ధం కావాలి. స్వేచ్ఛగా పాఠశాలలకు వచ్చేలా ప్రోత్సహించాలి. బాలికా విద్యకు పెట్టుబడి పెట్టడం అనేది తమ నైతిక ఆవశ్యకతగా ముందు ప్రభుత్వాలు గుర్తించాలి. దీనికోసం నిబద్దతతో కృషి చేయాలి. అప్పుడే బాలికా అభివృద్ధి సాధ్యమవుతుంది. తద్వారా సమాజం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది.