వేణు గీతికకు పేమ్రతో…
ఎలా ఉన్నావు చిట్టితల్లి… నేను రాస్తున్న ఉత్తరాలు వీలున్నప్పుడల్లా చదువుతున్నందుకు చాలా సంతోషం. ఉత్తరాల్లో ఉన్న గొప్పతనం అదే. జాగ్రత్తగా దాచుకుని, గుర్తు వచ్చినప్పుడల్లా చదువుకోవచ్చు. ఇవాళ నీకు మనుషుల మనస్థత్వాల గురించి చెబుతాను. మనుషులు రకరకాలుగా ఉంటారు. ఆలోచనలూ అంతే. కొందరు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టి ఆనందిస్తూ ఉంటారు. ఇలాంటి వారు మన చుట్టూనే, మనతోనే ఉంటారు. కానీ వారి మనసు ఎలాంటిదో అర్థం చేసుకోవడం చాలా అవసరం. కొందరి ఆలోచనలను త్వరగా గుర్తించగలం, కొందరిని కొంచం ఆలస్యంగా. వీళ్ళు ఎలా ఉంటారంటే ఎదుటి వాళ్ళు అందంగా ఉన్నా భరించలేరు. ఐశ్వర్యం, చదువు, సంతోషంగా ఉంటే ఓర్చుకోలేరు. ఎదుటి వాళ్ళను మాటలతో బాధ పెట్టి చాలా సంతోష పడుతుంటారు.
మనల్ని పది మందిలో అవమానించడం, సూటి పోటీ మాటలు అనటం, ఒక వైపు మనతో మంచిగా మాట్లాడుతూనే హాని చేయడం లాంటివి చేస్తుంటారు. వాళ్ళను మనం మార్చలేము. ఎందుకంటే మంచి చెప్పినా వీళ్లకు చెడుగానే అనిపిస్తుంది. ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. వారితో మంచిగా ఉంటూనే దూరంగా ఉండాలి. మనల్ని బాధపెట్టే వాళ్లకు దూరంగా ఉండటమే మంచిది. వారితో ఎటువంటి వాదనలకీ దిగకూడదు. ఎప్పుడైనా ఎక్కడైనా కనిపించినా ఒక పలకరింపుతో సరిపెట్టుకోవాలి.
ఎదుటి మనిషి సంతోషాన్ని, ఎదుగుదలను చూసి ఓర్చుకోలేరు. కొందరు మొదట్లో బాగానే ఉన్నా, తర్వాత తర్వాత వాళ్ల మాటల్లో ఎప్పుడో ఒకప్పుడు బైట పడుతుంటారు. అప్పుడు జాగ్రత్త పడాల్సిందే. జీవితంలో ఎన్నో రకాల మనుషులు ఎదురవుతూ ఉంటారు బంగారు తల్లీ. ఎవరినీ మనం మార్చ లేము కనుక జాగ్రత్తగా ఉంటూ, లౌక్యంగా వ్యవహరించాలి తల్లి. జాగ్రత్తగా ఉంటావు కదూ..!
ప్రేమతో అమ్మ
హొ- పాలపర్తి సంధ్యారాణి