లోక్‌సభలో ప్రయివేటు బిల్లులు పెండింగ్‌ 700లకు పైగానే..

– ఉమ్మడి పౌరస్మృతి, లింగ సమానత్వ సవరణతో సహ పలు కీలకమైనవి..
న్యూఢిల్లీ : లోక్‌సభలో 700కు పైగా ప్రయివేటు బిల్లులు పెండింగులో ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం శిక్షలకు సంబంధించిన నిబంధనల్లో, ఎన్నికల చట్టాల్లో సవరణలకు ఉద్దేశించినవే. పలు బిల్లుల్ని ప్రస్తుత లోక్‌సభ కాలంలోనే అంటే 2019 జూన్‌లో ప్రవేశపెట్టారు. కొన్నింటిని ఇటీవలే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆగస్టులో సభ ముందు ఉంచారు. సభ్యులు తమకు తాముగా ప్రవేశపెట్టేవే ప్రైవేటు బిల్లులు. సభ్యులు నూతన బిల్లుల్ని ప్రవేశపెట్టవచ్చు. లేదా అప్పటికే ప్రవేశపెట్టిన బిల్లుల్లో సవరణలు ప్రతిపాదించవచ్చు. రెండు రోజుల క్రితం లోక్‌సభ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం అలాంటి బిల్లులు 713 పెండింగులో ఉన్నాయి. ప్రయివేటు బిల్లుల్లో ఉమ్మడి పౌరస్మృతి, లింగ సమానత్వం, వాతావరణ మార్పులు, వ్యవసాయం వంటి అంశాలకు సంబంధించినవే కాకుండా ప్రస్తుతం అమలులో ఉన్న క్రిమినల్‌, ఎన్నికల చట్టాలకు సవరణలతో పాటు రాజ్యాంగ నిబంధనలకు ప్రతిపాదించిన సవరణలు కూడా ఉన్నాయి. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రతి శుక్రవారం రెండో అర్థభాగంలో సభ్యులు ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టవచ్చు. అదే సమయంలో ప్రైవేటు బిల్లులపై చర్చ కూడా జరుగుతుంది. వాటిపై తీర్మానాలు సైతం చేస్తారు. ప్రైవేటు బిల్లులపై చర్చ పూర్తవగానే సంబంధిత మంత్రి స్పందిస్తూ బిల్లును ఉపసంహరించుకోవాల్సిందిగా సభ్యుడిని కోరతారు. ప్రైవేటు బిల్లులు ఓటింగుకు రావడం చాలా అరుదుగా జరుగుతుంది.