”రేఖా; ఏం చేస్తున్నావ్? ఇంట్లోని వస్తువులన్నీ జాగ్రత్తగా చూసుకో. ముఖ్యంగా బంగారం, ఇతర విలువైన వస్తువులు ఎవరికీ కనబడకుండా దాచిపెట్టు!” అన్నాడు సురేష్ ఇంట్లోకి వస్తూనే.
”ఎందుకండీ! అన్నీ దాచిపెట్టమంటున్నారు! ఏదైనా టూర్ ప్లాన్ చేశారా? ఎక్కడికీ?” అన్నది ఉత్సాహంగా రేఖ.
”నీ మొహం! ఈ ఎండల్లో బయటికి వెళ్తే మాడి మసై పోతాం! టూర్ లేదు. గీర్ లేదు!”. అన్నాడు సురేష్.
”మరి విలువైన వస్తువులు, బంగారం దాచిపెట్టమంటున్నారు ఎందుకు?” అడిగింది రేఖ.
”అవును బంగారం, విలువైన వస్తువులు ముఖ్యంగా నీ మంగళసూత్రం మరీ జాగ్రత్త!” అన్నాడు.
”నా మంగళ సూత్రానికేమి ఢోకా వచ్చిందీ? మీరు గుండ్రాయిలా దిట్టంగా ఉన్నారు కదా!
అసలు విషయం చెప్పకుండా నాన్చుతాంందుకు?” అన్నది విసుగ్గా రేఖ.
”ఏం లేదు! మన రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచింది. రేపు దేశంలో కూడా కాంగ్రెస్సే గెలిస్తే, బంగారం, విలువైన వస్తువులు, మంగళ సూత్రాలను, మన ఆస్తిపాస్తులను కాంగ్రెస్ పార్టీ గుంజుకుని పోతుందని పెద్దాయన చెప్పాడు! అందుకే ముందు జాగ్రత్త పడాలని నేను చెబుతున్నాను!” అన్నాడు సురేష్.
పెద్దగా నవ్వింది రేఖ.
”ఎందుకు నవ్వుతావు? అడిగాడు సురేష్.
”మా అత్తయ్య, మామయ్యలకు మొన్న పెద్ద ఫంక్షన్ చేశాము కదా! ఎందుకో చెప్పండి?” అన్నది రేఖ.
”అదా! మా అమ్మ నాన్నలకు పెళ్ళై 75 ఏండ్లయిందని ఫంక్షన్ చేశాము!” అదీ ఇప్పుడెందుకు? అన్నాడు చిరాగ్గా సురేష్.
”అప్పుడు మీ అమ్మగారి వద్ద ఎంత బంగారం ఉండింది? ” అన్నది రేఖ.
”మొత్తం 20 తులాల వరకు ఉండొచ్చు! అయినా మా అమ్మ బతికే ఉంది కదా! అప్పుడే నీ కన్ను బంగారం మీద పడిందా?” అన్నాడు కోపంగా.
”నా కన్ను పడిందా లేదా తర్వాత చెబుతాను! మన పెండ్లై ఎన్నేండ్లయిందీ?” అడిగింది రేఖ.
”20 ఏండ్లు అయ్యింది! ఇప్పుడవన్నీ అవసరమా?” అన్నాడు సురేష్.
”అవసరమనే అడుగుతున్నాను! పెండ్లిలో మా అమ్మవాళ్లు నాకు ఎంత బంగారం పెట్టారు! ఇప్పుడు బంగారం ఎక్కడుంది?” అడిగింది రేఖ.
”ఓ భారీగా బంగారం పెట్టార్లే! కిందా, మీదా పడి 20 తులాలు పెట్టారు! ఆ బంగారం నేనేమీ అమ్ముకోలేదు. మొన్న బిట్టుగాడి మెడికల్ సీటు కోసం ముత్తూట్ ఫైనాన్స్‌లో పెట్టి గోల్డ్‌లోన్ తీసుకున్నాం! నీవే సంతకం పెట్టావ్ కదా!” అన్నాడు సురేష్ కోపంగా.
రేఖ చిన్నగా నవ్వింది.
”ఎందుకు నవ్వుతావ్!” అన్నాడు చిరాకుగా సురేష్.
”నవ్వకేం చేయమంటారు! 75 ఏండ్ల కిందటి బంగారం మీ అమ్మగారి వద్ద భద్రంగా ఉంది. 20 ఏండ్ల కిందటి నా బంగారం ఆరు నెల్ల కిందనే తనఖా పెట్టము! దీన్ని బట్టి మీకేమి అర్థమైంది?” అన్నది రేఖ.
ఏమీ అర్థం కానట్లు చూశాడు సురేష్.
”మీకు అర్థం కాదులెండి! ఎందుకంటే మీ అమ్మానాన్న మాటలకంటే ఢిల్లీలో ఉన్న పెద్దాయన మాటే మీకు శాసనం! దేశంలో ఎవరు పాలించినా బంగారం కుదువ పెట్టాల్సిన అవసరం మీ అమ్మ గారికి రాలేదు! పైగా మిమ్మల్ని బాగా చదివించి, ఉద్యోగాలిప్పించి, మీకు పెండ్లి కూడా చేశారు. అయినా ఆమె బంగారం ఆమె వద్దే ఉంది! కాని మనిద్దరం సంపాదిస్తున్నాం అయినా బిట్టుగాడి మెడికల్ సీటు కోసం నా బంగారం కుదువ పెట్టాం! అదే సబ్‌కా వికాస్ జరిగి అమృత్ కాల్ వచ్చిన తర్వాత. ఇదంతా మీ పెద్దాయన పాలనలోనే. మనకు అర్థం కావల్సిన విషయమేమిటంటే, బంగారానికి, విలువైన ఆస్తి పాస్తులకు, ఇంకా సరిగ్గా చెప్పాలంటే, అన్నింటికన్నా విలువైన మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. మీ పెద్దాయన పాలనలోనే”. అన్నది రేఖ.
”బేటీ బచావ్!” అన్నాడు పెద్దాయన, మనుషులకు ముఖ్యంగా మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు తెలుసా?” అన్నాడు సురేష్.
”మరీ మణిపూర్‌లో అత్యాచారం చేసి నగంగా ఊరేగించింది ఎవర్నీ? వారు బేటీలు కాదా? లేక మణిపూర్ అనే రాష్ట్రంలో భారత్‌లో లేదా?” అన్నది రేఖ.
”అన్నింటికీ మణిపూర్ పేరు చెపుతారేం?” ఉక్రోషంగా అన్నాడు సురేష్.
”అవును మణిపూర్ గురించే చెబుతాం! ఎందుకంటే అక్కడ జరిగింది మామూలు సంఘటన కాదు! నాగరిక సమాజం సిగ్గుతో తలనరుక్కోవాల్సినంత ఘోరమైన సంఘటన. ఇలాంటి సంఘటన మత తత్వదేశాలైన, పాకిస్థాన, అఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో కూడా జరగలేదు! అయినా మీకు, మీ పెద్దాయనకు ఇది సిగ్గుపడాల్సిన విషయంగా కన్పించదు!” అన్నది రేఖ.
”మణిపూర్ కాకుండా మరొక్కటి చెప్పు!” అన్నాడు సురేష్ బింకంగా
”పుల్వామా సంఘటన మీ పెద్దాయన పాలనలోనే జరిగింది కదా! దాదాపు 33 మంది సైనికులు. హెలికాప్టర్ అందచేయని కారణంగా చనిపోయారు. మీ పెద్దాయన కారణంగా వారి భార్యల మంగళసూత్రాలు తెగిపోయాయి కదా! ఏడాది కాలం నిరంకుశ రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడు తున్న రైతులను పొట్టన బెట్టుకున్నారు కదా! అపుడు రైతుల భార్యలకు మంగళ సూత్రాలుంటాయని గుర్తుకు రాలేదా! లక్షలాది మంది, వైద్య సదుపాయం లేక కోవిడ్‌లో మరణించినపుడు వారి కుటుంభ సభ్యుల మంగళ సూత్రాలేమయ్యాయో ఆలోచించారా?” అన్నది రేఖ.
సురేష్‌కి ఏం మాట్లాడాలో తోచలేదు!
”ప్రజల ఆస్తిపాస్తులు పంచిపెట్టడం గురించి మీరేనా మాట్లాడేది! సహజ వనరులు ఈ దేశ ప్రజలందరి సొత్తు. అలాంటి సొత్తులైన స్పెక్ట్రమ్‌ను ఆంటోనీకి, బొగ్గుగనులు, నౌకాశ్రయాలు ఆదానికీ టోకున పంచి పెట్టే మీ పెద్దాయన ఇలా మాట్లాడొచ్చా? ఈ దేశంలోని అన్ని సంపదలను ఆదానీకి టోకున పంచిపెడుతున్న దేశ ప్రజలకు తెలియదని, అనుకుంటున్నారా?” అడిగింది రేఖ.
సురేష్ తలదించుకున్నాడు.
”దేశ ప్రజల ఆస్తిని అప్పనంగా పంచిపెట్టడమే కాదు, దేశ ప్రజలు బ్యాకులో జమ చేసుకున్న కష్టార్జితాన్ని, అప్పుల కింద ఆదానీకి, అంబానీకి, మాల్యాకు మంజూరు చేసి, ఆ తర్వాత ఆ అప్పులను రద్దు చేస్తున్నాడు మీ పెద్దాయన! ఇదంతా గత పదేండ్లలో రూ.15 లక్షల కోట్లు రద్దు చేసిన అప్పు! ఇది దోపిడీ చేసి ఆదానీ, అంబానీలకు పంచి పెట్టడం కాదా! ఇదంతా చేసింది మీ పెద్దాయన కానీ ఆయనే ఎదుటి వారిని దొంగలని అంటున్నాడు! దొంగే, దొంగా! దొంగా అని అరవటమంటే ఇదే!” అన్నది రేఖ.
సురేష్‌కి నోటి మాట రావటం లేదు.
”గత పదేండ్లలో మీ పెద్దాయన తెచ్చిన అప్పు రూ.100 లక్షల కోట్లు. ఇంత అప్పు తెచ్చి ఒక్క భారీ పరిశ్రమ పెట్టారా? ఒక్క డ్యాం కట్టారా? ఒక్క యూనివర్సిటీ నిర్మించారా? లేదు కదా! మరేం చేశారు? అంటే అంత డబ్బును ఏదో రూపంలో పంచి పెట్టినట్లేగా! ఎవరికి పంచిపెట్టారు? మనిద్దరి అకౌంట్లలోకి రూ.15 లక్షలు కాదు గదా 15 పైసలు కూడా రాలేదు! మనకే కాదు దేశంలో ఎవ్వరి అకౌంట్లలో పైసలు పడలేదు!కాని పదేండ్ల కింద ఎక్కడో ఉన్న ఆదానీ, అంబానీలు ప్రపంచ కుబేరులలో మూడో స్థానంలో ఒకరు, ఐదవ స్థానంలో మరొకరు నిలిచారు! అంటే ఏమిటీ మన దేశ సహజ వన రులు, బయట తెచ్చిన లక్షల కోట్ల అప్పులు, మన గోళ్లూడ గొట్టి వసూలు చేసిన జీఎస్టీ పన్ను, ఆదా యపన్ను ఇవన్నీ మీ పెద్దాయన దోచుకుని అదానీ, అంబానీలకు, పంచిపెడు తున్నారు!” అన్నది రేఖ.
”అవును! నిజమే గత పదేండ్ల నుండే దేశంలో దొంగలు పడ్డారు”! అన్నాడు సురేష్.
– ఉషాకిరణ్.