నాపై కుట్ర జరుగుతోంది

There is a conspiracy against me– నన్ను కింద పడేయాలని చూస్తున్నారు : సీఎం రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు
– కొడంగల్‌ నా గుండె చప్పుడు
– వంశీ చందర్‌రెడ్డిని గెలిపిస్తే మీ సిపాయిలా పనిచేస్తాడు : పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీఎం
నవతెలంగాణ-కొడంగల్‌, పరిగి
”రేవంత్‌రెడ్డిని దెబ్బతీయడానికి వెనుక గూడుపుఠాణి చేస్తున్నారు. నాపై కుట్ర జరుగుతోంది. నన్ను కింద పడేయాలని బీఆర్‌ఎస్‌, బీజేపీ చూస్తున్నాయి. మనల్ని దెబ్బతీయడానికి పన్నాగాలు పన్నుతున్నాయి. ఇది రేవంత్‌రెడ్డిని దెబ్బతీయడం కాదు.. కొడంగల్‌ అభివృద్ధిని దెబ్బతీయడమే. కొడంగల్‌ నుంచి 60 ఏండ్ల కిందట అచ్యుతరెడ్డి మంత్రి అయ్యారు. మళ్లీ ఆ తర్వాత లేరు. కొడంగల్‌ నుంచి గెలిచిన నాకు సోనియా గాంధీ ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. 100 రోజుల్లో కొడంగల్‌లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను” అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం కొడంగల్‌ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని కొడంగల్‌లోని రేవంత్‌ రెడ్డి నివాసంలో నిర్వహించారు. మండలాల వారీగా సమావేశం నిర్వహించి, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మహబూబ్‌నగర్‌ పార్లమెంటు అభ్యర్థి వంశీచంద్‌ రెడ్డి, ఆలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌, కొడంగల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతి రెడ్డితో కలిసి కార్యకర్తలనుద్దేశించి సీఎం మాట్లాడారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులతోనూ మాట్లాడారు. కొడంగల్‌ తన గుండెచప్పుడు అని అన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ ఎంపీగా వంశీ చందర ్‌రెడ్డిని గెలిపిస్తే సిపాయిలా పనిచేస్తారని చెప్పారు. కొడంగల్‌ నియోజకవర్గం నుంచి 60 ఏండ్ల కిందట అచ్యుతరెడ్డి గెలిచి రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. అప్పటి నుంచి అనేకమంది ఎమ్మెల్యేలుగా గెలిచినా ఎవరికీ మంత్రి పదవి అవకాశం రాలేదన్నారు. కొడంగల్‌లో నామినేషన్‌కు వచ్చి వెళ్లిన తన కోసం.. ప్రతి కార్యకర్తా ఎంతో కష్టపడి 33వేల మెజార్టీ ఇచ్చారన్నారు. కొడంగల్‌ ప్రాంతానికి ముఖ్యమంత్రిగా సోనియా గాంధీ అవకాశం ఇచ్చారని తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి బూర్గుల రామకృష్ణారావు తర్వాత ఎవరికీ అవకాశం రాలేదని, సోనియాగాంధీ ఈ ప్రాంతానికి మళ్లీ అవకాశం ఇచ్చారని అన్నారు. కొడంగల్‌ నియోజకవర్గానికి పాఠశాలలు, మెడికల్‌, ఇంజినీరింగ్‌, వెటర్నరీ, నర్సింగ్‌ కళాశాలలు, మహిళా డిగ్రీ, దౌల్తాబాద్‌, బోంరాస్‌పేట్‌ మండలాలకు జూనియర్‌ కళాశాల తీసుకొచ్చామన్నారు. కొడంగల్‌- నారాయణపేట ఎత్తిపోతల పథకంతో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. కొడంగల్‌ను అభివృద్ధి చేస్తుంటే.. కొందరు తనను ఓడించాలని చూస్తున్నారని, అభివృద్ధి చేస్తున్నందుకు తనను ఓడించాలా అని ప్రశ్నించారు. డీకే అరుణ కాంగ్రెస్‌లో మంత్రి పదవులు అనుభవించి బీజేపీలోకి వెళ్లి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హౌదా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. పదేండ్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంటే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హౌదా రాలేదని, డీకే అరుణ మాత్రం జాతీయ ఉపాధ్యక్ష పదవి తీసుకున్నారని అన్నారు. రాజకీయాలకతీతంగా కొడంగల్‌ నియోజకవర్గం నుంచి వంశీ చందర్‌రెడ్డికి 50 వేల మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హౌదా తీసుకొస్తారని హామీ ఇచ్చారు. పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్‌.. ఈ నియోజకవర్గంలో ఒక్క డబుల్‌ బెడ్రూం ఇల్లు ఇవ్వలేదన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలైనా వచ్చాయా అని ప్రశ్నించారు. మతం, భాష పేరుతో కోస్గిలో పంచాయితీ పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. గతంలో కొడంగల్‌కు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదన్నారు. కొడంగల్‌ను దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇక్కడి ప్రజలు నిలబడితేనే తను నాయకుడైనానని తెలిపారు.
ముఖ్యమంత్రి కాన్వారుకి తప్పిన ప్రమాదం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్‌ పర్యటనకు వెళ్తుండగా మన్నెగూడ దగ్గర తన కాన్వారులో ఒక కారు టైరు పంచర్‌ అయి పగిలిపోయింది. డ్రైవర్‌ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. వెంటనే కారు టైరు మార్చుకొని కొడంగల్‌ బయలుదేరారు.