కారుకు అభ్యర్థులు కరువు..

There is a shortage of candidates for the car.– ఎంపీలుగా పోటీ చేసేందుకు నేతల విముఖత
– గడ్డం రంజిత్‌రెడ్డి, గుత్తా అమిత్‌, చామకూర భద్రారెడ్డి సహా పలువురిది ఇదే పరిస్థితి
– బలవంతంగా బరిలోకి దింపారంటున్న నామా
– లోక్‌సభ ఎన్నికల వేళ గులాబీ పార్టీలో గుబులు
–  ఎటూ తేల్చుకోలేని అధిష్టానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు జోరు మీదున్న కారు పార్టీలో.. ప్రస్తుత లోక్‌సభ ఎలక్షన్ల వేళ తీవ్ర గందరగోళం నెలకొన్నది. సిట్టింగ్‌ ఎంపీల్లో ఓడిపోతామనే భయం, కిందిస్థాయిలో కాంగ్రెస్‌ జోష్‌ కనబడుతుండటంతో ఆశావహుల్లో నైరాశ్యం నెలకొన్నది. వెరసి ఎంపీ సీట్లకు అభ్యర్థులు కానరాని పరిస్థితి ఆ పార్టీలో తలెత్తుతోంది. దీన్ని గమనించిన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగి తెలంగాణ భవన్‌లో సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తున్నా నాయకులు, కార్యకర్తల్లో ధైర్యం నింపలేక పోతున్నారు. క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న పరిణామాలు కూడా ఇందుకు బలం చేకూర్చేలా ఉన్నాయి. ఇటీవలి వరకూ నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు ఉవ్విళ్లూరిన శాసన మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌ రెడ్డి ఇప్పుడు పోటీకి నో అంటున్నారు. ఇదే విషయాన్ని ఆయన కేసీఆర్‌కు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఆ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే, ఒక్క సూర్యాపేటలో తప్పితే మిగతా ఆరింటిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. దాంతోపాటు మాజీ మంత్రి, సూర్యా పేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి… అమిత్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ కారణాల రీత్యా ఆయన పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్నారు. చేవెళ్ల నుంచి సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న గడ్డం రంజిత్‌రెడ్డికి మరోసారి టిక్కెట్‌ ఇస్తున్నామంటూ మొదట్లోనే గులాబీ పార్టీ ప్రకటించింది. అయితే మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సతీమణి, వికారాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరటంతో చేవెళ్లలో రాజకీయ సమీకరణాలు మారాయి. అందువల్ల తాను చేవెళ్ల నుంచి పోటీ చేయలేనంటూ రంజిత్‌, కేసీఆర్‌కు తెలిపినట్టు సమాచారం. మల్కాజ్‌గిరి నుంచి అవకాశమిస్తే పోటీ చేస్తానంటూ లేదంటే అసలు పోటీకే దూరంగా ఉంటానంటూ ఆయన స్పష్టం చేసినట్టు తెలిసింది. మరోవైపు మల్కాజ్‌గిరి నుంచి కూడా రంజిత్‌ పోటీ చేసే అవకాశం లేదంటూ తెలంగాణ భవన్‌ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
తాజా రాజకీయ పరిణామాలు, దుండిగల్‌లో భవనాల కూల్చివేత నేపథ్యంలో మల్కాజ్‌గిరి నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కుమారుడు డాక్టర్‌ భద్రారెడ్డి ఇప్పుడు మనసు మార్చుకున్నట్టు తెలిసింది. ఇటీవల మల్లారెడ్డి, భద్రారెడ్డి కాంగ్రెస్‌లోకి టచ్‌లోకి వచ్చిన సంగతి విదితమే. ఇక ఖమ్మం నుంచి సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావు… ‘నేను వద్దన్నా, మళ్లీ టిక్కెట్‌ అంటగట్టారు… ఇప్పుడు ఖర్చు భరించటం కష్టం, భరించినా కాంగ్రెస్‌ ధాటికి ఖమ్మంలో గెలవటం మరీ కష్టం…’ అంటూ తన సన్నిహితుల వద్ద వాపో తున్నట్టు వినికిడి. ఇదే పరిస్థితి సికింద్రాబాద్‌లోనూ కనిపిస్తోంది. అక్కడి నుంచి బీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ కోసం ఎదురు చూసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ కుమారుడు సాయికిరణ్‌… ఇప్పుడు వెనుకంజ వేస్తున్నారు. గత ఎన్నికల్లోనూ ఆయన ఇక్కడి నుంచే పోటీ చేశారు. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సికింద్రాబాద్‌ నుంచి గెలవటం కష్టమని భావిస్తున్న ఆయన పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇలా నేతలందరూ పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్‌… తనకు అత్యంత దగ్గరగా ఉండే ముఖ్యులతో అంతర్గత సమావేశం నిర్వహించారు. పలు ఎంపీ స్థానాల నుంచి పోటీ చేయాలంటూ వారికి ఆయన సూచించారు. నల్లగొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి నుంచి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మల్కాజిగిరి నుంచి ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, వరంగల్‌ నుంచి ఎర్రోళ్ల శ్రీనివాస్‌ లేదా గ్యాదరి బాలమల్లు, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్‌ లేదా కాసాని వీరేశ్‌లను పోటీకి కేసీఆర్‌ ఒప్పించినట్టు తెలిసింది. వీరి అభ్యర్థిత్వాలు ఖరారు కావాల్సి ఉంది.
నేడు నల్లగొండ, భువనగిరిపై సమీక్ష
లోక్‌సభ నియోజకవర్గాల సమీక్షల్లో భాగంగా శనివారం నల్లగొండ, భువనగిరి స్థానాలపై కేసీఆర్‌ సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగే ఈ భేటీకి ఆ రెండు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఆయా ఎంపీ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశముంది.