ఖమ్మంలో ఉద్యోగుల ‘వన’ సందడి..

'Vana' noise of employees in Khammam.. – సకల ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం
– హాజరైన మంత్రులు పొంగులేటి, తుమ్మల, ఎంపీ రామసహాయం, ఎమ్మెల్సీ అలుగుబెల్లి..
– భారీగా ఉద్యోగుల హాజరు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ ఎంప్లాయిస్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌, టీచర్స్‌, వర్కర్స్‌ అండ్‌ పెన్షనర్స్‌ (టీజీఈజేఏసీ) ఆధ్వర్యంలో ఖమ్మం-గొల్లగూడెం రోడ్డులోని చెరుకూరి మామిడితోటలో ఆదివారం అత్యంత కోలాహలంగా ఖమ్మం జిల్లా సకల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం కొనసాగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా, మహబూబాబాద్‌ జిల్లా నుంచి పదివేల మందికి పైగా ఉద్యోగులు కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రోజంతా తోటలో ఉల్లాసంగా గడిపారు. క్రీడా, సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. పసందైన వంటకాలను ఆరగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 60కి పైగా శాఖల ఉద్యోగులు, యూనియన్లు, జర్నలిస్టులతో సహా ఈ వన సమారాధనకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఉద్యోగులు సహకరిస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో 204 ఉద్యోగ సంఘాలు ఐక్యంగా పనిచేశాయి కాబట్టే రాష్ట్రం సిద్ధించిందని తెలిపారు. వచ్చే మార్చి నాటికి ఆర్థిక లేమిని అధిగమించి, ఉద్యోగులు, రాష్ట్ర ప్రజల ముఖంలో చిరునవ్వులు చూస్తామని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధైర్యం చేసి ప్రజలకు ఇచ్చిన హామీలను నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న నిర్బంధాలను అధిగమించి ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛాయుతంగా పనిచేస్తున్నామని ఏలూరి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మంత్రులను ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, చైర్మెన్‌ మారం జగదీశ్వర్‌ శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, వైరా ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌ నాయక్‌, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మెన్‌ మువ్వా విజరుబాబు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్‌ రాయల నాగేశ్వరావు, టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి, టీజీవో జిల్లా అధ్యక్షులు కాస్తాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి మోదుగు వేలాద్రి, రుక్మారావు, దేవరకొండ సైదులు, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.