జిల్లాలో చిన్న పిల్లల వైద్యుల కొరత

There is a shortage of doctors for small children in the district – మంచిర్యాల ప్రధాన ఆస్పత్రిలో 14 మందికి ఇద్దరే
– పనిచేసేందుకు ముందుకు రానివైనం
– ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న బాధితులు
నవతెలంగాణ-మంచిర్యాల
మంచిర్యాల ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి వచ్చే పిల్లలకు కష్టాలు తప్పడం లేదు. సరిపడా చిన్న పిల్లల డాక్టర్‌లు లేక పోవడంతో సరైన వైద్యం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనితో గత్యంతరం లేక కొందరు అందుబాటులో ఉన్న ప్రయివేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తూన్నారు. బాధితులు జిల్లాలో వైరల్‌ ఫివర్స్‌ ప్రభలుతున్న నేపథ్యంలో పెద్దలతో పాటు చిన్న పిల్లలు సైతం విష జ్వరాల బారిన పడుతున్నారు. ఆర్థికంగా ఉన్న వారు ప్రయివేట్‌ ఆస్పత్రులను సంప్రదించగా, పేదలు ప్రభుత్వ ఆస్పత్రిని ఆశ్రయిస్తున్నారు. ఒక్క మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రిలో తప్ప మండలాల వారీగా ఉన్న పీహెచ్‌సీల్ల్లో చిన్న పిల్లల వైద్యులు లేరు. బెల్లంపల్లిలో ఒకరు లక్షట్టిపేట లో ఒక్కరు చిన్న పిల్లల వైద్యులు ఉన్నపటికీ వారు వారి ప్రయివేట్‌ ఆస్పత్రిలోనే ఎక్కువ గడుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. లక్షట్టిపేటలో తాత్కాలిక భవనం ఇంకా అందుబాటులోకి రాక పోవడం తో ఇప్పుడు ఉంటున్న అద్దె షెడ్డులోనే నెట్టుకొస్తున్నారు. సరి పడ బెడ్‌ లు, రోగులను పరీక్షించేందుకు గదులు లేక పోవడం తో అక్కడికి వెళ్ళాలి అంటేనే రోగులు జంకుతున్నారు. ఇంకా పిల్లలకు సంబంధించిన ఎటువంటి సదుపాయలు లేక పోవడంతో లక్షేట్టిపేట్‌ పరిసర ప్రాంతాల నుంచి చిన్న పిల్లలతో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. తల్లి తండ్రులు మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో 14 మంది చిన్న పిల్లల డాక్టర్‌లు పని చేయాల్సి ఉండగా కేవలం ఇద్దరే వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. ప్రతి రోజు 50 వరకు ఓపీ ఉండగా అందులో 20 కేసులు అడ్మిట్‌ చేస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. జిల్లా నలుమూలల నుంచి మంచిర్యాలకు జనాలు క్యూ కట్టడంతో పని ఒత్తిడి కారణంగా విధులు నిర్వహించలేని పిడియట్రీషన్‌లు లీవ్‌లు, ఉద్యోగం చేయలేమాంటూ అధికారులకు లెటర్‌లు పెట్టి విధుల నుంచి తప్పుకుంటున్నారు. దీనితో అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే పిల్లలకు సరి అయిన వైద్యం అందడంలేదు. ఇద్దరు ప్రొఫెసర్‌లు, ఇద్దరు అసోసియేట్‌ ప్రొఫెసర్‌లు, 6 గురు పిల్లల నిపుణులు, చంటి పిల్లల విభాగంలో నలుగురు ఉండాల్సి ఉండగా గత కొంత కాలంగా కేవలం ఇద్దరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. గతంలో పని చేసిన నలుగురు విధులు నిర్వర్తించలేమని ఉన్నత అధికారికి తెలిపి విధుల నుండి తప్పుకున్నట్లు సమాచారం.
అధికారి తీరుపై విమర్శలు
జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లోని పిల్లల విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఉన్నత స్థాయి అధికారి తీరుపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఆ అధికారి అహంకారానికి జిల్లాకు చెందిన చిన్న పిల్లల వైద్యులు విధులకు రాజీనామా సమర్పించి ఉన్నత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఇటివలా జిల్లా ఆస్పత్రిలో పని చేస్తున్న 4 గురు పిల్లల డాక్టర్‌లు సైతం విధులు నిర్వర్తించలేము అంటూ ఉన్నత స్థాయి అధికారులకు వినతి పత్రం సమర్పించారు. అయినప్పటికీ అధికారి పద్ధతిలో ఎటువంటి మార్పు రాక పోవడంతో విధుల నుండి తొలిగిపోయినట్లు తెలుస్తోంది. వైద్యుల మధ్య సయోధ్య లేక పోవడం తోనే ఇన్ని సమస్యలు తలేత్తుతున్నట్లు ఉన్నత అధికారులు గుర్తించారు. విధుల నుంచి వెళ్లి పోయిన వైద్యులను తిరిగి విధుల్లోకి తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు ఇటీవల పిడియట్రీషన్‌లు అందరూ కలిసి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు, ఆయన ఉంటే మేము విధులు నిర్వర్థించలేము అంటూ అట్టి అధికారిపై ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌, డీఎంఏ అధికారులకు ఫిర్యాదు చేయడం చర్చ నియంశమైంది. ప్రభుత్వ ఆస్పత్రి సుపరింటెండెంట్‌, డీఎంఏ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం కాస్త బయటకు వచ్చింది. జరిగిన విషయంపై ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ హరీష్‌ చంద్రరెడ్డిని వివరణ కోరగ వచ్చిన ఫిర్యాదును ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, చిన్న పిల్లల డాక్టర్‌లను ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నామన్నారు.